బుధవారం 27 జనవరి 2021
Telangana - Jan 13, 2021 , 01:54:35

బీసీ హాస్టల్‌కు 50 వేలు

బీసీ హాస్టల్‌కు 50 వేలు

  • శానిటైజేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ
  • కరోనా దరిచేరకుండా వసతులు
  • ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ

హైదరాబాద్‌, జనవరి 12 (నమస్తే తెలంగాణ): త్వరలో విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. వచ్చే నెల 1 నుంచి తొమ్మిదో తరగతి, ఆపై విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో విద్యార్థులకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ శాఖ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను బీసీ సంక్షేమ శాఖ జారీ చేసింది. ప్రతి వసతి గృహానికీ రూ. 50 వేలను విడుదల చేశారు. ఈనెల 20కల్లా హాస్టళ్లకు సన్న బియ్యం, రేషన్‌ సరుకులు చేరాలని ఆదేశించారు. 

ఇవీ మార్గదర్శకాలు

  • జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారులు, హాస్టల్‌ వార్డెన్స్‌, రెసిడెన్షియల్‌ కాలేజీల ప్రిన్సిపాళ్లు స్థానిక సంస్థల అధికారులను సంప్రదించి హాస్టళ్లు, గురుకులాల్లో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించాలి. 
  • హాస్టల్‌ ప్రాంగణాల్లో చెత్తాచెదారం లేకుండా శుభ్రంగా ఉంచాలి. ముళ్లపొదల్ని తొలగిచటంతోపాటు ప్రాంగణాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి. 
  • ఈనెల 25 నుంచి బీసీ సంక్షేమ శాఖ మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రిన్సిపల్‌ సెక్రటరీసహా ఇతర ఉన్నతాధికారులు హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ కాలేజీలను తనిఖీ చేసే అవకాశం ఉన్నది. ఏమైనా లోటుపాట్లు తలెత్తితే చర్యలకు అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. 
  • హాస్టళ్ల కోసం ప్రభుత్వం విడుదల చేసిన రూ. 50 వేల చొప్పున నిధులు విడుదలయ్యాయి. వాటితో చిన్న చిన్న మరమ్మతులు చేయించాలి. ఇంకా నిధులు అవసరమైతే కలెక్టర్లు చొరవ తీసుకొని సమకూర్చాలి. 
  • ప్రతి హాస్టల్‌ను శానిటైజ్‌ చేయించడంతోపాటు పెడస్టల్‌ శానిటైజర్‌ను, మాస్కులను విధిగా కొనుగోలు చేసి హాస్టల్‌లో ఉంచాలి. 
  • బయో మెట్రిక్‌, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించాలి. అవసరమైతే మరమ్మతు చేయించాలి.

25 నాటికి హాస్టళ్లు సిద్ధం చేయాలి: గంగుల 

విద్యాసంస్థల ప్రారంభం దృష్ట్యా ఈ నెల 25కల్లా హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో శానిటైజ్‌ చేయాలని మంత్రి గంగుల కమలాకర్‌ ఆదేశించారు. మంగళవారం బీసీ సంక్షేమశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మొత్తం  70,983 మంది విద్యార్థులకు వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి నెలా 8,500 టన్నుల సన్నబియ్యం అవసరమవుతాయని, దాదాపు 74వేల టన్నుల సన్నబియ్యం పౌరసరఫరాలశాఖ వద్ద అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. క్షేత్రస్థాయి ఏర్పాట్లపై ఈనెల 18 తరువాత జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్‌ ఏర్పాటుచేస్తామని వెల్లడించారు. సమీక్షలో పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పౌరసరఫరాల కార్పొరేషన్‌ ఎండీ వీ అనిల్‌కుమార్‌, బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం పాల్గొన్నారు.


logo