ఆదివారం 24 జనవరి 2021
Telangana - Dec 30, 2020 , 01:25:52

ఉద్యోగుల మురిపెం

ఉద్యోగుల మురిపెం

  • వేతనాల పెంపు నిర్ణయంపై సర్వత్రా హర్షం
  • పదవీ విరమణ వయసు పెంపుపై సంతోషం
  • ఖాళీల భర్తీని స్వాగతించిన ఉద్యోగ సంఘాలు
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కొత్త సంవత్సరం సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రకటించిన కానుకలపై ఉద్యోగులు మురిసిపోతున్నారు. వేతనాలు, పదవీ విరమణ వయసు పెంపు నిర్ణయంపై ఉ ద్యోగ సంఘాలు హర్షం వ్యక్తంచేస్తున్నాయి. ‘ఉద్యోగుల కోసం పరితపించే సీఎం కేసీఆర్‌.. చరిత్రలో ఒకే ఒక్కడుగా నిలిచిపోతారు. దేశంలో ఎక్కడా ఇలాంటి సీఎంలు లేరు’ అంటూ సంబురాల్లో ము నిగిపోయాయి. పదోన్నతులు, బదిలీల సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంపై సంతోషపడుతున్నాయి. కొత్త ఉద్యోగాల నియామకం శుభపరిణామమని తెలంగాణ ఉద్యోగుల సంఘం గౌరవ చైర్మన్‌ పద్మాచారి, అధ్యక్షుడు పవన్‌కుమార్‌, అసోసియేట్‌ అధ్యక్షుడు రవీందర్‌కుమార్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు నర్సింగ్‌రా వు, తెలంగాణ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌శాఖ డీఐజీ, వరంగల్‌ జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌ పరిటాల సుబ్బారావు, తెలంగాణ రిజిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ సర్వీస్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు ఎస్‌ సహదేవ్‌, హెచ్‌ ప్రణయ్‌కుమార్‌, ముజీబ్‌ హుస్సేని, స్థితప్రజ్ఞ, సిరా జ్‌ అన్వర్‌, టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్‌, పద్మశాలి అఫిషియల్స్‌, ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాచన రఘునందన్‌ హర్షం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్‌కు సెర్ప్‌ ఉద్యోగుల ఐకాస ధన్యవాదాలు తెలిపింది. సెర్ప్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తంచేసింది. వేతన పెంపుపై ప్రభుత్వ వైద్యుల సంఘం హర్షం వ్యక్తంచేసింది. ఇది నూతన సంవత్సర కానుకని డీహెచ్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లాలూ ప్రసాద్‌ రాథోడ్‌ సంతోషం వ్యక్తంచేశారు.

గొప్ప విషయం

ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషిచేయడం అభినందనీయం. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉద్యోగులకు నూతన సంవత్సర కానుకగా వరాల జల్లు కురిపించడం గొప్ప విషయం. వేతనాలు, ఉద్యోగ విరమణ వయసు పెంపు, పదోన్నతులు, బదిలీలు, అన్ని శాఖల్లో ఖాళీలను భర్తీచేయాలని నిర్ణయించడం  సంతోషంగా ఉన్నది.

-రాయకంటి ప్రతాప్‌,టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి

ఉద్యోగుల గౌరవాన్ని పెంచేలా నిర్ణయం

ఉద్యోగుల వేతన సవరణతోపాటు సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం హర్షణీయం. ప్రభుత్వంలో పనిచేస్తున్న చిన్న ఉద్యోగులకు వేతన సవరణ ఫలాలను అందిస్తామని చెప్పడం సంతోషకరం. పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగుల పట్ల సీఎం కేసీఆర్‌ అనుసరిస్తున్న తీరు ఉద్యోగుల గౌరవాన్ని పెంచేలా ఉన్నది. 

-కారం రవీందర్‌రెడ్డి, టీఎన్జీవో కేంద్ర సంఘం మాజీ అధ్యక్షుడు

రెవెన్యూలో 49 వేల మందికి లబ్ధి

ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెంచాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించడం గొప్ప విషయం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ నూతన సంవత్సర కానుక అందించారు. ఈ నిర్ణయంతో రెవెన్యూ శాఖలోని సుమారు 49 వేల మందికి ప్రయోజనం కలుగుతుంది. ఈసారి పెరిగిన ఖర్చులను దృష్టిలో ఉంచుకొని మెరుగైన ఫిట్‌మెంట్‌ ఇస్తారని ఆశిస్తున్నాం. 

-ట్రెసా అధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి, కార్యదర్శి గౌతమ్‌కుమార్‌

మరింత ఉత్సాహంగా పనిచేస్తాం

ఈ నిర్ణయం కోసం ఉద్యోగులంతా ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఉద్యోగుల బాధలను పెద్ద మనసుతో అర్థం చేసుకున్నందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. మరింత ఉత్సాహంగా పనిచేసి నాణ్యమైన సేవలందిస్తాం. వ్యవసాయశాఖ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్తాం. 

-కే రాములు, అగ్రి డాక్టర్స్‌ అసోసియేషన్‌ ఫౌండర్‌ ప్రెసిడెంట్‌

ఉద్యోగుల్లో భరోసా

సీఎం కేసీఆర్‌ నిర్ణయాలపై అందరం సంతోషంగా ఉన్నాం. పోలీసు అధికారులు, సిబ్బందితోపాటు హోంగార్డులకు మేలు జరుగుతుంది. ఉద్యోగుల సమస్యలపై సానుకూల దృక్పథంతో నిర్ణయం తీసుకొన్న సీఎం కేసీఆర్‌కు, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు పోలీసు అధికారుల సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ నిర్ణయాలు ఉద్యోగుల్లో భరోసా, ఉత్సాహాన్ని నింపుతాయి. 

- గోపిరెడ్డి, పోలీస్‌ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు 

కేసీఆర్‌ది చరిత్రాత్మక నిర్ణయం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెద్ద మనసుతో ఆర్టీసీని ఆదుకున్నరు. కార్మికులు, ఉద్యోగులను కన్నబిడ్డల్లాగా చూసుకుంటున్నరు. ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీ ఇస్తామనడం చరిత్రాత్మక నిర్ణయం. ఇంతటి గొప్ప ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా ఉండరు. సంస్థను అన్నివిధాలా ఆదుకుంటామని చెప్పి గొప్ప మనసు చాటుకున్నారు. 

- థామస్‌రెడ్డి , తెలంగాణ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, టీఎంయూ - ఆర్టీసీ 

ఎంప్లాయీస్‌ ఫ్రెండ్లీ గవర్నమెంట్‌

ఇది ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌ ఫిట్‌మెంట్‌ పెంచడంతోపాటు వేతనాలను సైతం పెంచారు.  ప్రస్తుతం పదవీ విరమణ వయసును పెంచడం హర్షణీయం. 

- జీ చంద్రశేఖర్‌, టీఎన్జీవోస్‌ కార్యదర్శి, సెంట్రల్‌ యూనియన్‌


logo