శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 30, 2020 , 15:49:15

ఝూటా మాట‌ల బీజేపీ చిట్టా ఇదే..

ఝూటా మాట‌ల బీజేపీ చిట్టా ఇదే..

  • పూట‌కో పుకారు.. గంట‌కో అబ‌ద్ధం
  • అస‌త్య‌మే బీజేపీ ఆయుధం
  • స‌త్య‌మేవ జ‌య‌తే అనే ఉప‌నిష‌త్ సూక్తి విస్మ‌ర‌ణ‌

సిద్దిపేట :  ఝూటా మాట‌ల బీజేపీ చిట్టాను రాష్ర్ట ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు బ‌ట్ట‌బ‌య‌లు చేశారు. మొత్తం 11 అబ‌ద్దాల‌ను మీడియా సాక్షిగా హ‌రీష్ రావు బ‌య‌ట‌పెట్టారు. సిద్దిపేట‌లో మంత్రి హ‌రీష్ రావు మీడియాతో మాట్లాడారు. రాష్ర్ట బీజేపీ నాయ‌కులు త‌మ వైఖ‌రితో బీజేపీని భార‌తీయ ఝాటా పార్టీగా మార్చేశార‌ని పేర్కొన్నారు. పూట‌కో పుకారు పుట్టించి.. గంట‌కో అబ‌ద్దం మాట్లాడ‌టం బీజేపీ నాయ‌కుల నైజం అని మండిప‌డ్డారు. వెయ్యి అబ‌ద్దాలు ఆడైనా ఒక పెళ్లి చేయాల‌నే సామెత అంద‌రికి గుర్తే.. అలా దుబ్బాక‌లో వెయ్యి అబ‌ద్దాలు ఆడైనా ఒక ఎన్నిక గెల‌వాలె అనే కొత్త సామెత‌ను సృష్టిస్తున్న‌ద‌ని విమ‌ర్శించారు. దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం ప్రారంభం నుంచి ఒక్క బీజేపీ నాయ‌కుడు కూడా నిజం మాట్లాడ‌టం లేదు.. అబ‌ద్దాలే పునాదిగా బీజేపీ నాయ‌కులు త‌ప్పుడు ప్ర‌చారాల‌కు తెర‌తీసింద‌న్నారు. బీజేపీ రాష్ర్ట అధ్య‌క్షుడు మొద‌లుకొని గ్రామ‌స్థాయి వార్డు నేత దాకా అంద‌రూ అబ‌ద్దాలు ఆడేవారే అని ధ్వ‌జ‌మెత్తారు. అస‌త్య‌మే బీజేపీ ఆయుధం అని కోపోద్రిక్తుల‌య్యారు. వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు వారి నైజం అని విరుచుకుప‌డ్డారు. భార‌తీయ సాంప్ర‌దాయానికి తామే ప్ర‌తినిధుల‌మ‌ని చెప్పుకునే బీజేపీ నాయ‌కులు.. స‌త్య‌మేవ జ‌య‌తే అనే ఉప‌నిష‌త్ సూక్తిని విస్మ‌రించారు అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అస‌త్య‌మేవ జ‌య‌తే అని వారు న‌మ్ముతున్నార‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. శ్రీకృష్ణుడు శిశుపాలుని త‌ప్పులు లెక్క‌పెట్టిన‌ట్టు తాను బీజేపీ నేత‌ల అబ‌ద్దాల‌ను లెక్క పెడుతున్నాను. అందులో కొన్నింటిని మీ ముందుకు తీసుకొచ్చాన‌ని మంత్రి హ‌రీష్ రావు పేర్కొన్నారు. 

ఝూటా నంబర్ 1: 

- టీఆర్ఎస్ ప్రభుత్వం,  బీడీ కార్మిక మహిళలకు ఇస్తున్న పెన్షన్ 2016 రూపాయలలో, 1600 రూపాయలు మోడీ గారు  ఇస్తున్నారు అని అన్నారు.  

- పట్ట పగలు పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేస్తుంటే.. నిజాలు నిగ్గు తేల్చాలని తాను సవాలు విసిరాను. అంతే తోక ముడిచారు.  కాంగ్రెస్ పెట్టిన పుర్రె గుర్తుతో బీడీల అమ్మకాలు తగ్గినాయి.  బీడీల అమ్మకాలపై బీజేపీ ప్రభుత్వం 18 శాతం జీఎస్టీ విధించడం వల్ల బీడీల అమ్మకాలు మరింత  పడిపోయాయి. ఈరోజు బీడీ కార్మికులకు 15 రోజుల పని కూడా దొరుకడం లేదు. ఉన్న పనిని  పోగొట్టిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీడీ కార్మికుల జీవితాల్లో మ‌న్ను పోశాయి. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం రూ. 2016 పెన్ష‌న్ ఇచ్చి బీడీ కార్మికులను కడుపుల పెట్టి చూసుకుంటున్నది.   

ఝూటా నంబర్ 2 :

- కేసీఆర్ కిట్ పథకం కింద ఇచ్చే డబ్బు 13 వేలలో..  6 వేల రూపాయలు కేంద్రం ఇస్తుందని ఒకరు, 8 వేలు ఇస్తుంది అని ఇంకొకరు అబద్ధాలు చెప్తున్నారు. 

- అబద్ధం కూడా తలోరకంగా చెప్తున్నారు. నిజానికి ఇందులో కేంద్ర ప్రభుత్వానిది నయా పైసా లేదు.

- కేసీఆర్ కిట్‌ను 100 శాతం టీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మే ఇస్తున్న‌ది. 

ఝూటా నంబర్ 3 :

- గొర్రెల యూనిట్లలో రూ. 50 వేలు బీజేపీ ఇస్తుంటే కేవ‌లం రూ. 25 వేలే టీఆర్ఎస్ ఇస్తున్న‌ద‌ట‌. ప్రజలను గొర్రెలుగా భావించే వారే ఇటువంటి అబద్ధాలు చెప్పగలరు. 

- ఈ పథకం ఖర్చు నూటికి నూరుశాతం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నది. బీజేపీ నాయకులకు యూనిట్ కాస్ట్ కూడా తెలియదు. అంటే అబద్ధమే కాక అజ్ఞానంతో కూడిన అబద్ధం ఆడుతున్నారు. 

- యూనిట్ కాస్ట్ మొత్తం ఒక లక్షా ఇరవై ఐదు వేలు. ఇందులో లబ్దిదారుని వాటా 25 శాతం అంటే రూ. 31,250, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ 75 శాతం అంటే రూ. 93,750 రూపాయలు. ఇది కూడా తెలియకుండా నోటి కొచ్చిన అబద్ధం చెప్పేస్తున్నారు. ఇప్పటి వరకు 77 లక్షల గొర్రెలను 3,70,000 మంది గొల్ల కుర్మ సోదరులకు ప్ర‌భుత్వం పంపిణీ చేసింది. 

ఝూటా నంబర్ 4:

- కేంద్రం రూ. 25 కోట్లతో ఈఎస్ఐ హాస్పిటల్ చేగుంటకు మంజూరు చేస్తే టీఆర్ఎస్ దాన్ని గ‌జ్వేల్‌లో పెట్టుకున్న‌ద‌ని అంటున్నారు. గ‌జ్వేల్‌లో ఈఎస్ఐ ఆస్ప‌త్రి లేదు. చేగుంట‌కు ఈఎస్ఐ ఆస్ప‌త్రి మంజూరు కాలేదు.. ఒక వేళ మంజూరు అయితే ఆధారం చూపించండి.. ఇంత గాలి మాట‌లా? 

ఝూటా  నంబర్ 5:

- రేషన్ బియ్యం సబ్సిడీలో కిలోకు 29 రూపాయలు కేంద్రం భరిస్తుంటే కేవలం 1 రూపాయి మాత్రమే టీఆర్ఎస్ ప్రభుత్వం భరిస్తున్నదట‌. ప్రజలు తినే అన్నం మీద అబద్ధం.. ఉత్త గోబెల్స్ ప్రచారం. 

- కేంద్రం ఇచ్చేది సగం కార్డులకే. మిగతా సగం కార్డుల సబ్సిడీ  పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నది. వారు చెప్తున్న మాట గనుక నిజం అయితే సగం కార్డులు రద్దయి పోతాయి.  రిచ్చే ఆ సగం కూడా 3 రూపాయలకు కిలో చొప్పున. రెండు రూపాయల భారాన్ని భరించి రాష్ట్ర ప్రభుత్వం ఒక రూపాయికే కిలో చొప్పున ప్రజలకు బియ్యం ఇస్తున్నది. కేంద్రం ఐదు కిలోలకే సబ్సిడీ ఇస్తే రాష్ట్రం ప్రజలకు ఆరుకిలోల చొప్పున బియ్యం ఇస్తున్నది. అంటే వారిచ్చే సగం లోనూ ఒక కిలో భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నది.

ఝూటా నంబర్ 6  :

- పాలిటెక్నిక్ కాలేజ్ కు దుబ్బాకలో శంకుస్థాపన జరిగాక సిద్దిపేటకు తరలించారు అని అంటున్నారు.  

- మంజూరు కాలేదు, శంకుస్థాపన అంతకంటే కాలేదు, సిద్దిపేటకు తీస్కపోలేదు. 

ఝూటా నంబర్ 7 :

- కేసీఆరే మోటర్లకు మీటర్లు పెట్టాలని చూస్తున్నాడు. 

- ఇది చోర్ ఉల్టా కోత్వాల్ కు డాటా అన్నట్టు ఉన్నది.

- విద్యుత్తు సంస్కరణల బిల్లు తెచ్చింది వాళ్ళు.. రూ. 2,500 కోట్లు ఎర వేసింది వాళ్ళు.  

- ప్రలోభాలు తిరస్కరించి, బిల్లును  వ్యతిరేకించింది కేసీఆర్ మాత్రమే. 

ఝూటా నంబర్ 8 :

- తెలంగాణా రైతులు పండించిన వరి ధాన్యం కనీస మద్దతు ధరకు కొనేందుకు కేంద్రం రూ. 5,500 కోట్లు విడుదల చేసింది అని అంటున్నారు.

- ఇది పచ్చి బూటకం. కేంద్రం ఒక్క రూపాయి విడుదల చేయలేదు. ఎన్సీడీసీ నుంచి వడ్డీతో కూడిన అప్పు తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఎన్సీడీసీ నేరుగా పౌర సరఫరాల శాఖకు అనుమతి ఇవ్వదు. రాష్ట్ర  ప్రభుత్వం గ్యారంటీ ఇస్తేనే ఆ అప్పు ఇస్తుంది. వడ్డీరేటు ఇతర జాతీయ బ్యాంకుల కన్నా ఎక్కువ. కనుక ఆ అప్పు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు.     

ఝూటా నంబర్ 9 :

- డబ్బులు దొరికిన ఇల్లు మావాళ్ళది కాదు అంటున్నారు. 

- మీవాళ్ళది కానప్పుడు నువ్వెందుకు ఉలిక్కిపడ్డవు ?

- దుబ్బాక లో ప్రచారం ఆపేసి 20 నిముషాల్లో సిద్ధిపేట చేరుకొని ఆ ఇంటిముందు హడావిడి ఎందుకు చేశావు. 

ఝూటా నంబర్  10 : 

- మాకు సంబంధించిన ఎనిమిది మంది ఇండ్ల మీద పోలీసులు దాడులు చేసి సోదాలు చేసారు అని అంటున్నారు. 

- ఉపఎన్నికలలో ఝూటా స్టార్ గా నిలిచింది రఘునందన్ రావు.. ఒకే సంఘటనపై మూడు అబద్ధాలు. నాలుగు ఇండ్లలోనే సోదాలు.. రెండు టీఆర్ఎస్ వాళ్ల‌వి.. రెండు బీజేపీ వాళ్ల‌వి. 

ఝూటా నంబర్ 11 :

- సోదాలో దొరికిన డబ్బులు పోలీసులే పెట్టారు అంటున్నారు. 

- అడ్డంగా దొరికి పోయి, పైనుంచి అబద్ధం.. డబ్బులు తమవేనని స్వయంగా రఘునందన్ అత్తామామలు చెప్పిన వీడియోనే రుజువు.