శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 26, 2020 , 01:57:03

పారిశుద్ధ్యం.. తాగునీరు ముఖ్యం

పారిశుద్ధ్యం.. తాగునీరు ముఖ్యం

  • లాక్‌డౌన్‌లో మున్సిపాలిటీలకు మార్గదర్శకాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో లాక్‌డౌన్‌, కర్ఫ్యూ అమలులో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం మున్సిపాలిటీలకు కొన్ని మార్గదర్శకాలను జారీచేసింది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రతి మున్సిపాలిటీలో ఒక కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటుచేసి స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. ‘ప్రతి ఇంటినుంచి క్రమం తప్పకుండా చెత్త సేకరించాలి. ఇండ్లు లేనివారిని నైట్‌షెల్టర్లకు తరలించాలి. నిబంధనను పాటించని సంస్థలు, వ్యాపారకేంద్రాల యజమానులపై ఐపీసీ సెక్షన్‌ 188, 269, 270 ప్రకారం చర్యలు తీసుకోవాలి. హోటళ్లు, రెస్టారెంట్లలో ‘టేక్‌ అవే’ సదుపాయాన్ని మాత్రమే అనుమతించాలి. రూ.5 అన్నపూర్ణ భోజన క్యాంటీన్‌లను తెరిచే ఉంచాలి’ అని మార్గదర్శకాలలో పేర్కొన్నారు. మెరుగైన రీతిలో సేవలందించే పారిశుద్ధ్య సిబ్బందిని, అధికారులను సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 25 మంది కమిషనర్లను, ప్రతి పట్టణ స్థానికసంస్థ నుంచి ముగ్గురు పారిశుద్ధ్య కార్మికుల్ని ఎంపికచేసి ఏప్రిల్‌ 20 తరువాత సన్మానించనున్నారు. 

పట్టణాల్లో వీటికి మినహాయింపు

    • నిత్యావసర సరుకులు, పండ్లు, కూరగాయల షాపులకు సాయంత్రం ఆరు గంటలవరకు అనుమతి. 
    • పాలు, బ్రెడ్‌, గుడ్లు, మాంసం, చేపల విక్రయాలకు అనుమతి 
    • సరుకు రవాణా, గిడ్డంగుల కార్యకలాపాలకు అనుమతి.


logo