శనివారం 16 జనవరి 2021
Telangana - Jan 08, 2021 , 15:54:55

అఖిల ప్రియను కస్టడీకి అప్పగించండి.. కోర్టులో పోలీసుల పిటిషన్

అఖిల ప్రియను కస్టడీకి అప్పగించండి.. కోర్టులో పోలీసుల పిటిషన్

హైదరాబాద్‌ :  కిడ్నాప్‌ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను ఏడు రోజులు కస్టడీకి అప్పగించాలని బోయిన్‌పల్లి పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అఖిలప్రియ అనుచరులకు మరికొన్ని కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ కేసులో అఖిలప్రియ భర్త సహా మరి కొంతమంది నిందితులను అరెస్టు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. బాధితులను బెదిరించి సంతకాలు చేయించుకున్న పత్రాలను స్వాధీనం చేసుకోవాల్సి ఉందని తెలిపారు. నిందితులందరినీ అరెస్టు చేశాక కిడ్నాప్ సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేయాల్సి ఉందని అందుకు అఖిల ప్రియను రేపటి నుంచి ఈ నెల 15 వరకు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును అభ్యర్థించారు. 

అదేవిధంగా అఖిల ప్రియకు బెయిల్‌ ఇవ్వొద్దని కోరారు. బెయిల్‌ మంజూరు చేస్తే విచారణ నుంచి తప్పించుకునే అవకాశముందని పేర్కొన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. బెయిల్‌పై విడుదలైతే మరిన్ని నేరాలకు పాల్పడవచ్చని, అఖిల ప్రియ చర్యలతో స్థానికుల్లో అభద్రతాభావం నెలకొందని వివరించారు. సాక్ష్యాల సేకరణకు దర్యాప్తు బృందాలు ప్రయత్నిస్తున్నాయి. సాక్షుల వాంగ్మూలం నమోదు చేయాల్సి ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు.  


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.