శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 21, 2020 , 01:35:17

ఆన్‌లైన్‌ ఆడిట్‌లో తెలంగాణ మార్గదర్శి

ఆన్‌లైన్‌ ఆడిట్‌లో తెలంగాణ మార్గదర్శి

  • రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ కేంద్రం లేఖ 
  • వచ్చే ఏడాదికి 100% పంచాయతీల్లో అమలు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పంచాయతీల ఆన్‌లైన్‌ ఆడిట్‌లో తెలంగాణ.. దేశానికే మార్గదర్శిగా నిలిచిందని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ జాయింట్‌ సెక్రటరీ కే ఎస్‌ సేథి మంగళవారం తెలంగాణ పంచాయతీరాజ్‌ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, తెలంగాణ లోకల్‌ ఫండ్‌ ఆడిట్‌ సంచాలకులు మార్దినేని వెంకటేశ్వర్‌రావుకు లేఖలు రాశారు. ఈ ఆర్థిక సంవత్సరం 50శాతం పంచాయతీల్లో ఆన్‌లైన్‌ ఆడిట్‌ అమలు చేయాలని పెట్టుకున్న లక్ష్యాన్ని రాష్ట్రప్రభుత్వం సులభంగా చేరుకోవాలని ఆకాంక్షించారు. వచ్చే ఏడాదికి 100 శాతం పంచాయతీల్లో దీన్ని అమలుచేయాలని సూచించారు. ఆడిట్‌ చేయడం, నివేదికలను ఆన్‌లైన్‌లో పొందుపరచడం, పంచాయతీలకు నివేదికలు పంపించడం ఇలా ప్రతీ విషయంలో తెలంగాణ అవలంబిస్తున్న విధానాలు బాగున్నాయని కేంద్ర పంచాయతీరాజ్‌మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ ప్రశంసించారని లేఖలో పేర్కొన్నారు. ఇతర రాష్ర్టాలు ఆన్‌లైన్‌ ఆడిట్‌ ప్రారంభ దశలో ఉండగానే తెలంగాణ మాత్రం 3,225 పంచాయతీలు (25 శాతం) పూర్తిచేసి చూపించిందని తెలిపారు. వచ్చేఏడాది 100 శాతం ఆన్‌లైన్‌ ఆడిట్‌ చేసేందుకు వీలుగా ప్రతి పంచాయతీకి యూసర్‌ ఐడీలు క్రియేట్‌చేయాలని అన్నిరాష్ర్టాల పంచాయతీరాజ్‌శాఖలకు లేఖలు రాయనున్నట్టు వివరించారు.