మంగళవారం 26 మే 2020
Telangana - May 23, 2020 , 01:40:48

రాష్ర్టానికి తండ్రిలా కేసీఆర్‌

రాష్ర్టానికి తండ్రిలా కేసీఆర్‌

  • రైతును రాజు చేయడమే లక్ష్యం
  • ప్రతిపక్షాలు 24 గంటలు కరెంటిచ్చాయా?
  • మంత్రి హరీశ్‌రావు నిలదీత

సిద్దిపేట, నమస్తే తెలంగాణ: తండ్రి తన పిల్లలకోసం ఆలోచించినట్టు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ నిరంతరం ఆలోచిస్తున్నారని, ఈ రాష్ర్టానికి కేసీఆర్‌ తండ్రిలాంటి వారని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. రైతును సంఘటిత శక్తిగా మార్చి రాజును చేయాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని చెప్పారు. సిద్దిపేట జిల్లాకేంద్రంలోని బైరి అంజయ్య గార్డెన్‌లో శుక్రవారం ‘వానకాలం-2020 నియంత్రిత పంటల సాగు’పై అవగాహన సదస్సు జరిగింది. రైతుబంధు సమితి మండల సమన్వయకర్తలు, వ్యవసాయ అధికారులు పాల్గొన్న ఈ సదస్సునుద్దేశించి హరీశ్‌రావు మాట్లాడుతూ.. వానకాలం పంట కోసం రైతుబంధుకు రూ.7 వేల కోట్లు కేటాయించామని, రెండు పంటలకు రూ.14 వేల కోట్లు బడ్జెట్‌లో పెట్టామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి 40 లక్షల ఎకరాలకు రైతుబంధు పథకాన్ని వర్తింపజేస్తున్నామన్నారు. ఇది రైతుకు మేలు చేసే ప్రభుత్వమే కానీ.. రైతుపై రుద్దే ప్రభుత్వం కాదన్నారు. ఏనాడూ రైతు క్షేమాన్ని కోరని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలు అర్థరహితమని చెప్పారు. గతం లో పాలించిన పార్టీలు ఏనాడైనా రైతులకు 24 గంటల కరెంట్‌, రూ.5 వేల రైతుబంధు, గోదావరి జలాలు అందించారా అని మంత్రి హరీశ్‌రావు సూటి గా ప్రశ్నించారు. ప్రతిపక్షాల ఆరోపణలు పసలేనివని, వాటిని రైతులెవరూ నమ్మరని చెప్పారు. ప్రతిపక్షాల ఆరోపణలను రైతులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. విత్తనాలు, ఎరువుల కోసం లైన్లో నిలబెట్టి, కరెంట్‌ మోటార్లు కాలబెట్టి, గోదావరి నీళ్లు, రైతుబంధు ఇవ్వనివారి మాటలు రైతులు వినబోరని చెప్పారు. తమది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వమని నిరూపించామన్నారు. ఈ సదస్సులో కలెక్టర్‌ పీ వెంకట్రాంరెడ్డి, శాసనమండలి చీఫ్‌ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్‌ సోలిపేట రామలింగారెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.


logo