బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Oct 23, 2020 , 01:30:36

అపెక్స్‌ నిర్ణయించాకే సీమ ఎత్తిపోతలు

అపెక్స్‌ నిర్ణయించాకే సీమ ఎత్తిపోతలు

  • అప్పటి దాకా పనులు వద్దు.. ఏపీకి కృష్ణాబోర్డు హెచ్చరిక
  • ఏపీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి హరికేశ్‌మీనా లేఖ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు విస్తరణ పనులపై ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకుపోవద్దని ఆంధ్రపదేశ్‌కు కృష్ణానదీ యాజమాన్య బోర్డు మరోసారి స్పష్టంచేసింది. ఈ మేరకు కృష్ణాబోర్డు సభ్యుడు హరికేశ్‌మీనా బుధవారం ఏపీ జలవనరులశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శికి లేఖ రాశారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కృష్ణాబోర్డు, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి తీసుకున్నాకే కొత్త ప్రాజెక్టులను చేపట్టాలి. కానీ, ఏపీ మాత్రం ఎలాంటి అనుమతుల్లేకుండా శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసే రాయలసీమ ఎత్తిపోతల పథకం, 80వేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో పోతిరెడ్డిపాడు విస్తరణ పనులకు పాలనా అనుమతులు జారీచేసింది.

బేసిన్‌లోని తెలంగాణ ప్రాజెక్టులకు నష్టం వాటిల్లేలా చేపడుతున్న ఈ కొత్త ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కృష్ణాబోర్డుకు, కేంద్రానికి అనేకసార్లు ఫిర్యాదులు చేసింది. దీంతో ఈ పథకంపై ముందుకుపోవద్దని కేంద్ర జల్‌శక్తి అదేశాలతో కృష్ణాబోర్డు గతంలోనే ఏపీని ఆదేశాలు జారీచేసింది. అయితే, కేంద్రం ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఏపీ టెండర్ల ప్రక్రియను పూర్తిచేసింది. ఈ నెల 6న జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌లోనూ తెలంగాణ సీఎం కేసీఆర్‌.. సీమ ఎత్తిపోతలను నిలువరించాలని డిమాండ్‌ చేయడంతోపాటు, కేంద్రం ఆదేశాలను ఏపీ బేఖాతరు చేసిన విషయాన్ని కేంద్ర మంత్రి షెకావత్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కృష్ణా బోర్డు తాజాగా మరోసారి ఏపీకి లేఖ రాయడం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. డీపీఆర్‌ను వెంటనే కృష్ణాబోర్డుకు సమర్పించాలని తాజా లేఖలో సూచించారు. తదుపరి అనుమతి ఇచ్చేదాకా పనులు చేపట్టవద్దని హరికేశ్‌ మీనా స్పష్టంచేశారు.