బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Nov 09, 2020 , 00:07:05

కష్టాల్లో ‘కంటిపాపై’

కష్టాల్లో ‘కంటిపాపై’

  • కాలితో సంతకం.. పనిచేయని చేతివేళ్లు
  • ఐరిస్‌తో నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌పై దివ్యాంగుడి హర్షం

దేవరుప్పుల: అతనో దివ్యాంగుడు. పుట్టుకతోనే రెండు చేతులు పనిచేయవు. కాళ్లతో రాస్తూ డిగ్రీ వరకు చదువుకున్నాడు. వేలిముద్రలు పనిచేయకపోయినా ఐరిస్‌ సాయంతో నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌ పూర్తిచేయడంపై సంబురపడుతున్నాడు జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని ధరావత్‌ తండాకు చెందిన  స్వామి. ధరావత్‌ సజ్జన్‌ తనకున్న ఏడెకరాల్లో కుమారుడు స్వామి పేర 2.28 ఎకరాలు గిఫ్ట్‌ రిజిస్ట్రేషన్‌ చేశాడు. రిజిస్ట్రేషన్‌ వేళ డాక్యుమెంట్లపై తాసిల్దార్‌ సమక్షంలో స్వామి కాలితో సంతకం చేశాడు. అదే డాక్యుమెంట్‌పై వేలిముద్రలు వేయాల్సిఉండగా, చేతివేళ్లు పనిచేయలేదు. ధరణి పోర్టల్‌ సాయంతో ఐరిస్‌ పద్ధతిలో కండ్లను స్కాన్‌చేసి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తిచేశారు. ‘చాలా రోజుల నుంచి భూమి నా పేర చేస్తానని మా నాయన అంటున్నాడు. రిజిస్ట్రేషన్‌ కోసం జనగామ పోయి తాసిల్‌ కార్యాలయంలో పట్టా చేయించాలంటే పొలం పనులు పోతయని అనేటోడు. ధరణి ముచ్చట తెలిసి.. ఒక్క రోజులోనే అన్ని పనులు అవుతాయని అనంగ విని తాసిల్‌ ఆఫీస్‌కు వచ్చినం. నిమిషాలల్లనే రిజిస్ట్రేషన్‌ అయి పట్టా కాగితాలు చేతికొచ్చాయి. నా పేర భూమి ఎక్కడంతో భరోసా వచ్చింది’ అని స్వామి సంతోషం వ్యక్తంచేశాడు.