సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 16, 2020 , 01:23:07

కొవిడ్‌ బాధితులకు మెరుగైన సేవలు:ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు

కొవిడ్‌ బాధితులకు మెరుగైన సేవలు:ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట, నమస్తే తెలంగాణ: ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్‌ బాధితులకు ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నదనీ, మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణలో కొవిడ్‌ మరణాల రేటు చాలా తక్కువ ఉన్నదని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టంచేశారు. బుధవారం సిద్దిపేట ఏరియా దవాఖానలో 100 పడకల ప్రత్యేక కొవిడ్‌ ఐసోలేషన్‌ బ్లాక్‌ను జెడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజాశర్మ, ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొవిడ్‌ బాధితులకు అందుతున్న వైద్యసేవలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌, వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ నిరంతరం సమీక్షిస్తున్నారని తెలిపారు. సిద్దిపేట కొవిడ్‌ ఐసొలేషన్‌ బ్లాక్‌కు 28 మంది వైద్యులను, 150 మంది స్టాఫ్‌ నర్సులను నియమించినట్లు వివరించారు. కొవిడ్‌ బాధితులకు ఇక్కడి ఐసోలేషన్‌లో సేవలందించనున్నట్లు వెల్లడించారు. లక్షణాలు లేని వారికి హోంఐసొలేషన్‌కు అవకాశం లేనివారిని ఇక్కడికి తరలించి వైద్య సేవలందిస్తామన్నారు. అనంతరం నంగునూరు మండలంలో పర్యటించిన మంత్రి.. డంపుయార్డులను నెలలోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కరోనాతో వ్యాపారాలు లేక ఇబ్బందులు పడుతున్న చిరువ్యాపారులకు ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున అందిస్తున్న ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. జిల్లావ్యాప్తంగా 5176 మందికి రూ. 5.17 కోట్ల జంబో చెక్కును మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు.logo