ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 11, 2020 , 01:40:31

హైకోర్టుకు హాజీపూర్‌ కేసు

హైకోర్టుకు హాజీపూర్‌ కేసు
  • ఉరి ఖరారుపై రిఫర్‌ ట్రయల్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హాజీపూర్‌ వరుస హత్యల కేసు హైకోర్టుకు చేరింది. ఈ కేసులో దోషిగాతేలిన శ్రీనివాస్‌రెడ్డికి నల్లగొండ మొదటి అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జి న్యాయస్థానం గత నెలలో మరణశిక్ష విధించింది. ఉరిశిక్షను ధ్రువీకరించాలని కోరుతూ కేసు ప్రొసీడింగ్స్‌ను రిఫర్‌ ట్రయల్‌ నిబంధన కింద హైకోర్టుకు నల్లగొండ కోర్టు సిఫారసు చేసింది. మంగళవారం రిఫర్‌ ట్రయల్‌ చేపట్టిన చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం.. దోషి శ్రీనివాస్‌రెడ్డి, పోలీసులకు నోటీసులు జారీచేసింది. ఇరువర్గాల వివరణ సమర్పించాలని ఆదేశించింది. తనకు ఉరిశిక్ష విధించడాన్ని సవాల్‌ చేస్తూ దోషి శ్రీనివాస్‌రెడ్డి హైకోర్టులో అప్పీల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.


ఏమిటీ రిఫర్‌ ట్రయల్‌?

క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సీఆర్పీసీ)-1973లోని సెక్షన్‌ 366 ప్రకారం ఏదైనా తీవ్ర నేరానికి సంబంధించి దిగువ కోర్టు ఉరిశిక్ష విధించినపక్షంలో ఆ ఉరిశిక్షను హైకోర్టు ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఈ మేరకు దిగువ కోర్టు జారీచేసిన ప్రొసీడింగ్స్‌ను హైకోర్టుకు సమర్పించాలి. దిగువ కోర్టు విధించిన ఉరిశిక్షను హైకోర్టు ధ్రువీకరించే వరకు ఉరిశిక్షను అమలుచేయడానికి వీలుండదు. మరోవైపు దిగువ కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీల్‌ చేసుకొనే అవకాశం కూడా దోషులకు ఉంటుంది. 


logo