శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 20, 2020 , 01:32:52

నేలరాలిన ఆశలు

నేలరాలిన ఆశలు

-పలు జిల్లాల్లో వడగండ్ల వాన

-వరి, మక్కజొన్న పంటలకు నష్టం

-పూతరాలిన మామిడి, బత్తాయి

-పిడుగుపాటుకు యాదాద్రి జిల్లాలో ఐదు పశువుల మృత్యువాత

నమస్తేతెలంగాణ నెట్‌వర్క్‌: ఉపరితల ద్రోణి కారణంగా గురువారం సాయంత్రం పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వానపడింది. ఫలితంగా వరి, మక్కజొన్న ఇతర పంటలకు తీరని నష్టం వాటిల్లింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని వేర్వేరు చోట్ల పిడుగుపాటుకు ఐదు పశువులు మృత్యువాతపడ్డాయి. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో గురువారం వడగళ్ల వాన పడింది. వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి, నెక్కొండ, సంగెం తదితర మండలాల్లో గాలిదుమారంతో కూడిన వర్షం కురిసింది. వడగండ్లు కురవడంతో వరి ధాన్యం పూర్తిగా పొలంలోనే రాలిపోయింది. కంకివేస్తున్న వరి నేలవాలిపోయి మొక్క లు పూర్తిగా దెబ్బతిన్నాయి. మక్కజొన్న కూడా పూర్తిగా నేలవాలింది. పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు, చెట్లు కూలిపోయాయి. జనగామ జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. పాలకుర్తి, జఫర్‌గఢ్‌, దేవరుప్పుల మండలాల్లో గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో వర్షం మొదలై, వడగండ్లు పడ్డాయి. కోత, పొట్ట దశలో ఉన్న వరి, జల్లు దశలో ఉన్న మక్క తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈదురుగాలులకు పలు ఇండ్లు కూలిపోయాయి. జఫర్‌గఢ్‌, దేవరుప్పుల మండలాల్లో వడగండ్ల వానకు వరి, మక్క జొన్న పంటలకు నష్టం వాటిల్లింది.  నల్లగొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. కట్టంగూర్‌లో జల్లులు పడగా మునుగోడు, చిట్యాలలో వర్షంతోపాటు వడగండ్లు పడ్డాయి. గుర్రంపోడు, శాలిగౌరారంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. 

యాదాద్రి జిల్లాలో..

యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతోపాటు వడగండ్లు పడ్డాయి. వడగండ్ల తీవ్రతకు వరి నేలవాలింది. పిడుగుపాటుకు గుండాల మండలం వంగాల గ్రామంలో మూడు పాడి పశువులు, పాచిల్ల గ్రామంలో రెండు బర్రెలు మృత్యువాతపడ్డాయి. గుండాల మండల కేంద్రం లో నిమ్మ తోట, పలుచోట్ల మామిడి, బత్తాయి తోటలు దెబ్బతిన్నాయి. వరంగల్‌- హైదరాబాద్‌ జాతీయ రహదారిపై పలుచోట్ల హోర్డింగ్‌లు కూలిపోయాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని పలు మండలాల్లో వర్షం కురిసింది. దహెగాం మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఒక్కసారిగా ఈదురుగాలులతో వడగండ్లు పడటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కౌటాల   మండలం ముత్తంపేటలో పలు ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. కాగజ్‌నగర్‌తోపాటు ఈజ్‌గాంలో చెట్లు విరిగిపడ్దాయి. విద్యుత్‌ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఓ మోస్తరు వాన

ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతుండటంతో గురువారం సాయంత్రం గ్రేటర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. మరో రెండురోజులపాటు ఇదే తరహాలో వర్షాలు కురిసే అవకాశమున్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఎండలు దంచికొట్టినప్పటికీ సాయం త్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం కురిసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని తిరుమలగిరిలో అత్యధికంగా 4.3 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా హబ్సిగూడ జంక్షన్‌లో అత్యల్పంగా 1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఉప్పల్‌, కాప్రా, మల్కాజిగిరి, బాలానగర్‌, ఇబ్రహీంపట్నం, మెహిదీపట్నం, ఖైరతాబాద్‌, షేక్‌పేట, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. ఉపరితల ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో వచ్చే రెండురోజులు గ్రేటర్‌ హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నదని అధికారులు తెలిపారు.logo