శనివారం 11 జూలై 2020
Telangana - Jun 13, 2020 , 03:40:09

రాష్ర్టాల వాటా పంచుతాం

రాష్ర్టాల వాటా పంచుతాం

  • 2017-18 ఐజీఎస్టీపై కేంద్రం 
  • ఫలించిన సీఎం కేసీఆర్ ఒత్తిడి
  • రాష్ట్ర వాటాగా 2,800 కోట్లు
  • జీఎస్టీ పరిహారం వెంటనే చెల్లించాలి
  • కరోనాతో ఆదాయం పడిపోయింది 
  • ఉద్యోగులకు సగం జీతాలే ఇస్తున్నాం 
  • జీఎస్టీ సమావేశంలో ఆర్థిక మంత్రి హరీశ్ 

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ర్టాలకు ఇంటిగ్రేటెడ్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ (ఐజీఎస్టీ) బకాయిలు విడుదల చేయాలంటూ కేంద్రంపై తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఒత్తిడి ఎట్టకేలకు ఫలించింది. కన్సాలిడేటెడ్ ఫండ్ ఉన్న రూ.1.76 లక్షల కోట్లలో రాష్ర్టాల వాటాగా రావాల్సిన నిధుల విడుదలకు కేంద్రం అంగీకరించింది. ఇందులో తెలంగాణ వాటాగా రూ.2,800 కోట్లు నగదు రూపంలో త్వరలో బదిలీకానున్నాయి. ఐజీఎస్టీ బకాయిల విషయంలో గతంలోనే ఆర్థిక మంత్రులతో కమిటీని ఏర్పాటుచేయగా, తాజాగా ప్రత్యేక ఆహ్వానితులుగా రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్ ఈ సమావేశానికి పిలిచారు. దేశవ్యాప్తంగా ఐజీఎస్టీ ద్వారా వసూలైన మొత్తం కేంద్ర ప్రభుత్వ ఖజానాలోకి జమ అవుతుంటుంది. జీఎస్టీ చట్టం ప్రకారం ఇందులో 50 శాతాన్ని రాష్ర్టాలకు పంచాల్సి ఉంటుంది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐజీఎస్టీ రూ.1.76 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలకు సర్దుబాటు చేయకుండా.. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఖాతా (భారత ప్రభుత్వ ఆదాయ, వ్యయాలు, ఆప్పుల ఖాతా)లో జమచేసింది. ఇలా ఐజీఎస్టీని అడ్డదారిలో తరలించడాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కూడా తప్పుబట్టింది. అయితే ఆ సంవత్సరంలో అనేక రాష్ర్టాలు రెవెన్యూ లోటు కింద కేంద్రం నుంచి నిధులు అందుకోవడంతో ఐజీఎస్టీ నిధులను పట్టించుకోలేదు. జీఎస్టీ పరిహారం పొందకుండా రాబడిని పెంచుకున్న తెలంగాణ, పంజాబ్, ఢిల్లీ, గోవా వంటి రాష్ర్టాలకు దీనివల్ల తీవ్ర అన్యాయం జరిగింది. జరిగిన నష్టాన్ని తెలంగాణ ప్రభుత్వం ముందుగా గుర్తించి, కేంద్రంపై పోరాటాన్ని ప్రారంభించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. కన్సాలిడేషన్ ఫండ్ జమ అయిన ఐజీఎస్టీని రాష్ర్టాలకు పంచాలని ఒత్తిడి తెచ్చారు. గురువారంనాటి సమావేశంలో ఆర్థిక మంత్రి హరీశ్ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. సీఎం కేసీఆర్ ఒత్తిడి ఫలించి.. శుక్రవారం జరిగిన 40వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్రం కీలక నిర్ణయం ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ఫండ్ జమ అయిన రూ.1.76 లక్షల కోట్లలో 50 శాతం.. అంటే రూ.88 వేల కోట్లను రాష్ర్టాల వాటా కింద పంచేందుకు అంగీకరించింది. జీఎస్టీ పరిహారం ఎక్కువగా పొందిన రాష్ర్టాలకు బుక్ అడ్జెస్ట్ చేయనుండగా.. తెలంగాణ వంటి రాష్ర్టాలకు నేరుగా నగదు బదిలీ కానున్నది. ఈ నిధుల్లో తెలంగాణ వాటా కింద రూ.2,800 కోట్లు రానున్నాయి. కరోనా సంక్షోభంతో ఆదాయం పడిపోయిన సమయంలో ఈ నిధులు రాష్ర్టానికి పెద్ద ఊరట కలిగించనున్నాయి. 

వెంటనే జీఎస్టీ పరిహారం

 ఏప్రిల్, మే నెలలకు సంబంధించి తెలంగాణకు రావాల్సిన రూ.3,975 కోట్ల జీఎస్టీ పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ అధ్యక్షతన శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 40వ సమావేశంలో మంత్రి హరీశ్ పాల్గొన్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐజీఎస్టీ నిధులను రాష్ర్టాలకు పంచాలని కౌన్సిల్ నిర్ణయించడంపై హర్షం వ్యక్తంచేశారు. 2017 జూలైలో జీఎస్టీ అమలైననాటి నుంచి దేశంలో అతితక్కువ జీఎస్టీ పరిహారం పొందుతున్న రాష్ట్రం తెలంగాణేనని గుర్తుచేశారు. 2017-18, 2018-19 సంవత్సరాల్లో తాము ఎలాంటి పరిహారం తీసుకోలేదన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీఎస్టీ వసూళ్లలో దేశంలోనే తెలంగాణ మొదటిస్థానంలో నిలిచిందని గుర్తుచేశారు. ఇప్పుడు రాష్ట్రం అవసరాల్లో ఉండి పరిహారం కోరితే ఇవ్వకుండా కేంద్రం నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు. కరోనా వల్ల ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో జీఎస్టీని కోల్పోయామని, ఫలితంగా ఉద్యోగుల వేతనాల్లో కోత విధించామని వివరించారు. ఈ నేపథ్యంలో రెండు నెలల జీఎస్టీ పరిహారం రూ.3,975 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జూన్ నెలలో రాష్ర్టానికి రావాల్సిన వాటాను కూడా పంపిణీ చేయాలని కోరారు. పరిహారం విడుదల ఆలస్యమైతే రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. 15వ ఆర్థిక సంఘం కూడా తెలంగాణకు నిధుల్లో కోత పెట్టిందని, కేంద్రం నిర్ణయాలు రాష్ర్టానికి గుదిబండగా మారాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూకుమారి, అదనపు కమిషనర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. 


logo