e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home Top Slides ఊపిరి బిగవట్టి!

ఊపిరి బిగవట్టి!

ఊపిరి బిగవట్టి!
 • తీవ్ర ఒత్తిడిలో తెలంగాణ వైద్య వ్యవస్థ, సిబ్బంది
 • భారీ ఎత్తున ఐదు రాష్ర్టాల నుంచి తరలివస్తున్న కరోనా రోగులు
 • వారితోనే నిండిపోయిన సగం పడకలు.. ఇక్కడి బాధితులకు ఇక్కట్లు!
 • కట్టడిలేకుంటే వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం
 • బెడ్‌ ఖరారైతేనే రావాలంటున్న ప్రభుత్వం
 • పొరుగు సీఎస్‌లకు సోమేశ్‌కుమార్‌ ఫోన్‌
 • ఐనా మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌నుంచి ఆగని కరోనా బాధితుల ప్రవాహం
 • అనేక రాష్ర్టాల్లో రాకపోకలపై కఠిన ఆంక్షలు
 • తెలంగాణ పాటిస్తుంటే ఎడతెగని గగ్గోలు

యావద్దేశం సతమతమవుతున్నట్టే తెలంగాణ కూడా కరోనాతో కలవరపడుతున్నది!
అన్ని రాష్ర్టాలూ ఆయాస పడుతున్నట్టే తెలంగాణ కూడా మహమ్మారితో గోసపడుతున్నది!

కేసీఆర్‌ దార్శనికతతో ప్రభుత్వ వైద్య వ్యవస్థను వికేంద్రీకరించి, పటిష్టం చేయడం వల్ల
ఈ మాత్రమైనా తట్టుకోగలుగుతున్నాంగానీ లేకుంటే పరిస్థితి దుర్భరంగా ఉండేది!

ప్రధాన దవాఖానల్లో బెడ్లు పూర్తిగా నిండిపోయాయి.అరకొర తప్ప చిన్న దవాఖానలు కూడా ఖాళీ లేవు.

పొరుగు రాష్ర్టాలకు చెందిన వేల మంది ఇప్పటికే మంచిర్యాల మొదలుకుని రాజధాని హైదరాబాద్‌ దాకా తెలంగాణ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. దీనికితోడు ఇంకా రోజూ డజన్ల కొద్దీ అంబులెన్సుల్లో, ఎయిర్‌అంబులెన్సుల్లో తరలి వస్తూనే ఉన్నారు.

తెలంగాణ దవాఖానల్లో ఉన్న బెడ్లలో 45-50 శాతం దాకా పొరుగు రాష్ర్టాల రోగులతోనే నిండిపోయాయి. గాంధీ దవాఖానలోనూ 70-80 మంది దాకా ఉన్నారు.

దీని ఫలితం.. పర్యవసానం.. తెలంగాణవాసులకు బెడ్‌ కావాలంటేదొరకడం లేదు. చావు బతుకుల మధ్య ఊగిసలాడుతూ, ఊపిరి బిగబట్టి వారు దవాఖాన గేట్ల ముందట వేచిచూస్తున్నారు.

దీనికి అంతమేది? పరిష్కారమేది? పర్యవసానమేమిటి?

తెలంగాణలో అనేక రాష్ర్టాల వారు నివసిస్తున్నారు. వారంతా తెలంగాణవారే. ఈ భూమి పుత్రులే. వారెవరికీ ఎవరూ వైద్యాన్ని నిరాకరించడం లేదు. కరోనా చికిత్స కోసం కొత్తగా తరలివస్తున్న వారితోనే సమస్య.

ముందుగా బెడ్‌ ఖరారు చేసుకొని రావాలన్నది ప్రభుత్వ సూచన. అప్పటికప్పుడు వచ్చి బెడ్‌ దొరకక చనిపోతే ఎవరిది బాధ్యత? కేంద్రం కొలిచికొలిచి ఇస్తున్న అత్యవసర మందులో, ఆక్సిజనో చాలకపోతే ఎవరిని జవాబుదారీ చేయాలి? పదేపదే మ్యూటెంట్‌ అవుతున్న కరోనా స్ట్రెయిన్లు పొరుగు రోగులతో తెలంగాణలో వ్యాపిస్తే గతేంకాను? నాలుగైదు రాష్ర్టాల రోగుల్ని తట్టుకోలేక ఇక్కడి సిబ్బంది, వైద్య వ్యవస్థ కుప్పకూలితే అప్పుడు ఏం జరుగుతుంది? తెలంగాణ ప్రజలకు ఈ మాత్రం వైద్యం కూడా అందకుండా మహమ్మారికి బలయ్యే దీనావస్థ ఏర్పడితే ఏం చేయగలం? ప్రాణం ఎవరిదైనా ప్రాణమే! కాదని ఎవరనగలరు? కానీ వనరులు పరిమితం, వైద్య సిబ్బంది పరిమితం. తనకు మాలిన ధర్మం సాధ్యమా?

ఇక్కడి ప్రజలకూ చికిత్స పొందే హక్కుంది కదా!వారికి వైద్యం చేయించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి ఉంటుంది కదా!

హైదరాబాద్‌, మే 14 (నమస్తే తెలంగాణ): ప్రాణాధార ఔషధాలే కాదు వ్యాధి నియంత్రణ టీకాల ఉత్పత్తికి అత్యుత్తమ వైద్య సేవలకు హైదరాబాద్‌ ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. అధునాతన వైద్యం కోసం ఇతర రాష్ర్టాలవారే కాకుండా పలు దేశాల నుంచి కూడా రోగులు ఇక్కడికి వచ్చి స్వస్థత పొందుతుంటారు. ఇప్పుడు కరోనా చికిత్స కోసం కూడా తెలంగాణ సరిహద్దు రాష్ర్టాలైన ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, ఒరిస్సా నుంచి పెద్ద సంఖ్యలో కొవిడ్‌ రోగులు క్యూ కడుతున్నారు. మొదటి వేవ్‌ వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వీరిపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. కేంద్రం నుంచి అదనపు సాయం లేకపోయినా, అందరికీ వైద్యం అందించింది. కానీ రెండోవేవ్‌ కొంత ఉద్ధృతంగా ఉండటంతో పొరుగు రాష్ర్టాల వారికి వైద్య సేవలందించేందుకు వనరుల కొరత వేధిస్తున్నది. వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన చాలామంది ఇక్కడ పడకలు దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు వస్తుండటంతో రాష్ట్ర ప్రజలకు వైద్యం అందించలేని పరిస్థితి. మరోవైపు ఇప్పటికే తెలంగాణ వైద్యులు, సిబ్బంది మునుపెన్నడూ లేనంత ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. మందులు, ఆక్సిజన్‌ సరిపోక వ్యవస్థ అల్లకల్లోలంగా మారితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారన్నది ప్రశ్న.

రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ ప్రాధాన్యం

మొదటివేవ్‌ అనుభవాలను దృష్టిలో ఉంచుకొన్న తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ అవసరాలు తీర్చేలా ఏర్పాట్లు చేసుకున్నది. పడకలు, ఆక్సిజన్‌, మందులు ఇలా అన్నింటిపై దృష్టి సారించింది. మొదటి వేవ్‌లో కేవలం 236 కొవిడ్‌ చికిత్సను అందించే దవాఖానలు ఉంటే, వాటి సంఖ్యను 1,261కి పెంచుకున్నది. మొదటి వేవ్‌లో 18,200 పడకలు మాత్రమే ఉంటే, ఇప్పుడు వాటి సంఖ్యను 53,568కి పెంచింది. అప్పుడు ఆక్సిజన్‌ పడకలు పది వేల దాకా ఉంటే ఇప్పుడు ఆ సంఖ్యను 20వేలకు పెంచింది. ఐసీయూ పడకలు, రెమ్‌డెసివిర్‌ సహా ఇతర ముఖ్యమైన మందుల కొరత లేకుండా జాగ్రత్త పడింది. సీఎం కేసీఆర్‌ స్వయంగా ఫార్మా కంపెనీలతో మాట్లాడి జాగ్రత్తలు చేపట్టారు. వైద్యసిబ్బంది కొరత రాకుండా యుద్ధ ప్రాతిపదికన ఒక్క వైద్యారోగ్యశాఖలోనే 50వేల తాత్కాలిక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేసింది. ఈ ముందస్తు ఏర్పాట్లు రాష్ట్ర ప్రజల అవసరాల కోసం కాకుండా ఇతర రాష్ర్టాల వారికి వరంగా మారుతుండటంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.

ఊపిరి బిగవట్టి!

పొరుగు నుంచి పెద్ద సంఖ్యలో రోగులు

పొరుగు రాష్ర్టాల నుంచి వస్తున్న కరోనా రోగులు హైదరాబాద్‌తోపాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని దవాఖానల్లో చేరుతున్నారు. ఇలా మొత్తంగా 12వేల మందికిపై ఇతర రాష్ర్టాల రోగులు ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. యూపీ, బీహార్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఢిల్లీ నుంచి ఇప్పటి వరకు తెలంగాణకు 35 ఎయిర్‌ అంబులెన్స్‌ల ద్వారా పేషెంట్లు వచ్చినట్టు అధికారులు తెలిపారు. దేశంలోకి కరోనా ప్రవేశించిన నాటినుంచి తెలంగాణ ఈ భారాన్ని మోస్తున్నది. సెకండ్‌వేవ్‌లో ఈ పరిస్థితి మరింత ఎక్కువైంది. అయితే వీరి చికిత్సకోసం ఖర్చు చేస్తున్న వనరుల కోసం గానీ, ఔషధాల కోసం గానీ పక్క రాష్ర్టాలు, కేంద్రం ఏ విధమైన సాయమూ చేయలేదు. పైగా ఆక్సిజన్‌, వైద్య పరికరాలు, మందులు, వ్యాక్సిన్లు.. ఇలా అన్నింట్లో కేంద్రం తెలంగాణ పట్ల వివక్ష చూపుతున్నది. తెలంగాణ జనాభా, ఇక్కడ జరుగుతున్న పరీక్షలు, నిర్ధారణ అవుతున్న రోగుల సంఖ్యను బట్టి కేంద్రం రెమ్‌డెసివిర్‌, టోస్లిజుమాబ్‌, ఇతర మందులు, ఆక్సిజన్‌ కేటాయిస్తున్నది. వీటిని తెలంగాణ రోగులతోపాటు ఇక్కడ చికిత్స పొందుతున్న ఇతర రాష్ర్టాల రోగులకు సమానంగా పంచాల్సి వస్తున్నది. ఇటీవల కేసులు భారీగా పెరిగిన సమయంలో స్వరాష్ట్ర ప్రజలకే బెడ్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు రెమ్‌డెసివిర్‌, టోస్లిజుమాబ్‌ వంటి అత్యవసర ఔషధాలు దొరకక బ్లాక్‌ మార్కెటింగ్‌ పెరిగిపోయింది. ఆక్సిజన్‌కు కొరత ఏర్పడింది. వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏపీ అధికారులతో మాట్లాడారు. పరిస్థితిని వివరించారు. ప్రాణాపాయంలో ఉన్న రోగులను ఆపబోమని అయితే ఏదైనా దవాఖానలో బెడ్‌ కన్‌ఫర్మ్‌ అయితే ఆ మేరకు లేఖ చూపిన వారిని అనుమతిస్తామని కూడా చెప్పారు. అయినా అదే తీరు. ఏ లేఖ ఉండదు. హాస్పిటల్‌లో బెడ్‌ కన్ఫర్మేషన్‌ ఉండదు. అయినా పోతామంటారు. ఆపితే శోకాలు.. టీవీల్లో గగ్గోలు.

అక్కడ ముందే సెకండ్‌వేవ్‌..

మహారాష్ట్ర, కర్ణాటకలో సెకండ్‌వేవ్‌ మనకన్నా ముందే వచ్చింది. దానితో వారంతా ముందే వచ్చి హైదరాబాద్‌ దవాఖానల్లో చేరిపోయారు. ఆ తర్వాత కూడా వారి రాక ధారాపాతంగా కొనసాగుతున్నది. ఏపీలోనూ సెకండ్‌ వేవ్‌ ముందే ఉద్ధృతమైంది. వారితో పోలిస్తే తెలంగాణలో సెకండ్‌ వేవ్‌ కాస్త ఆలస్యంగా ప్రవేశించింది. దీనితో తెలంగాణ రోగులకు బెడ్లు దొరకని, మందులు దొరకని పరిస్థితి ఉన్నది. వివిధ రాష్ర్టాలనుంచి పెద్ద ఎత్తున రోగుల రాక వల్లనే రెమ్‌డెసివర్‌ వంటి మందుల ధరలు బ్లాక్‌లో 40వేలు దాటాయి.

ఊపిరి బిగవట్టి!

ఒక్కో రాష్ర్టానికి ఒక్కో న్యాయం!

రాష్ట్ర వైద్యారోగ్య వ్యవస్థపై ఒత్తిడి పెరిగిపోవడంతో పొరుగు రాష్ర్టాల రోగుల రాకను నియంత్రిస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకుంది. తమ ప్రజలకు తమ స్వరాష్ట్రంలో సరైన వసతులు కల్పించలేని కొందరు పొరుగు రాష్ర్టాల రాజకీయ నేతలు ఇక్కడి ప్రతిపక్ష నాయకులు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఒక విశ్రాంత అధికారి ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు. దేశంలోని అనేక రాష్ర్టాలు నెగెటివ్‌ రిపోర్టు ఉంటేనే అనుమతించాలని ఆంక్షలు విధించి.. మార్చి, ఏప్రిల్‌ నెల నుంచే అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతంగా ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల నుంచి రాకపోకలపై కఠిన ఆంక్షలు విధించాయి. తమ రాష్ర్టానికి వచ్చేవారు 72 గంటల ముందుగా తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్‌ పరీక్షనే చేయించుకోవాలని, అందులో నెగెటివ్‌ అని వస్తేనే రావాలని కేసులు అధికంగా నమోదవుతున్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, రాజస్థాన్‌ వంటి రాష్ర్టాలు నిబంధనలు విధించాయి. తమ రాష్ర్టాల సరిహద్దుల్లో చెక్‌పోస్టులు పెట్టి వచ్చే పోయేవారిని స్క్రీనింగ్‌ చేస్తున్నాయి. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మానవతా దృక్పథంతో నిన్నటివరకు మహారాష్ట్ర, ఏపీ రోగులను అక్కున చేర్చుకున్నది. తమ ప్రజల ప్రయోజనాలు కాపాడుకొనేందుకు మార్గదర్శకాలు విడుదల చేసింది. సంపూర్ణ ఆరోగ్యవంతులపై ఆంక్షలు విధించిన రాష్ర్టాల నిర్ణయాలపై కిమ్మనని మేధావులు తెలంగాణను మాత్రం రోగులను కూడా అనుమతించాలని డిమాండ్‌ చేయడం ఏ విధంగా న్యాయం? ఇతర రాష్ర్టాలకు ఓ న్యాయం.. తెలంగాణకు మరో న్యాయమా? తెలంగాణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నవారు కేంద్రం నుంచి రాష్ర్టానికి మరిన్ని అత్యవసర ఔషధాలు, ఆక్సిజన్‌ నిష్పత్తిని పెంచాలని డిమాండ్‌ చేయగలరా?

సుప్రీంకోర్టు తీర్పుపైనా తప్పుడు భాష్యాలు

కొవిడ్‌ రోగులు దేశంలో ఎక్కడైనా చికిత్స చేయించుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తీర్పును కొందరు తప్పుగా కోట్‌ చేస్తున్నారు. ఢిల్లీలో ఇతర రాష్ర్టాలవారికి చికిత్స అందించే విషయంలో ఈ సమస్య తలెత్తింది. తమ ఆధార్‌ కార్డులు వేరే రాష్ర్టాల చిరునామాలతో ఉన్నందున తమకు చికిత్స అందించడం లేదన్న బాధితుల ఆవేదనపై స్పందించిన సుప్రీంకోర్టు.. వారు వేరే రాష్ర్టాలవారైనా ఉంటున్నది ఢిల్లీలోనే కాబట్టి.. చికిత్స ఇక్కడ అందించాల్సిందేనని స్పష్టంచేసింది. తెలంగాణలో ఉంటున్న ఇతర రాష్ర్టాలవారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చికిత్స అందుతూనే ఉన్నది. కానీ.. తెలంగాణలో నివాసం ఉండని వారు, వేరే రాష్ర్టాలకు చెందినవారు చికిత్స కోసం వస్తున్నారు. ఇదే సమస్యగా మారింది. ఈ వాస్తవాన్ని పక్కన పెట్టేసి సుప్రీంకోర్టు తీర్పులను కోట్‌ చేయడం తగదని పలువురు అంటున్నారు.

ఇవీ తెలంగాణ మార్గదర్శకాలు

 • రాష్ట్రంలోని దవాఖానతో తప్పనిసరిగా కొవిడ్‌ చికిత్స కోసం ఒప్పందం చేసుకోవాలి.
 • రాష్ట్రంలోని దవాఖానల నుంచి రోగుల వివరాలు, ఎలాంటి చికిత్స అవసరం వంటి అంశాలను నిర్ణీత ఫార్మాట్‌లో కంట్రోల్‌ రూమ్‌కు 040-2465119, 9494438351 ద్వారా కానీ, [email protected] gov.inకు మెయిల్‌ ద్వారాగానీ పంపాలి.
 • వాటిని పరిశీలించిన అనంతరం కంట్రోల్‌ రూమ్‌ నుంచి అనుమతి పత్రం జారీ అవుతుంది.
 • ఈ అనుమతి పత్రం ఉన్న రోగులను మాత్రమే రాష్ట్రంలోకి అనుమతిస్తారు.

తెలంగాణకు ప్రత్యేక నిబంధనలా?

కొన్ని దేశాలు, మనదేశంలోని కొన్ని రాష్ర్టాలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవారిని సైతం ఆర్టీపీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్ట్‌ ఉంటే తప్ప.. తమ గడ్డపై అడుగుపెట్టరాదని నిబంధనలు విధిస్తున్నాయి. తెలంగాణకు మాత్రమే ప్రత్యేక రూల్‌ బుక్‌ ఎందుకు? పొరుగు రాష్ర్టాల కరోనా రోగులను కూడా తెలంగాణ ప్రభుత్వం అనుమతించాల్సిందేనని పట్టుబట్టడంలో ఔచిత్యం ఏమిటి? కేంద్రం రాష్ర్టాలను యూనిట్‌గా తీసుకొని, కోటాలవారీగా ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌, టొసిలిజుమాబ్‌ ఔషధాలను, కొవిడ్‌ వ్యాక్సిన్‌ను కేటాయిస్తున్నది. మరి ఐదు పొరుగు రాష్ర్టాలనుంచి వస్తున్న రోగుల నిష్పత్తిని బట్టి కేంద్రం కూడా తెలంగాణకు కేటాయిస్తున్న ఔషధాలు, ఆక్సిజన్‌ కోటాను 30 నుంచి 40శాతం అధికంగా పెంచాలని డిమాండ్‌ చేయగలరా? అలా సాధ్యం కానప్పుడు తమ రాష్ట్ర ప్రజల ప్రాణాలను కాపాడుకొనే బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి ఉండదా? అత్యవసర ఔషధాలు, ఆక్సిజన్‌ కేటాయింపుల్లో వివక్ష తొలగేంత వరకు తమ ప్రజలే తమకు ముఖ్యం అని రాష్ట్ర ప్రభుత్వం భావించడంలో తప్పు ఉన్నదా?

పేషెంట్లను అడ్డుకోవడం లేదు

ఏపీ పేషెంట్లకు చికిత్స అందించబోమని మేం ఎప్పుడూ చెప్పలేదు. సరిహద్దులో అడ్డుకుంటున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఒక్క ఏపీ నుంచి వచ్చే వాళ్లనే కాదు, ఇతర సరిహద్దు రాష్ర్టాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక నుంచి వచ్చే వారిని కూడా ముందస్తు అనుమతి లేకుండా రానివ్వడం లేదు. ఢిల్లీ, బీహార్‌, యూపీ సహా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఎయిర్‌ అంబులెన్స్‌లకు అదే చెప్తున్నాం. మానవత్వంతో ఏడాదిన్నర నుంచి ఎన్నో వేల మంది ఇతర రాష్ర్టాల పేషెంట్లకు చికిత్స అందించాం. ఇప్పుడూ అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. అయితే ప్రభుత్వం నిర్దేశించిన మార్గంలో వారు రాష్ట్రంలోకి రావాల్సి ఉంటుంది. ఇతర రాష్ర్టాల పేషెంట్లు ఇబ్బంది పడకుండా ఉండేందుకు, తెలంగాణలో వనరుల కొరత రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. తెలంగాణకు కేంద్రం కేటాయించిన మందులు, ఆక్సిజన్‌, ఇతర వనరుల నుంచే ఇతర రాష్ర్టాల ప్రజలకు చికిత్స అందిస్తున్నాం. ఈ విషయంలో తెలంగాణకు అదనంగా కేటాయింపులు ఏమీ లేవు. దీన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలి.
-జీ శ్రీనివాసరావు, డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌

హైదరాబాద్‌ మాత్రమే కాదు.. పొరుగు రాష్ర్టాలకు సరిహద్దు జిల్లా కేంద్రాల్లోని దవాఖానల్లో అనేకమంది ఇతర రాష్ర్టాల కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. ప్రత్యేకించి కరీంనగర్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాల్లో అనేకమంది మహారాష్ట్ర కొవిడ్‌ రోగులు గతంలో మొదటివేవ్‌లో, ప్రస్తుతం సెకండ్‌వేవ్‌లో చికిత్స పొందారు.. పొందుతూనే ఉన్నారు. ఆయా దవాఖానల వర్గాలు అందించిన సమాచారం ప్రకారం.. ఆ వివరాలను ఒకసారి పరిశీలిస్తే..

హైదరాబాద్‌

గ్రేటర్‌హైదరాబాద్‌ కరోనా చికిత్సలో ప్రధాన కేంద్రంగా ఉన్నది. ఇక్కడ ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి మొత్తం 50వేల పడకలు ఉన్నాయి. దాదాపు 40శాతం మంది ఇతర రాష్ర్టాలవారు ఇక్కడ చికిత్స పొందుతున్నట్టు అంచనా. వారిలో ఎక్కువగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక పెషెంట్లు ఉన్నారు.

కరీంనగర్‌

 • కరీంనగర్‌లోని పలు ప్రైవేట్‌ దవాఖానల్లో మహారాష్ట్రకు చెందిన వారు గత కొంతకాలంగా చికిత్స పొందుతున్నట్లు తెలుస్తున్నది. నగర శివార్లలోని కృష్ణ లేపాక్షి దవాఖానలో లాక్‌డౌన్‌కు ముందు మహారాష్ట్రకు చెందిన 30 మంది చికిత్స పొందినట్లు సమాచారం. దవాఖాన నిర్వాహకులు ఈ విషయాన్ని బయటకు చెప్పడం లేదు. నగరంలోని ‘మీకుమార్‌’ అనే ప్రైవేట్‌ దవాఖానలో కూడా దాదాపు 10 మంది మహారాష్ట్ర వ్యక్తులు కరోనాకు చికిత్స చేయించుకున్నట్లు సమాచారం. ఇక రైల్వేస్టేషన్‌ సమీపంలో ఉన్న అపోలో రీచ్‌లో కూడా ఇటీవలి వరకు మహారాష్ట్ర వాసులు పెద్ద సంఖ్యలోనే చికిత్స తీసుకున్నట్లు చెప్తున్నారు. వైద్యులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు.
 • గత నెలలో మహారాష్ట్రకు చెందిన నలుగురు కరీంనగర్‌లోని ప్రైవేట్‌ దవాఖానల్లో చికిత్స పొందుతూ మరణించినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు.
 • లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దులు మూసివేయడంతో ఇపుడు కరోనా పేషెంట్లు రావడం లేదని అంటున్నారు.

ఆదిలాబాద్‌

లాక్‌డౌన్‌కు ముందు ఆదిలాబాద్‌ రిమ్స్‌కు రోజూ పదిమంది వరకు మహారాష్ట్ర వాసులు కరోనా వైద్యానికి వచ్చేవారు. బైంసా ప్రభుత్వ దవాఖానకు సైతం ముగ్గురు, నలుగురు మహారాష్ట్ర వారు వచ్చేవారు. లాక్‌డౌన్‌తో రాకపోకలు నిలిచిపోవడంతో ఎవరూ రావడం లేదు.

వరంగల్‌ ఉమ్మడి జిల్లా

వరంగల్‌ ఉమ్మడి జిల్లా పరిధిలో 1100 మంది ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర తదితర రాష్ర్టాల వారు కరోనా చికిత్స పొందారు. ప్రస్తుతం 200 మందికి చికిత్స కొనసాగుతున్నది. ఎంజీఎంలో 520 మంది ఇతర రాష్ర్టాలవారికి కరోనా చికిత్స అందించారు. మరో 1200 మంది ఔట్‌ పేషేంట్‌లు మందులు పొందారు.

నిజామాబాద్‌

 • నిజామాబాద్‌ ప్రభుత్వ దవాఖానలో ఇప్పటివరకు 40 మంది మహారాష్ట్ర వాసులకు ఔట్‌పేషెంట్‌ సేవలు అందించారు. 32 మందిని ఇన్‌పేషెంట్‌గా చేర్చుకొని రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లతో చికిత్స చేశారు.
 • బోధన్‌ ఏరియా దవాఖానలో కరోనా సెకండ్‌వేవ్‌ మొదలైన నాటి నుంచి 50 మంది మహారాష్ట్రవాసులకు కరోనా చికిత్స చేశారు.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఊపిరి బిగవట్టి!

ట్రెండింగ్‌

Advertisement