'సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో రాష్ట్రంలో గురుకుల పాఠశాలల స్థాపన'

హైదరాబాద్ : సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో బడుగు, బలహీన వర్గాలకు విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్ రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను స్థాపించినట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. క్రాంతి జ్యోతి, చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 190వ జయంతి నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. నగరంలోని ఖైరతాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. క్రిష్ణయ్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. మన దేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, మహిళలకు మొదటి పాఠశాల స్థాపించిన సంఘ సంస్కర్త సావిత్రీబాయి పూలే అని కొనియాడారు. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించారన్నారు. సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా పోరాడిన సంఘ సంస్కర్త. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని మహిళలు, బలహీనవర్గాలు విద్యాపరంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. సావిత్రిబాయి పూలే భర్తతో కలిసి జీవితకాలంలో మొత్తం 52 పాఠశాలలు ప్రారంభించారన్నారు. విద్యతో పాటు, మానవ హక్కుల గురించి ఇతర సామాజిక సమస్యల గురించి స్త్రీలను చైతన్యపరచడానికి మహిళా సేవామండల్ అనే మహిళా సంఘాన్ని స్థాపించి నేటి యువతి యువకులకు ఆదర్శంగా నిలిచారన్నారు.
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. క్రిష్ణయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ అధికారులు అలోక్ కుమార్, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య బట్టు, కార్యదర్శి చంద్రశేఖర్, బీసీ సంక్షేమశాఖ జేడీ, రజక ఫెడరేషన్ ఎండీ మంజుల, డిప్యూటీ సెక్రటరీ సంధ్య, డిప్యూటీ డైరెక్టర్ బాలాచారీ, వడ్డెర ఫెడరేషన్ ఎండీ కృష్ణారెడ్డి, ఉదయ్ ప్రకాష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- భార్యలతో గొడవపడి ఇద్దరు భర్తల ఆత్మహత్య
- పెంపుడుకుక్కకు అంత్యక్రియలు...!
- తెలుగు ప్రజల ఆరాధ్యదైవం ‘అన్న’ కన్నుమూత
- బ్రిస్బేన్‌లో వర్షం.. ముగిసిన నాలుగో రోజు ఆట
- ట్రాక్టర్ల ర్యాలీపై ఢిల్లీ పోలీసులదే తుది నిర్ణయం..
- కంగనా యాక్షన్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..!
- కూకట్‌పల్లిలో దారుణం.. కుమారుడికి నిప్పంటించిన తండ్రి
- ఐపీఎల్లో కొత్తగా ఒక్క టీమే!
- నిర్మాత దొరస్వామి రాజు మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
- రామమందిర నిర్మాణానికి అక్షయ్ విరాళం