ఆదివారం 07 జూన్ 2020
Telangana - Apr 02, 2020 , 23:14:26

పెండ్లి చేసుకోవాలని.. ఆస్ట్రేలియా నుంచి వేధింపులు

పెండ్లి చేసుకోవాలని.. ఆస్ట్రేలియా నుంచి వేధింపులు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఆస్ట్రేలియాలో పరిచయమైన యువకుడు...నగరానికి చెందిన యువతిని పెండ్లి చేసుకోవాలని  సోషల్‌ మీడియా వేదికగా బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడు. సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్‌ ప్రాంతానికి చెందిన యువతి ఆస్ట్రేలియాలో ఎంఎస్‌ చదివింది. ఆ సమయంలో హైదరాబాద్‌కు చెందిన యువకుడు ఎంఎస్‌ చేస్తూ పరిచయమయ్యాడు. ఎంఎస్‌ పూర్తి అయినత తర్వాత యువతి స్వస్థలానికి వచ్చేసింది. ఆమెకు ఇంట్లో వారు పెండ్లి సంబంధాలు చూస్తున్నారు. విషయం తెలిసిన ఆస్ట్రేలియాలో  ఉండే యువకుడు .. తనను పెండ్లి చేసుకోవాలని  లేకపోతే.. నీ పెండ్లిని చెడగొడుతానని బ్లాక్‌ మెయిల్‌ చేయడం ప్రారంభించాడు. ఆమెకు పెండ్లి సంబంధాలు ఖాయమైన తరువాత కూడా సోషల్‌మీడియా ద్వారా వారి బంధువులకు ఆస్ట్రేలియాలో దిగిన ఫొటోలను మార్ఫింగ్‌ చేసి పంపించి... కుదిరిన సంబంధాలను చెడగొడుతున్నాడు. రోజు రోజుకు అతని వేధింపులు ఎక్కువకావడంతో బాధిత యువతి గురువారం సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.


logo