శుక్రవారం 15 జనవరి 2021
Telangana - Dec 24, 2020 , 03:45:15

కశ్మీర్‌లో గుప్కార్‌ హవా

కశ్మీర్‌లో గుప్కార్‌ హవా

  • డీడీసీ ఎన్నికల్లో 110 సీట్లు కైవసం
  • 75 స్థానాల్లో బీజేపీ జయకేతనం

శ్రీనగర్‌/జమ్ము, డిసెంబర్‌ 23: జమ్ముకశ్మీర్‌ జిల్లా అభివృద్ధి మండళ్ల ఎన్నికల్లో ఏడు స్థానిక పార్టీల కూటమి-పీపుల్స్‌ అలయన్స్‌ ఫర్‌ గుప్కార్‌ డిక్లరేషన్‌ (పీఏజీడీ-గుప్కార్‌ కూటమి) సత్తా చాటింది. మొత్తం 280 స్థానాలకు గానూ ఇప్పటివరకు 278 సీట్లలో ఫలితాలు వెలువడగా.. గుప్కార్‌ కూటమి 110 స్థానాల్లో జయభేరి మోగించింది. 75 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ.. అతిపెద్ద పార్టీగా అవతరించింది. కుప్వారాలోని డ్రాగ్‌ముల్లా, బందిపొరాలోని హజిన్‌-ఏ స్థానాల్లో ఇంకా ఫలితాలు వెలువడాల్సి ఉన్నది. ఇక్కడ మాజీ మిలిటెంట్లను పెండ్లి చేసుకున్న ఇద్దరు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) పౌరులు బరిలో ఉండటంతో తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకు ఓట్ల లెక్కింపును ఆపాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికలు ఇవి.  

స్వతంత్రులకు బీజేపీ గాలం: ఒమర్‌

స్వతంత్ర అభ్యర్థులను బీజేపీలోనూ, దాని అనుబంధ పార్టీలో (అప్నీ పార్టీ) చేర్చేలా జమ్ముకశ్మీర్‌ యంత్రాంగం వారిని ప్రలోభపెడుతున్నదని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉపాధ్యక్షుడు, మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా ఆరోపించారు. అల్తాఫ్‌ బుఖారీ నేతృత్వంలోని అప్నీ పార్టీ ఏర్పాటు వెనుక బీజేపీ హస్తముందని ఎన్సీ, పీడీపీ ఆరోపిస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం దర్యాప్తు సంస్థలను బీజేపీ ఆయుధాలుగా వాడుకుంటున్నదని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ధ్వజమెత్తారు.