ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 12, 2020 , 18:04:45

గురుకులాల పనితీరు అద్భుతం

గురుకులాల పనితీరు అద్భుతం

హైదరాబాద్ :  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలలు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ప్రతినిధులు అభిప్రాయ పడ్డారు. ప్రభుత్వ పాఠశాలలు కూడా ఇదే తరహాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆ కమిటీ ప్రతినిధులు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ను బంజారాహిల్స్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వ గురుకులాల మెరుగైన పని తీరు వల్ల అందులో ప్రవేశం కోసం విపరీతమైన పోటీ ఏర్పడిందని వారు తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ పాఠశాలలను కూడా ఇదే తరహాలో కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని వారు వినోద్ కుమార్ ను కోరారు.

అంగన్వాడీలను ప్రాథమిక పాఠశాల పరిధిలోకి తీసుకుని రావాలని, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఉదయం టిఫిన్, సాయంత్రం అరటిపండు, పాలు ఇచ్చి స్కూల్లోనే హోమ్ వర్క్ చేయించాలని కోరారు. హైస్కూలు స్థాయిలో విద్యార్థులు, టీచర్స్ నిష్పత్తి బాగానే ఉందని కానీ ప్రైమరీ స్కూల్ స్థాయిలో విద్యార్థుల నిష్పత్తి కన్నా ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉన్నట్లు తమ అధ్యయనంలో వెల్లడైందని వారు వినోద్ కుమార్ కు తెలిపారు. ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ గురుకులాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో అక్షరాస్యతను పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని , అందులో భాగంగానే ఈచ్ వన్ - టీచ్ వన్ కార్యక్రమాన్ని చేపట్టిందని వినోద్ కుమార్ వివరించారు. ఈ ప్రతినిధి బృందంలో ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొ. చక్రధర్ రావు, ప్రొ. లక్ష్మీ నారాయణ, పీ డీ ఎస్ యూ రాష్ట్ర అధ్యక్షుడు పరశురాం,  ప్రదీప్, జనార్దన్, రియాజ్, పురుషోత్తం, అనిల్, తదితరులు ఉన్నారు.


logo