సోమవారం 25 మే 2020
Telangana - Apr 06, 2020 , 01:46:30

కరోనాను ముందే కట్టడి చేద్దాం

కరోనాను ముందే కట్టడి చేద్దాం

-రోగ నిరోధకశక్తి పెరిగితే వైరస్‌ దరిచేరదు

-బలవర్ధక ఆహారం, యోగాతో ప్రయోజనం 

-ఆయుష్‌ ఆధ్వర్యంలో మార్గదర్శకాలు విడుదల

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రోగ నిరోధకశక్తిని పెంచుకోవడం ద్వారా కరోనా వైరస్‌ దరిచేరకుండా నివారించవచ్చని, ఇందుకోసం బలవర్థకమైన ఆహారంతోపాటు, యోగాసనాలు ఎంతో ఉపయోగపడుతాయని కేంద్రం పేర్కొన్నది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను ఇంట్లో ఉండే తరిమేయవచ్చని సూచించింది. ఇందుకోసం ఆయుష్‌ ఆధ్వర్యంలో కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. చాలా సులువైన, నిత్యం అందుబాటులో ఉండే ప్రక్రియల ద్వారా వీటిని పాటించవచ్చని ఆయుష్‌ మార్గదర్శకాల్లో తెలిపింది. కొవిడ్‌ -19 వైరస్‌కు మందు కనుగొనేందుకు మరింత సమయం పడుతుందని, ఖర్చుకూడా అధికంగా ఉంటుందని శాస్త్రవేత్తలు ఇప్పటికే వెల్లడించారని కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వశాఖ వివరించింది. కరోనా కట్టడి కోసం తీసుకునే జాగ్రత్తలతోపాటుగా దవాఖానలు, ఇండ్ల వద్ద గాలిని పరిశుద్ధి చేసే యంత్రాలు (ఎయిర్‌ ప్యూరిఫయింగ్‌ డివైస్‌)ను ఉపయోగించాల్సిన అవసరం ఉన్నదని, దీనిలోభాగంగా రీ యూజబుల్‌ మాస్క్‌లను అందుబాటులోకి తీసువచ్చే ప్రక్రియను పరిశీలిస్తున్నట్టు ఆయుష్‌ పేర్కొన్నది. 

ఆయుష్‌ విడుదలచేసిన మార్గదర్శకాలు

  • రోజంతా గోరువెచ్చని నీటిని తాగడం శ్రేయస్కరం.
  • 30 నిమిషాలపాటు యోగా చేయాలి. ప్రాణాయామం చేస్తే మరీమంచిది. 
  • రోజువారీ ఆహారంలో పసుపు, జీలకర్ర, ధనియాల పాలు వీలైనంత ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. వీటివల్ల శరీరంలో రోగ నిరోధకశక్తి బాగా పెరుగుతుందని అధ్యయనంలో తేలింది. 
  • ఉదయం ఒక టీ స్పూన్‌ చవన్‌ప్రాష్‌ తీసుకోవాలి. మధుమేహం ఉన్నవారికోసం మార్కెట్లో షుగర్‌లెస్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 
  • తులసి ఆకులు, దాల్చినచెక్క, నల్ల మిరియాలు, ఎండుశొంఠి, ఎండుద్రాక్ష మిశ్రమంతో కూడిన హెర్బల్‌ టీ ప్రతిరోజూ రెండుసార్లు తాగాలి. దీనికి బెల్లం, నిమ్మరసం కూడా జోడించుకోవచ్చు. 
  • వేడిపాలల్లో కానీ, వేడి నీటిలోకానీ పసుపు వేసుకొని రెండుసార్లు తాగాలి.


మాస్క్‌ల వినియోగంలో జాగ్రత్త

మాస్క్‌లు ప్రతిఒక్కరూ వినియోగించాల్సిన అవసరం లేదని ఆయుష్‌ తెలిపింది. దగ్గు, జ్వరం ఉన్నవారు మాస్క్‌లు వేసుకోవాలని, చికిత్సచేసే వైద్యసిబ్బంది కచ్చితంగా వాడాలని సూచించింది. ప్రస్తుతం మార్కెట్‌లో దొరికే మాస్క్‌లను ప్రతి ఆరుగంటలకు మార్చాలని, నీటితో తడిస్తే వెంటనే తీసివేయాలని, మాస్క్‌ తొలగించే సమయంలో ముందరి భాగా న్ని ముట్టుకోరాదని, మెడలో వేలాడదీయరాదని పేర్కొన్నది. పలువురు మాస్క్‌లను విచ్చలవిడిగా వాడుతున్నట్టు గుర్తించినట్టు తెలిపింది. మాస్క్‌లను తొలగించిన తర్వాత చేతులను సబ్బుతోనైనా, శానిటైజర్‌తోనైనా శుభ్రం చేసుకోవాలని చెప్పింది. ఈ మార్గదర్శకాలపై విస్తృత ప్రచారం చేయాలని రాష్ర్టాలకు సూచించింది.


logo