మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 08, 2020 , 02:03:50

సమాఖ్య స్ఫూర్తికి ‘జీఎస్టీ’ పరీక్ష

సమాఖ్య స్ఫూర్తికి ‘జీఎస్టీ’ పరీక్ష

  • రాష్ర్టాలతో నిమిత్తం లేకుండా కేంద్రం ఏకపక్ష నిర్ణయాలు
  • రాష్ర్టాల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్న బీజేపీ సీఎంలు

బీజేపీ/ఎన్డీయేపాలిత రాష్ర్టాలు తమ ఆర్థిక వ్యవస్థ, ప్రజల స్థితిగతులతో సంబంధం లేకుండా పార్టీ అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యమన్నట్టు వ్యవహరిస్తున్నాయి. మోదీ ప్రభుత్వం చెప్పినట్టు ఏ ఆప్షన్‌ కింద అప్పు తీసుకున్నా రాష్ర్టాల మెడకు గుదిబండ కట్టినట్టేనని సీఎం కేసీఆర్‌, ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు పదే పదే చెప్తున్నారు. అయినా బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారు. ఇతర రాష్ర్టాలతో చర్చించి సమిష్టిగా నిర్ణయం తీసుకోవాల్సిందిపోయి బీజేపీ అధిష్ఠానం ఆదేశాలకు కట్టుబడిపోయారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం కాదా? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ర్టాల హక్కులను కేంద్రం గౌరవిస్తున్నదా? కాలరాస్తున్నదా? సమిష్టిగా నిర్ణయాలు జరుగుతాయా? లేక కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఆదేశిస్తే రాష్ర్టాలు తమ ప్రయోజనాలను తాకట్టు పెట్టాల్సిందేనా? జీఎస్టీ పరిహారం అంశం దేశంలో సమాఖ్య స్ఫూర్తికి ఓ పరీక్షగా మారుతున్నది. ఇప్పటికే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక అంశాల్లో సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ఇప్పుడు జీఎస్టీ పరిహారం విషయంలో ఏకంగా హక్కులను కాలరాసేందుకు ప్రయత్నిస్తున్నది. 2017లో జీఎస్టీ చట్టాన్ని అమల్లోకి తెచ్చే సమయంలో మోదీ ప్రభుత్వం రాష్ర్టాలు నష్టపోయే ప్రతి పైసాను చెల్లిస్తానని హామీ ఇచ్చారు. మొదటి రెండేండ్లు వచ్చిన రూ.47వేల కోట్ల లాభాలను కేంద్రం తన ఖాతాలో (కన్సాలిడేటెడ్‌ ఫండ్‌) వేసుకున్నది. 2019-20 సంవత్సరంలో సుమారు రూ.70 వేల కోట్ల లోటు ఏర్పడటంతో రాష్ర్టాలకు ఇచ్చే విషయంలో మొండికేసింది. ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత ఏడు నెలల దాకా అప్పుడప్పుడూ కొంతమేర నిధులను విదిల్చింది. ఇక 2017-18 నాటి ఐజీఎస్టీ నిధులు రూ.24వేల కోట్లను రెండేండ్లు గడుస్తున్నా ఇప్పటికీ పంపిణీ చేయలేదు. లాభాలు వస్తే జేబులో వేసుకోవడం, నష్టాలు వస్తే వెక్కిరించడం బీజేపీ నైజమని స్పష్టమైపోయింది. పైగా కరోనా, లాక్‌డౌన్‌తో ఆర్థికంగా చితికిపోయిన రాష్ర్టాలను ఆదుకోకుండా సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నది.  

రాష్ట్ర ప్రయోజనాలు కేంద్రానికి తాకట్టు

ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సుమారు రూ.2.35 లక్షల కోట్ల మేర జీఎస్టీ పరిహారం చెల్లించాల్సి వస్తున్నదని కేంద్రమే స్వయంగా చెప్తున్నది. ఈ మొత్తాన్ని తాము చెల్లించలేమని.. అప్పుగా తీసుకోవాలని సూచిస్తూ మూడు ఆప్షన్లు ఇచ్చింది. దీనికి వ్యతిరేకంగా తెలంగాణ నేతృత్వంలో పలు రాష్ర్టాలు పోరాటం చేస్తున్నాయి. అయితే మరోవైపు సుమారు 20 రాష్ర్టాలు ఈ ప్రతిపాదనకు ఒప్పుకున్నాయని కేంద్రం చెప్పుకొంటున్నది. అవన్నీ బీజేపీ/ఎన్డీయే పాలిత, అనుకూల రాష్ర్టాలే కావడం గమనార్హం. అంటే.. ఆయా ప్రభుత్వాలకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, ప్రజల స్థితిగతులతో సంబంధం లేకుండా తమ పార్టీ అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యమన్నమాట. బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారు. ఇంత కీలకమైన అంశంపై ఇతర రాష్ర్టాలతో చర్చించి సమిష్టిగా నిర్ణయం తీసుకోవాల్సిందిపోయి బీజేపీ అధిష్ఠానం ఆదేశాలకు కట్టుబడిపోయారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం కాదా? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

రాష్ర్టాల పరపతి దెబ్బతిన్నా ఫర్వాలేదా?

ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ కింద రాష్ర్టాలకు రుణ పరిమితి (ఎఫ్‌ఆర్బీఎం) పెంచినట్టే పెంచి.. దానిని జీఎస్టీ పరిహారం అప్పులతో ముడిపెట్టడం ద్వారా కేంద్రం భస్మాసుర హస్తాన్ని ప్రయోగిస్తున్నది. మొత్తం రూ.2.35 లక్షల కోట్లను కేంద్రమే అప్పుగా తీసుకొంటే రుణభారం పెరుగుతుందని, అంతర్జాతీయ సంస్థలు మన దేశానికి రేటింగ్‌ను తగ్గిస్తాయని బీజేపీ వర్గాల తాజా వాదన. మరి రాష్ర్టాల అప్పులు పెరిగితే బహిరంగ మార్కెట్‌లో వాటి పరపతి దెబ్బతినదా? రాష్ర్టాల అప్పులు కేంద్రం అప్పులు కావా? పరోక్షంగా అప్పులు పెంచుకోవడాన్ని అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థలు గుర్తిస్తే పరిస్థితి ఏంటి? అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇవ్వడం లేదు. 

కేంద్రానికి ఆప్షన్లు ఫుల్‌

జీఎస్టీ రాకతో రాష్ర్టాలకు సొంతగా ఆదాయం పెంచుకునే మార్గాలు మూసుకుపోయాయి. కేంద్రానికి మాత్రం ఆనేక ఆప్షన్లు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. చమురు ఉత్పత్తులపై పన్ను పెంచడం ద్వారా రూ.2 లక్షల కోట్ల ఆదాయం గడించాలని కేంద్రం టార్గెట్‌గా పెట్టుకున్నది. కరోనా, లాక్‌డౌన్‌తో ఆర్థికరంగం స్తంభించిపోయినప్పటికీ ఏప్రిల్‌-జూన్‌లో స్టాక్‌మార్కెట్‌ లావాదేవీలు గత ఏడాదితో పోల్చితే 75 శాతం పెరిగాయని మార్కెట్‌వర్గాలు చెప్తున్నాయి. సెక్యూరిటీ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌ కింద ఇప్పుడున్న పన్నును కాస్త పెంచితే రూ.50వేల కోట్లు వస్తాయని నిపుణుల సూచిస్తున్నారు. గత 15 ఏండ్లలో ఈ పన్నును పెంచలేదని గుర్తుచేస్తున్నారు. ఇలా కేంద్రానికి ఎన్నో మార్గాలు ఉన్నాయని, సొంతంగా రాబడి పెంచుకొని రాష్ర్టాలను ఆదుకోవాలని, సమాఖ్య స్ఫూర్తిని కాపాడాలని సూచిస్తున్నారు. 


logo