గురువారం 09 ఏప్రిల్ 2020
Telangana - Mar 14, 2020 , 01:44:34

కొత్తిండ్ల సంబురం

కొత్తిండ్ల సంబురం
  • తునికిబొల్లారం ఆర్‌అండ్‌ఆర్‌కాలనీలో ఆనందంగా గృహప్రవేశాలు
  • తరలొచ్చిన కొండపోచమ్మ ముంపు గ్రామాలు
  • సౌలతులు చూసి మురిసిన నిర్వాసితులు
  • తాజాగా బైలంపూర్‌ వాసుల రాక

గజ్వేల్‌ అర్బన్‌: ప్రాజెక్టు నిర్మాణంలో ఊరుపోయిందన్న బాధ ఉన్నా.. అంతకుమించిన వసతులతో నిర్మించిన ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీల్లో పండుగ వాతావరణంలో గృహ ప్రవేశాలు చేశారు నిర్వాసితులు. ఇది సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజక వర్గంలోని ములుగు మండలం తునికిబొల్లారం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో శుక్రవారం కన్పించిన దృశ్యం. అక్కడ కల్పించిన సౌకర్యాలను చూసి మురిసిపోయారు కొండపోచమ్మ రిజర్వాయర్‌  నిర్వాసితులు. కొత్త కాలనీయే బాగుందని సంబురపడుతూ.. దానికి కేసీఆర్‌ ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీగా నామకరణం చేయాలని తీర్మానం చేయగా కలెక్టర్‌ అంగీకారం తెలిపారు.


సకల హంగులతో..

కొండపోచమ్మ జలాశయం ముంపునకు గురవుతున్న బైలంపూర్‌ గ్రామస్థులకు ములుగు మండలం తునికిబొల్లారం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో 234 ఇండ్లు కేటాయించగా వీటి గృహప్రవేశాలను శుక్రవారం పండుగ వాతావరణంలో నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కొండపోచమ్మ సాగర్‌ ముంపు బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించడంతోపాటు సకల వసతులతో, అన్ని మౌలిక సదుపాయాలతో ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ నిర్మించింది. ముంపు గ్రామాలైన తానేదార్‌పల్లి, తానేదార్‌పల్లి తండా, మామిడ్యాల, బైలంపూర్‌ గ్రామాల ప్రజలకు తునికిబొల్లారంలో డబుల్‌బెడ్‌రూమ్‌ ఇండ్లను ప్రభు త్వం చక్కటి వసతులతో నిర్మించింది. 


ఇటీవల తానేదార్‌పల్లి, తానేదార్‌పల్లి తండా, మామిడ్యాల గ్రామస్థులు గృహ ప్రవేశాలు చేయగా.. శుక్రవారం బైలంపూర్‌ వాసులు తమకు కేటాయించిన ఇండ్లలోకి ప్రవేశించి పూజలు చేశారు. ఈ కాలనీలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భూగర్భ డ్రైనేజీ, విద్యుత్‌, మిషన్‌ భగీరథ నీటితోపాటు పాఠశాల భవనం, మార్కెట్‌ కోసం దుకాణాల సముదాయాలను నిర్మించారు. వివిధ వర్గాలకు సంబంధించి ఆలయాలు, ప్రార్థన మందిరాలను కూడా నిర్మిస్తున్నారు. ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో గృహప్రవేశాలు చేయడంతో ముంపు గ్రామాలు ఖాళీ అవుతున్నాయి.  


కాలనీకి కేసీఆర్‌ పేరు..

ముంపువాసుల కోరిక మేరకు తునికిబొల్లారంలో నిర్మించిన కాలనీకి కేసీఆర్‌ ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీగా నామకరణం చేసినట్టు సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి తెలిపారు.‘ఇంత మంచి సౌలతులతో కాలనీ నిర్మించారు. సీఎం కేసీఆర్‌ సార్‌ మమ్మల్ని మంచిగ చూసుకున్నారు. ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి సీఎం కేసీఆర్‌ పేరుపెట్టాలి’ అని నిర్వాసితుల కోరిక మేరకు కాలనీకి కేసీఆర్‌ ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీగా నామకరణం చేశామని కలెక్టర్‌ తెలిపారు. కొండపోచమ్మసాగర్‌ ముంపు బాధితులకు దేశంలో ఎక్కడా లేనివిధంగా నష్టపరిహారం చెల్లించడంతోపాటు పునరావాసాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందన్నారు. ఇప్పటివరకు ఎక్కడా ఈ స్థాయిలో పునరావాస చర్యలు చేపట్టలేదన్నారు. పునరావాసంలోనూ దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. పునరావాస ప్రక్రియ పూర్తికావడంతో అతిత్వరలో కొండపోచమ్మ సాగర్‌ జలాశయాన్ని కాళేశ్వరం నీటితో నింపనున్నట్టు కలెక్టర్‌ వెల్లడించారు. గృహ ప్రవేశాల వేడుకలో ఎఫ్‌డీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, జేసీ పద్మాకర్‌, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ జహంగీర్‌, ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఆయా గ్రామాల ప్రజలు, వారి బంధువులు పాల్గొన్నారు.  


కొత్త కాలనీయే మంచిగుంది

మేమున్న ఊరు, ఇండ్ల కంటే ప్రభుత్వం నిర్మించి న కొత్త కాలనీ చాలా బాగున్నది. అధికారులు వచ్చి ప్రాజెక్టుల వల్ల కలిగే లాభాలను వివరించారు అందుకు మేము భూములిచ్చేందుకు ముందుకు వచ్చాం. ఊర్లు పోతయని తెలిసినప్పుడు కొంత భయపడ్డాం. ప్రభుత్వం మాకు అండగా నిలువడంతో సంతోషంగా అంగీకరించాం.

- ఇంద్రారెడ్డి-అనసూయ, నిర్వాసితులు


ప్రభుత్వానికి రుణపడి ఉంటాం..

మా త్యాగాన్ని యాదిపెట్టుకొని సర్కారు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కూడా ఇప్పించింది. భూ ములు పోతయనప్పడు మా బతుకులు ఆగమైతాయనుకన్నం. కానీ అధికారులు, మాకు ధైర్యం చెప్పి ముందుకు నడిపినారు. సర్కారు ఇచ్చిన ఇండ్లు మంచిగున్నయి. మేమందరం సీఎం కేసీఆర్‌ ప్రభత్వానికి రుణపడి ఉంటం. 

- కృష్ణారెడ్డి-ప్రేమలత, భూనిర్వాసితులు


logo