మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 09, 2020 , 03:32:56

బుంగలు వెదకడమే మీ సంస్కృతి

బుంగలు వెదకడమే మీ సంస్కృతి

  • 270 కిలోమీటర్లమేర కాళేశ్వరం జలాలు  కనబడటంలేదా
  • కాలువలో ఒక్క బుంగను పట్టుకుని రాజకీయంచేస్తారా?
  • కాంగ్రెస్‌ నేతలపై మంత్రి హరీశ్‌రావు ఫైర్‌

కొండపాక/సిద్దిపేట కలెక్టరేట్‌: కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎక్కడ చూసినా గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయని.. నడివేసవిలోనూ 2 వేల పైచిలుకు చెరువులు, కుంటలు మత్తడి దుంకాయని ఆర్థికమంత్రి హరీశ్‌రావు తెలిపారు. వందల కిలోమీటర్ల మేర జలాలు సజీవ గోదావరి తలపిస్తుంటే.. కాంగ్రెస్‌ నాయకులకు కండ్లు మండుతున్నాయని.. వాటన్నింటినీ వదిలి చిన్నపాటి బుంగను చూపి రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. హరితహారంలో భాగంగా బుధవారం మంత్రి హరీశ్‌రావు.. ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డితో కలిసి సిద్దిపేట జిల్లా కొండపాక మండలం కుకునూర్‌పల్లిలోని రాజీవ్‌ రహదారి డివైడర్‌, రోడ్డుకు ఇరువైపులా 1200 మొక్కలను నాటారు.

డీసీసీబీ నూతన శాఖను, ఏటీఎంను ప్రారంభించారు. మహిళా సంఘాలకు రూ.40 లక్షల రుణాల చెక్కులు అందజేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో మంత్రి మా ట్లాడుతూ.. కాంగ్రెస్‌ హయాంలో తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేదన్నారు. గోదావరి నీళ్లను 270 కిలోమీటర్లకు పైగా దూరం నుంచి తెచ్చి రిజర్వాయర్లను నింపుతుంటే.. కాలువలో చిన్న బుంగపడి నీళ్లు పక్కకుపోతే ప్రాజెక్టు మొత్తాన్ని విమర్శిస్తూ.. రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు ప్రజల మధ్య ఉంటూ.. ప్రజల కోసం పనిచేస్తుంటే, కాంగ్రెస్‌ నాయకులు గాంధీభవన్‌లో కూర్చుని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కరోనాతో రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సాగును  ప్రోత్సహించేందుకు 54లక్షల మంది రైతుల ఖాతాల్లో సీఎం కేసీఆర్‌ పంటసాయం జమచేశారని చెప్పారు.

శక్తిని చాటిన మిట్టపల్లి మహిళలు

మిట్టపల్లి స్వయంసహాయకబృందాల మహిళలు స్త్రీశక్తిని చాటారని.. మన మిట్టపల్లి పప్పులు పేరిట పప్పు తయారీ చేపట్టినవారికి మరింత సహకారం అందిస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట రైతుబజార్‌లో ఏర్పాటుచేసిన పప్పు విక్రయకేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.  మహిళలు నాణ్యమైన పప్పును తక్కువ ధరకు ప్రజలకు అందిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, ఎంపీపీ కవిత ప్రవీణ్‌రెడ్డి, జెడ్పీటీసీ ప్రవళిక, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు తదితరులు పాల్గొన్నారు.logo