శనివారం 30 మే 2020
Telangana - May 23, 2020 , 14:16:16

అన్నదాత ఆత్మగౌరవంగా బతకాలి : హరీష్‌రావు

అన్నదాత ఆత్మగౌరవంగా బతకాలి : హరీష్‌రావు

సంగారెడ్డి : సాగు లాభసాటిగా మారాలని, అన్నదాత ఆత్మగౌరవంగా బతకాలనే నియంత్రిత పంటల సాగు విధానాన్ని సీఎం కేసీఆర్‌ అమల్లోకి తెస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. నియంత్రిత పంటల సాగు విధానంపై సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి అవగాహన సదస్సులో మంత్రి హరీష్‌రావు పాల్గొని ప్రసంగించారు. వానా కాలంలో మక్కల దిగుబడి తక్కువగా వస్తుంది. దిగుబడి వచ్చే సమయంలో వర్షాలు పడుతున్న క్రమంలో వేసవిలో మక్కలు వేసుకోవాలని ప్రభుత్వం చెబుతుందన్నారు. ఈ సంవత్సరం సంగారెడ్డి జిల్లాలో 3.60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాలన్నారు. వచ్చే సంవత్సరం పత్తికి మంచి డిమాండ్‌ ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.

సంగారెడ్డి జిల్లాలో వానాకాలంలో 25 వేల ఎకరాల్లో మక్కలు సాగు చేస్తున్నారు. రైతులు దీనికి ప్రత్యామ్నాయం ఆలోచించాలి అని చెప్పారు. కందుల ఉత్పత్తి ఎంత వచ్చినా.. మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. ఒకే పంట వేస్తే క్రమంగా భూమిలో సారం తగ్గుతుంది. అందుకే పంటలు మార్చాలని మంత్రి సూచించారు. కొత్త వ్యవసాయ విధానంపై గ్రామస్థాయిలో రైతులకు అవగాహన కల్పించేలా యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసుకోవాలని మంత్రి హరీష్‌రావు అధికారులను ఆదేశించారు.  


logo