ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 08, 2020 , 16:32:51

హరినాథ శర్మ నిస్వార్థ సేవలు మరువలేనివి : మంత్రి హరీశ్ రావు

హరినాథ శర్మ నిస్వార్థ సేవలు మరువలేనివి : మంత్రి హరీశ్ రావు

సిద్దిపేట :  కళాశాలల నే సొంత ఇల్లుగా భావించి వాటి అభివృద్ధికి, విద్యార్థుల ప్రగతికి నిస్వార్ధంగా సేవలందించిన మర్పడగ క్షేత్ర నిర్వాహకులు డాక్టర్ చెప్పెల హరినాథ శర్మ సేవలు ఎనలేనివని  మంత్రి  హరీశ్ రావు  అన్నారు. గజ్వేల్ డిగ్రీ కళాశాల తెలుగు విభాగం అధ్యాపకుడిగా పని చేసిన హరినాథ శర్మ ఉద్యోగ విరమణ సందర్భంగా మర్పడగ క్షేత్రంలో జరిగిన పదవీ విరమణ సన్మాన సభలో మంత్రి పాల్గొని మాట్లాడారు. 

నిస్వార్ధంగా విద్యాభివృద్ధికి కృషి చేసి కళాశాలల, విద్యార్థుల వసతుల కల్పనకు ఆయన నిరంతరం పాటుపడే వారని మంత్రి ప్రశంసించారు. అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి అధ్యాపకుల సమస్యలతోపాటు కళాశాలల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను నిరంతరం తన దృష్టికి తెచ్చి పరిష్కరించుకునే వారని మంత్రి తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఏర్పాటు కోసం సామాజిక కార్యక్రమాలతోపాటు దైవికంగా కృషిచేసి ఇచ్చిన సలహాలు సూచనలు మరువలేనివన్నారు. 


జీతం డబ్బులతో జీర్ణ దేవాలయాన్ని పునరుద్ధరణ చేసి తన జీవితాన్ని దేవాలయ అభివృద్ధికి, సమాజాభివృద్ధికి ధార పోసి ఈ ప్రాంత ప్రాశస్త్యానికి  కృషి చేసిన వ్యక్తని పేర్కొన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి దేవాలయ అభివృద్ధికి కఠోర దీక్ష తో మర్పడగ క్షేత్రాన్ని దినదిన అభివృద్ధి చెందేలా కృషి చేశాడన్నారు. హరి నాథశర్మ ఉద్యోగ విరమణ పొందినప్పటికీ భవిష్యత్తులో ఉన్నతమైన స్థానంలో ఉంటారని మంత్రి తెలిపారు.

ఉద్యోగ విరమణ అనంతరం సామాజిక సేవా కార్యక్రమాలతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఆయన సూచించారు. ఆలయ క్షేత్రం అభివృద్ధికి తన శక్తి మేరకు కృషి చేస్తానన్నానని తెలిపారు. అనంతరం హరినాథ శర్మ  దంపతులను మంత్రి శాలువాతో ఘనంగా సత్కరించారు. అంతకుముందు మంత్రికి వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రి హరీష్ రావు విజయ దుర్గ, దుర్గా మాత, మల్లికార్జున స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.