గురువారం 04 జూన్ 2020
Telangana - Apr 30, 2020 , 14:52:16

కరోనాపై ఐక్యంగా పోరాడుదాం : మంత్రి హరీష్‌రావు

కరోనాపై ఐక్యంగా పోరాడుదాం : మంత్రి హరీష్‌రావు

సిద్దిపేట : కరోనా అందరి సమస్య.. మనమంతా ఐక్యంగా పోరాడాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట ముర్షద్‌గడ్డలో ఫ్రెండ్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పేద ముస్లిం మైనార్టీలకు నిత్యావసర సరుకులను మంత్రి పంపిణీ చేశారు. ప్రతి ఒక్క కుటుంబానికి రూ. 500ల నగదు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. రంజాన్‌ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని ఉపవాసం ఉన్న మీరు.. రాష్ట్ర, దేశ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని అల్లాను ప్రార్థించాలని కోరారు. రంజాన్‌ పండుగ నేపథ్యంలో ఇంట్లోనే నమాజ్‌ చేసి ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆదాయం తగ్గినా, కరోనా నేపథ్యంలో విపత్కర పరిస్థితి ఏర్పడినా పేదలను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్‌ సిద్ధంగా ఉన్నారని మంత్రి స్పష్టం చేశారు.

శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచే ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. అనవసరంగా బయట తిరుగుతూ.. ఇంట్లో వారికి కరోనా అంటించొద్దు. కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విశేషమైన కృషి చేస్తున్నది కాబట్టి ఏ ఒక్కరూ కూడా నిర్లక్ష్యం చేయొద్దని మంత్రి హరీష్‌రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


logo