హాజీపూర్ దోషికి ఉరి

- రెండు కేసులలో మరణదండన.. మరో కేసులో యావజ్జీవ ఖైదు
- వరుస హత్యల కేసులో పోక్సోకోర్టు సంచలన తీర్పు
- దోషి శ్రీనివాస్‌రెడ్డి ముఖంలో కనిపించని పశ్చాత్తాపం
- తీర్పుపై బాధిత కుటుంబసభ్యుల హర్షం
నల్లగొండ ప్రధాన ప్రతినిధి/నల్లగొండ, నమస్తే తెలంగాణ: సంచలనం సృష్టించిన హాజీపూర్ హత్యల కేసులో దోషి మర్రి శ్రీనివాస్‌రెడ్డి (29)కి నల్లగొండ పోక్సో కోర్టు గురువారం మరణ శిక్ష విధించింది. 11, 17, 14 ఏండ్ల వయసు కలిగిన ముగ్గురు బాలికలపై లైంగికదాడి, హత్యల కేసులలో మొత్తం 101 మంది సాక్షులను విచారించిన నల్లగొండ జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి, పోక్సో కోర్టు న్యాయమూర్తి ఎస్వీ నాథ్‌రెడ్డి నిందితుడికి రెండు కేసులలో మరణశిక్ష, ఒక కేసులో యావజ్జీవ కారాగార శిక్షను ఖరారుచేశారు. మైనర్లు అయిన తమ కుమార్తెలపై అతి కిరాతకంగా లైంగికదాడికి పాల్పడి, హత్యలు చేసి శవాలను వ్యవసాయ బావిలో పూడ్చిన నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డికి మరణశిక్ష విధించడం పట్ల బాధిత కుటుంబసభ్యులు హర్షం వ్యక్తంచేశారు. తీర్పు వెలువడిన వెంటనే నల్లగొండ జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు, బాధిత కుటుంబీకులు సంబురాలు చేసుకున్నారు. తీర్పు నేపథ్యంలో హాజీపూర్ వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రతి ఒక్కరూ తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురుచూశారు. తీర్పు అనంతరం పటాకులు కాల్చి సంతోషం వ్యక్తంచేశారు.
కేసులవారీ వివరాలను పరిశీలిస్తే..
- 2015, ఏప్రిల్ 24న యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని మైసిరెడ్డిపల్లి నుంచి ఒంటరిగా హాజీపూర్‌కు వెళ్తున్న 11 ఏండ్ల బాలికను వెంబడించిన నిందితుడు.. ఆమెపై లైంగికదాడికి ప్రయత్నించాడు. నిర్మానుష్య ప్రదేశంలో ఆమె నోరు, ముక్కు మూయడంతో బాధితురాలు మరణించింది. మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి హాజీపూర్ శివారులోని మర్రి బావిలో పడేశాడు.
- 2019, మార్చి 7న హాజీపూర్ నుంచి బొమ్మలరామారం వెళ్తున్న 17 ఏండ్ల బాలికకు నిందితుడు తన బైక్‌పై లిఫ్ట్ ఇచ్చాడు. తన వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లి లైంగికదాడికి ప్రయత్నించగా బాధితురాలు గట్టిగా అరిచింది. దీంతో నోరు, ముక్కు మూయడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అనంతరం బాలికను తెట్టె బావిలో పడేసి.. ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆమె వస్తువులు, నిందితుడి అంగితోపాటు బాలిక మృతదేహాన్ని సైతం బావిలో పూడ్చి పెట్టాడు.
- 2019, ఏప్రిల్ 25న బొమ్మలరామారం నుంచి హాజీపూర్ వెళ్తున్న 14 ఏండ్ల బాలికకు తన బైక్‌పై లిఫ్ట్ ఇచ్చాడు. తెట్టె బావి వద్దకు తీసుకెళ్లి లైంగికదాడికి ప్రయత్నించగా.. అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాధితురాలిని బావిలోకి విసేరాశాడు. ఆ తర్వాత బావిలోకి దిగి లైంగికదాడిచేసి.. కండువాతో గొంతు బిగించి హత్యచేశాడు. మృతదేహాన్ని అదే బావిలో పాతి పెట్టాడు.
90 రోజుల్లోనే చార్జిషీటు దాఖలు
గతేడాది ఏప్రిల్ 25న తమ కుమార్తె తప్పిపోయిందని హాజీపూర్‌కు చెందిన 14 ఏండ్ల బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసు విచారణ ప్రారంభమైంది. మరుసటి రోజే నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి వ్యవసాయ బావి వద్ద ఆనవాళ్లు గుర్తించి పోలీసులు ఏప్రిల్ 30న అతన్ని అరెస్టుచేశారు. విచారణలో మొత్తం ముగ్గురు బాలికలపై లైంగికదాడిచేసి హత్య చేసినట్టు వెల్లడి కావడంతో.. మూడు కేసుల్లో వేర్వేరు చార్జిషీట్లను జూలై 31న నల్లగొండ పోక్సో కోర్టులో దాఖలుచేశారు. అక్టోబర్ 14 నుంచి విచారణ ప్రారంభమైంది. ఈ ఏడాది జనవరి 17 నాటికి మొత్తం 101 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం గురువారం తీర్పు చెప్పింది.
పలు సెక్షన్ల కింద శిక్షలు విధింపు
ముగ్గురు మైనర్లపై లైంగికదాడి, హత్య కేసుల్లో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి పోక్సో న్యాయస్థానం ఉరి శిక్ష, యావజ్జీవ శిక్షతోపాటు పలు శిక్షలనూ విధించింది. మొత్తం మూడు కేసుల్లో రెండు బొమ్మలరామారం పోలీస్‌స్టేషన్‌లో నమోదు చేయగా, ఒకటి బీబీనగర్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైంది. ఇందులో 14 ఏండ్ల (చార్జిషీట్ నంబర్ 109/2019), 17 ఏండ్ల (చార్జిషీట్ 110/2019) బాలికలపై లైంగికదాడి, హత్యల కేసుల్లో మరణ శిక్ష ఖరారుచేసిన న్యాయస్థానం, 11 ఏండ్ల బాలిక (చార్జిషీట్ 111/2019) కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగారం విధించింది. మూడు కేసు ల్లో ఐపీసీ సెక్షన్ 302 కింద మరణ శిక్ష, రూ.2000 జరిమానా, సెక్షన్ 366 కింద పదేండ్ల జైలు, రూ.500 జరిమానా, సెక్షన్ 376(3) కింద 20 ఏండ్ల జైలుశిక్ష, రూ.1000 జరిమా నా, సెక్షన్ 376-ఏ కింద 20 ఏండ్ల జైలుశిక్ష, రూ.1000 జరిమా నా, సెక్షన్ 201కింద ఏడేండ్ల జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధించింది.
కిక్కిరిసిన కోర్టు ప్రాంగణం
తీర్పు నేపథ్యంలో కోర్టు ప్రాంగణం ప్రజలతో కిక్కిరిసిపోయింది. బాధిత కుటుంబాలు ఉదయం 10 గంటలకే కోర్టుకు చేరుకోగా స్థానికులు, న్యాయవాదులతోపాటు మీడియా పెద్దఎత్తున కోర్టు ప్రాంగణంలో తీర్పు కోసం ఎదురు చూసింది. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని ఉదయం 10.30కు వరంగల్ జైలు నుంచి పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. మూడు కేసుల ఆధారంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి 2.15 వరకు పోక్సో స్పెషల్ కోర్టు జడ్జి విచారించారు. 3 కేసులకు సంబంధించి నిం దితుడిని నేరాలు చేశావా? అని న్యాయమూర్తి అడుగగా ‘నాకు సంబంధం లేదు నేను చేయలేదు’ అని జవాబిచ్చాడు.
ఈ విషయంలో పూర్తి ఆధారాలు ఉన్నట్టు పేర్కొన్న ఆయన నేరం రుజువైనట్టు ప్రకటించి సాయంత్రానికి తీర్పును వాయిదా వేశారు. సాయంత్రం 6.22 గంటలకు కోర్టు హాలుకు వచ్చిన న్యాయమూర్తి తుది తీర్పును వెల్లడించారు. తుది తీర్పు వెల్లడి సమయంలోనూ నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి ముఖంలో పశ్చాత్తాపం కన్పించలేదు. న్యాయమూర్తి తీర్పు ప్రకటిస్తున్న సమయంలో రెండు చేతులు ఎత్తి నమస్కారం పెడుతూ మౌనంగా ఉండిపోయాడు. తీర్పు సమయంలో రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ కోర్టు హాలుకు వచ్చారు. శ్రీనివాస్‌రెడ్డికి యావజ్జీవ శిక్షతోపాటు మరణశిక్షను విధించిన న్యాయమూర్తి.. హైకోర్టులో అప్పీల్‌కు అవకాశమిచ్చారు. అప్పీల్ చేసుకొంటే లాయర్‌ను సమకూర్చుతామని చెప్పారు.
ఏ హత్యా చేయలేదు.. నన్ను శిక్షించొద్దు
తుది తీర్పు నేపథ్యంలో న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి ‘నేను ఏ హత్య చేయలేదు.. నన్ను శిక్షించొద్దు.. మా అమ్మా నాన్నను నేనే చూసుకోవాలి’ అని సమాధానమిచ్చాడు.
న్యాయమూర్తి: 14 ఏండ్ల బాలికను బైక్‌పై ఎక్కించుకొని వెళ్లి లైంగికదాడిచేయడంతోపాటు హత్యచేశావు అని అభియోగం మోపబడింది. ఇది నిజమేనా?
శ్రీనివాస్‌రెడ్డి: అంతా అబద్ధం సార్. నేను ఎవర్నీ బండి మీద ఎక్కించుకుపోలేదు. ఎవర్నీ చంపలేదు. వాళ్లెవరో తెల్వదు.
న్యాయమూర్తి: 17 ఏండ్ల బాలికను బైక్‌పై ఎక్కించుకొని తీసుకెళ్లి హత్య చేసింది నిజం కాదా? ఎందుకు అలా చేశావ్?
శ్రీనివాస్‌రెడ్డి: నాకు తెలవదు సార్.. వాళ్లెవరో కూడా నాకు తెలియదు. అసలు నేనేం చేయలేదు.
న్యాయమూర్తి: 11 ఏండ్ల బాలికపై లైంగికదాడి, హత్యచేసి గోనె సంచిలో మూటగట్టి పాతిపెట్టావెందుకు?
శ్రీనివాస్‌రెడ్డి: పోలీసులు నన్ను కొట్టి నాతో అబద్ధాలు చెప్పించారు. నేనెవర్నీ హత్యచేసి పాతిపెట్టలేదు.
న్యాయమూర్తి: శిక్ష గురించి ఏమైనా మాట్లాడుతావా?
శ్రీనివాస్‌రెడ్డి: సార్ నేను ఎవర్నీ ఏమీ చేయలేదు. మా అమ్మానాన్నను నేనే చూసుకోవాలి. వాళ్లకు దిక్కెవరు లేరు. ఇదంతా నేనే చేసిన అని చెప్పి మా ఇల్లును కూలగొట్టారు. మా భూములను లాక్కున్నరు. నన్ను వదిలేయండి.
బాధితులకు న్యాయం జరిగింది
మహిళా భద్రతకు కట్టుబడి ఉన్నాం: డీజీపీ మహేందర్‌రెడ్డి
హాజీపూర్ లైంగికదాడి, హత్యల కేసుల్లో బాధిత కుటుంబాలకు న్యాయం జరిగిందని డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి అన్నారు. సీరియల్ కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి కోర్టు ఉరిశిక్ష విధించడంపై డీజీపీ స్పందిస్తూ గురువారం ఓ ప్రకటన జారీచేశారు. ‘బాధిత కుటుంబాలకు న్యాయం జరుగడంలో కేసులో తుదితీర్పు వచ్చేలా నిలిచిన ముఖ్య సాక్ష్యులందరికీ, బాధితుల కుటుంబసభ్యులకు, సభ్య సమాజానికి, సకాలంలో ట్రయల్ పూర్తిచేసి తుదితీర్పు వెలువరించిన గౌరవ కోర్టుకు తెలంగాణ పోలీసుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
కేసు నిరూపితం అయ్యేలా కీలక సాక్ష్యాధారాలను సేకరించడంలో, రికార్డు సమయంలో కేసు ట్రయల్ పూర్తిచేసేందుకు విశ్రాంతి లేకుండా కృషిచేసిన రాచకొండ సీపీ మహేశ్‌భగవత్, యాదాద్రి డీసీపీ నారాయణరెడ్డి, భువనగిరి ఏసీపీ భుజంగరావుతోపాటు వారి మొత్తం అధికారుల బృందానికి నా అభినందనలు. ఈ కేసులో కీలకంగా పనిచేసిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సీ చంద్రశేఖర్‌కు నా అభినందనలు’ అని పేర్కొన్నారు. అన్ని ఘోర నేరాలను శాస్త్రీయ పద్ధతిలో పరిశోధించి దోషులకు శిక్షపడేలా చేయడంలో తెలంగాణ పోలీస్ ముందుంటుందని రాష్ట్ర ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ పోలీసులు మహిళా భద్రతకు కట్టుబడి ఉన్నారని చెప్పారు.
సాంకేతిక ఆధారాలు, ఫోరెన్సిక్ నివేదికతోనే..
రాచకొండ సీపీ మహేశ్‌భగవత్
హాజీపూర్ వరుస హత్యల కేసులో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి దోషిగా తేలాడని, ముగ్గురు బాలికలపై లైంగికదాడి, హత్య చేసినట్టు కోర్టు నిర్ధారించిందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్‌భగవత్ చెప్పారు. గురువారం రాత్రి నల్లగొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. బాలికలను లిఫ్ట్ పేరుతో నమ్మించి బైక్‌పై తన వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లి లైంగికదాడి, హత్యచేసేవాడని వివరించారు. బావి వద్ద దొరికిన స్కూల్ బ్యాగుల ఆధారంగా వరుస హత్యల కేసు మిస్టరీని ఛేదించామన్నారు. ఈ కేసులో సాంకేతిక ఆధారాలు, ఫోరెన్సిక్ నివేదిక కీలక పాత్ర పోషించాయని చెప్పారు. ఆ ఆధారాలతోనే శ్రీనివాస్‌రెడ్డిని దోషిగా నిరూపించామని తెలిపారు. కర్నూలులో ఒక మహిళను హత్య చేసిన కేసులో శ్రీనివాస్‌రెడ్డి దోషి అన్నారు. ఈ కేసులో అన్ని సైంటిఫిక్ ఫోరెన్సిక్ ఆధారాలను కోర్టుకు సమర్పించామని, ఎంతో నిబద్ధతతో విచారణ చేశామని చెప్పారు.
ఈ కేసులో బాధితుల కుటుంబాలకు న్యాయం జరుగడం సంతోషంగా ఉన్నదని పేర్కొన్నారు. ఐటీ సెల్ సైంటిఫిక్, ఫోరెన్సిక్ విభాగాలు ఎంతో కృషిచేశాయని, వారి కృషి వల్లే వంద రోజుల్లోపే మూడు కేసుల్లో చార్జిషీటు వేశామని చెప్పారు. హాజీపూర్ గ్రామానికి పోలీస్‌శాఖ తరఫున రూ.14 లక్షలతో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయడంతోపాటు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించామని వివరించారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందజేయాలని కోర్టు ఆదేశించినట్టు తెలిపారు. హోంశాఖ సెక్రటరీ రవిగుప్తా ఆధ్వర్యంలో పాండు, అంజలి సహకారం అందించారన్నారు. పీపీ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడటంతో కోర్టులపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని చెప్పారు. న్యాయం గెలుస్తుందని దీంతో రుజువైందన్నారు. ఈ సమావేశంలో ఏసీపీ భుజంగరావు, సీఐ సురేందర్‌రెడ్డి, నల్లగొండ పీపీ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
న్యాయం జరిగింది
నా 14 ఏండ్ల బిడ్డ మృతికి కారణమైన నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి కోర్టు ఉరిశిక్ష వేయడం ద్వారా మాకు న్యాయం జరిగింది. అభంశుభం తెలియని నా బిడ్డను పొట్టన పెట్టుకున్న ఆ నరరూప హంతకుడికి విధించిన ఉరిశిక్షను వెంటనే అమలుచేయాలి. ప్రభుత్వం, పోలీసుల చొరవ పట్ల ఎంతో ఆనందంగా ఉన్నది.
- నాగలక్ష్మి, ఓ బాధితురాలి తల్లి
పీడ విరగడైంది
అమాయకురాలైన నా 17 ఏండ్ల బిడ్డను మభ్యపెట్టి లైంగికదాడిచేసి, బావిలో పూడ్చి ముఖం చూసుకోకుండా చేసిన దుర్మార్గుడైన శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష వేసిన కోర్టుకు ధన్యవాదాలు. ఈ రోజు న్యాయం గెలిచింది. గ్రామస్థులందరూ మా బిడ్డలకు న్యాయం జరుగాలని అండగా నిలిచారు. నిందితుడికి ఉరిశిక్షను వెంటనే అమలుచేయాలి.
- మల్లేశం, ఓ బాధితురాలి తండ్రి
మా బిడ్డల ఆత్మశాంతి
ఆరో తరగతి చదివే నా 11 ఏండ్ల బిడ్డను మాయంచేసిన రాక్షసుడికి సరైన శిక్ష పడింది. న్యాయం కోసం మాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. పోలీసులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మా కుటుంబానికి అండగా నిలిచాయి. పది నెలలుగా నిద్రాహారాలు మాని నిందితుడికి సరైన శిక్ష పడాలని ఎదురుచూశాం. ఈ రోజు మా బిడ్డల ఆత్మకు శాంతి కలిగింది.
- భాగ్యమ్మ, ఓ బాధితురాలి తల్లి
కేసు విచారణ సాగిందిలా..
- ఏప్రిల్ 25, 2019: బాలిక మిస్సింగ్ కేసు నమోదు
- ఏప్రిల్ 30, 2019: నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి అరెస్టు
- జూలై 31, 2019: పోక్సో కేసులో చార్జ్‌షీట్ దాఖలు
- అక్టోబర్ 14, 2019: విచారణ ప్రారంభం
- జనవరి 8, 2020: నిందితుడి వాదనలు నమోదు
- జనవరి 17, 2020: విచారణ పూర్తి
- జనవరి 27, 2020: తుది తీర్పు ఫిబ్రవరి 6కు వాయిదా
- ఫిబ్రవరి 6, 2020: మరణశిక్ష విధిస్తూ పోక్సో కోర్టు తీర్పు