ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Sep 16, 2020 , 03:20:22

3.75 కోట్ల హవాలా సొమ్ము

3.75 కోట్ల హవాలా సొమ్ము

  • హైదరాబాద్‌లో పట్టుబడ్డ గుజరాత్‌ ముఠా
  • ముంబై కేంద్రంగా దందా నడిపిస్తున్నట్టు వెల్లడి

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: భారీ ఎత్తున నగదును అక్రమంగా తరలిస్తున్న గుజరాత్‌ హవాలా ముఠాను హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. వారివద్ద రూ.3.75 కోట్ల డబ్బును స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ ఈ వివరాలను వెల్లడించారు. అహ్మదాబాద్‌కు చెందిన కమలేశ్‌ షా ముంబై కేంద్రంగా పీ విజయ్‌ అండ్‌ కంపెనీ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నాడు. 

ఈ కంపెనీ బ్రాంచ్‌ను హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 12లో ఏర్పాటుచేసి, గుట్టుగా హవాలా దందా నడిపిస్తున్నాడు. ఇక్కడ అదే రాష్ర్టానికి చెందిన దినేశ్‌, గిరి ఇంచార్జిలుగా వ్యవహరిస్తున్నారు. మరో ఇద్దరు ఆఫీస్‌ బాయ్‌లుగా, ఒక మహిళ వంటమనిషిగా పనిచేస్తున్నది. గుజరాత్‌కు చెందిన ఈశ్వర్‌ దిలీప్‌జీ సోలంకి, హరీశ్‌రామ్‌భాయ్‌ పటేల్‌ మంగళవారం ఉదయం రెండు కార్లలో రూ.3,75,30,000 హవాలా సొమ్మును తరలించారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ గట్టు మల్లు బృందం బంజారాహిల్స్‌లో కార్లను ఆపి తనిఖీ చేయటంతో భారీ నగదు బయటపడింది. నగదును స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్టు చేశారు. తదుపరి విచారణను ఆదాయం పన్నుశాఖకు అప్పగించినట్టు సీపీ తెలిపారు. పక్కా సమాచారంతో భారీగా నగదును పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ బృందాన్ని అభినందించారు.


logo