శనివారం 06 జూన్ 2020
Telangana - May 19, 2020 , 14:51:26

బార్బర్‌ షాపులకు భలే గిరాకీ

బార్బర్‌ షాపులకు భలే గిరాకీ

హైదరాబాద్‌ : ఈ లాక్‌డౌన్‌ కాలంలో జుట్టు పెరిగిపోవడంతో.. పురుషులు భలే ఇబ్బంది పడ్డారు. బార్బర్‌ షాపులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో.. కటింగ్‌ చేయించుకోలేని పరిస్థితి. షేవింగ్‌ కూడా చేసుకోలేని వారు.. భారీగా గడ్డం పెంచారు. హెయిర్‌ సెలూన్‌ షాపుల ద్వారా కరోనా వైరస్‌ ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆ షాపులకు అనుమతి ఇవ్వలేదు. 

కొంతమంది అయితే తమ నివాసాలకు బార్బర్లను పిలిపించుకుని కటింగ్స్‌ చేయించుకున్నారు. బార్బర్లు కూడా తెలిసిన వారికే కటింగ్‌ చేశారు. మరి మిగతా వారి పరిస్థితి ఏంటి? వారంతా హెయిర్‌ సెలూన్‌ షాపులు ఎప్పుడు తెరుస్తారా? అని ఆశగా గత 55 రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు.

ఎట్టకేలకు బార్బర్‌ షాపులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో జుట్టు భారీగా పెరిగిపోయిన వారు ఊపిరి పీల్చుకున్నారు. హెయిర్‌ సెలూన్‌ దుకాణ యజమానులకు కూడా జీవనోపాధి తిరిగి ప్రారంభమైంది. మంగళవారం వేకువజాము నుంచే హైదరాబాద్‌ నగరంలో బార్బర్‌ షాపులను తెరిచారు. ఆ షాపుల వద్ద జనాలు భౌతిక దూరం పాటిస్తూ.. ముఖానికి మాస్కులు ధరించి కనిపించారు. 

ఫలక్‌నూమాలోని ఓ బార్బర్‌ షాపు యజమాని అంజయ్య మాట్లాడుతూ.. ఈ కరోనా వైరస్‌ సంక్షోభం నుంచి త్వరగా బయటపడాలని ప్రతి రోజు దేవుణ్ణి ప్రార్థించానని తెలిపాడు. 55 రోజుల తర్వాత షాపు తెరిచాను. కస్టమర్లు వస్తూ ఉన్నారు. భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో తమ దుకాణంలో ఒకే సీటును సమకూర్చామని చెప్పాడు. మరో సీటును తొలగించినట్లు ఆయన పేర్కొన్నాడు. బెంచి స్థానంలో కుర్చీలను ఏర్పాటు చేశామని అంజయ్య తెలిపాడు. 

మొత్తానికి లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా బార్బర్‌ షాపులను తెరిచేందుకు అనుమతివ్వడంతో.. ఆ దుకాణ యజమానులకు భారీ ఊరట లభించింది. రోజు వచ్చే డబ్బులతోనే కుటుంబాన్ని పోషించే బార్బర్‌ దుకాణ యజమానుల ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది. logo