గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 18, 2020 , 02:51:42

రుణమాఫీ చెక్కు రైతు చేతికే

రుణమాఫీ చెక్కు రైతు చేతికే

- రూ. 25వేలలోపు రుణం ఒకేసారి.. 

-రూ. లక్షలోపు నాలుగు విడుతల్లో మాఫీ

- కుటుంబం యూనిట్‌గా పథకం అమలు

- గ్రామీణ బ్యాంకుల్లో గోల్డ్‌లోన్లకూ వర్తింపు

- పట్టణాల్లో నగలపై పంటరుణాలకు వర్తించదు

- వ్యవసాయ  రుణమాఫీ మార్గదర్శకాలు జారీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లక్ష రూపాయలకు మించకుండా స్వల్పకాలిక పంట రుణాలకు మాఫీని వర్తింపజేస్తూ రాష్ట్రప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకొని రుణమాఫీ చేస్తారు.  రూ. 25వేలలోపు రుణాలు ఒకేసారి.. లక్షలోపు ఉంటే నాలుగు విడుతలుగా ప్రభుత్వం మాఫీ చేయనున్నది. గ్రామీణప్రాంతాల్లో పంటకోసం బంగారం తాకట్టుపై తీసుకున్న రుణాలకు కూడా మాఫీని వర్తింపజేసింది. రుణమాఫీ చెక్కులను రైతులకే నేరుగా అందజేయనున్నారు. 

ఈ మేరకు వ్యవసాయశాఖ కార్యదర్శి డాక్టర్‌ బీ జనార్దన్‌రెడ్డి మంగళవారం మార్గదర్శకాలకు సంబంధించి ఉత్తర్వులు జారీచేశారు. 2014 ఏప్రిల్‌ 1 నుంచి 2018 డిసెంబర్‌ 11వ తేదీ వరకు రైతులు తీసుకున్న, రెన్యువల్‌ చేసుకున్న పంటరుణాలకు మాఫీని వర్తింపజేశారు. అసలు, వడ్డీ కలుపుకొని రూ.లక్షకు మించకుండా అర్హులైన వారందరి రుణాలు మాఫీ చేయనున్నారు. అధిక వడ్డీకి అప్పులు తీసుకుని పంటకు అవసరమైన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే విధానానికి స్వస్తిచెప్పేందుకు సీఎం కేసీఆర్‌ ఇప్పటికే చేసిన ప్రకటనకు అనుగుణంగా రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న సంస్థాగత రుణాలను మాఫీ చేస్తున్నట్టు ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. 

రైతు కుటుంబం యూనిట్‌గా రుణమాఫీని వర్తింపజేయనున్నారు. అంటే భర్త, భార్య వారిమీద ఆధారపడి ఉన్న పిల్లలు కలిపి గరిష్ఠంగా రూ.లక్ష వరకు నాలుగు విడుతులగా మాఫీ చేయనున్నారు. ఈ రూ.లక్షలో ప్రాసెసింగ్‌ ఫీజు, లీగల్‌ చార్జీలు, ఇన్సూరెన్స్‌ తదితరాలు ఉండవు. ఇటీవల అసెంబ్లీలో ప్రకటించిన విధంగా రూ.25 వేల వరకు ఉన్న పంట రుణాలను ఒకే దఫాలో మాఫీ చేస్తారు. రూ. 25 వేలకు పైబడిన.. లక్షలోపు రుణాలను నాలుగుదఫాలుగా మాఫీ చేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. లబ్ధిదారులకు రుణమాఫీ డబ్బులను చెక్కుల రూపంలో నేరుగా అందించనున్నారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు గ్రీవెన్స్‌సెల్‌ను ఏర్పాటుచేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అర్హుల గుర్తింపు ఇలా..

  • 2014 ఏప్రిల్‌ 1 (గతంలో రుణమాఫీకి తీసుకున్న కటాఫ్‌ తేదీ) నుంచి 2018 డిసెంబర్‌ 11దాకా రైతులు తీసుకున్న, రెన్యువల్‌ పంటరుణాలు, వడ్డీలు కలుపుకొని లక్ష రూపాయలకు మించకుండా మాఫీచేస్తారు.
  • గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకుల్లో బంగారం తాకట్టుతో తీసుకున్న పంటరుణాలు రూ. లక్ష వరకు మాఫీచేస్తారు.  
  • రైతులకు ఎన్నిబ్యాంకుల్లో ఎన్ని అప్పు ఖాతాలున్నప్పటికీ ఒక కుటుంబానికి రూ.లక్ష మేరకు మాఫీ వరిస్తుంది. 
  • కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది పంటరుణానికి అర్హులైతే రూ.లక్ష మొత్తంలో ఉన్నవారందరికీ సమానంగా ఇస్తారు.
  • స్వల్పకాలిక పంట రుణాలు 18 నెలల చెల్లింపు కాలవ్యవధి ఉన్నవాటికే మాఫీ వర్తిస్తుంది, ఉద్యాన పంటల కోసం పొందిన స్వల్పకాల రుణాలూ ఈ పథకం పరిధిలోకి వస్తాయి.
  • రైతు కుటుంబాలను గుర్తించేందుకు ఏఈవో, వీఆర్వో, పంచాయతీ సెక్రటరీల సాయం తీసుకుంటారు. తాసిల్దార్‌, ఎంపీడీవో, వ్యవసాయాధికారి పర్యవేక్షిస్తారు.

వీటికి వర్తించదు: టై అప్‌ రుణాలు, ఖాతా తీసేసిన, రాతపూర్వక రుణాలు, జేఎల్జీ, ఆర్‌ఎంజీ, ఎల్‌ఈసీ రుణాలు, రీస్ట్రక్చర్డ్‌, రీషెడ్యూల్‌ రుణాలు

లబ్ధిదారుల తుది జాబితా ఇలా..

రుణమాఫీ ప్రయోజనం రైతులకు అందించేందుకు వ్యవసాయశాఖ ఐటీ వ్యవస్థ లేదా పోర్టల్‌ను తయారుచేస్తుంది. రైతుల సమాచారం కోసం, వారి రుణాల మొత్తం వంటివి ఫైనల్‌ చేసేందుకు దీనిని వినియోగిస్తారు. ప్రతీ బ్యాంకు బ్రాంచిలవారీగా కటాఫ్‌ తేదీకి అనుగుణంగా ఇచ్చిన పంటరుణాలను నిర్దేశించిన నమూనాలో గ్రామాలవారీగా జాబితాను రూపొందిస్తుంది. దానిని గ్రామసభ నిర్వహించి పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. ఈ సందర్భంగా సామాజిక అడిట్‌ నిర్వహించి.. అభ్యంతరాలు ఏవైనా ఉంటే స్వీకరించి పరిష్కరిస్తారు. తర్వాత బ్రాంచీలవారీగా అర్హుల తుదిజాబితాను లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌, జిల్లా కలెక్టర్‌కు పంపుతారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ బ్యాంకులవారీగా, రైతులవారీగా చెల్లించాల్సిన మొత్తం వివరాలను, ప్రభుత్వం మంజూరుచేయాల్సిన మొత్తాన్ని నిర్ణయిస్తుంది.


logo
>>>>>>