మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Nov 06, 2020 , 15:08:57

హైదరాబాద్‌లో అమెజాన్ రూ. 20 వేల 761 కోట్ల పెట్టుబ‌డులు.. కేటీఆర్‌ హర్షం

హైదరాబాద్‌లో అమెజాన్ రూ. 20 వేల 761 కోట్ల పెట్టుబ‌డులు.. కేటీఆర్‌ హర్షం

హైద‌రాబాద్ : అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా సుమారు రూ. 20 వేల 761 కోట్ల పెట్టుబ‌డులు తెలంగాణ రాష్ట్రంలోకి రావడం పట్ల ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సంద‌ర్భంగా అమెజాన్ సంస్థ‌కు మంత్రి కేటీఆర్ తెలంగాణ ప్ర‌భుత్వం త‌ర‌పున హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ నేతృత్వంలో రూపొందించిన టీఎస్ ఐపాస్‌తో పాటు ఆక‌ర్ష‌ణీయ‌మైన పాల‌సీల ద్వారా తెలంగాణలోకి పెట్టుబడులు అనేకం వ‌స్తున్నాయ‌ని పేర్కొన్నారు. అమెజాన్ వెస్ స‌ర్వీసెస్ పెట్టుబ‌డుల‌తో స్థానిక యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌న్నారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ పెట్టుబడికి సంబంధించి ప్రాథమిక చర్చలను దావోస్ పర్యటనలో ప్రారంభించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. దావోస్ పర్యటనలో అమెజాన్ సంస్థ ఉన్నతస్థాయి ప్రతినిధులతో ఇందుకు సంబంధించి చేసిన చర్చలను ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.  

అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా రాష్ట్రానికి వస్తున్న ఈ పెట్టుబడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలోకి వస్తున్న అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ పెట్టుబడి తర్వాత అనేక కంపెనీలు తమ డాటా సెంటర్ల ఏర్పాటుకు తెలంగాణ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని, అలాంటి వారందరికీ తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అమెజాన్ లాంటి ప్రఖ్యాత కంపెనీ తన భారీ పెట్టుబడికి తెలంగాణను ఎంచుకోవడం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పారదర్శక, వేగవంతమైన పరిపాలనకు నిదర్శనం అని ఈ సందర్భంగా  కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక ఆదర్శవంతమైన ప్రభుత్వ విధానాలు మరియు పాలసీల ద్వారా ఐటీ, ఐటీ ఆధారిత రంగం పెద్ద ఎత్తున వృద్ధి చెందుతూ వస్తుందన్నారు. అందులో భాగంగానే ఈ రోజు అమెజాన్ తన పెట్టుబడిని తెలంగాణలో పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ విధానాల ద్వారా ఐటీ రంగంలో అనేక కంపెనీలు రావడంతో పాటు ఇన్నోవేటివ్ స్టార్టప్లకు, నైపుణ్యం కలిగిన మానవ వనరులకు కేంద్రం గా తెలంగాణ రాష్ట్రం మారిందన్నారు. ఈ పెట్టుబడి ద్వారా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి అమెజాన్ కి మధ్య ఉన్న బంధం మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటికే అమెజాన్ తన అతిపెద్ద కార్యాలయానికి హైదరాబాద్ కేంద్రంగా ఎంచుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.