శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 20, 2020 , 02:20:47

టీఆర్‌ఎస్‌కు వెల్లువలా మద్దతు

టీఆర్‌ఎస్‌కు వెల్లువలా మద్దతు

  • గులాబీ పార్టీకి పెరుగుతున్న బలం
  • కారువెంటే విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ, కుమ్మర్లు
  • అర్చక సమాఖ్య, అర్చక ఉద్యోగులదీ అదేబాట

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అందరి నోట ‘కారు’ మాటే.. కులమేదైనా, మతమేదైనా నడిచేది గులాబీ పార్టీ వెంటే. ఉద్యోగ సంఘాలదీ ఆ బాటే. హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌కు మద్దతు వెల్లువెత్తుతున్నది. అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లుగా పాలనసాగిస్తున్న పార్టీకి అన్నివర్గాల ఆదరణ లభిస్తున్నది. ‘ఆరేండ్లలో చూసిన ప్రగతి కనీవినీ ఎరుగనిది. హైదరాబాద్‌లో ప్రశాంత వాతావరణం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం’ అంటూ గురువారం మరిన్ని కుల, ఉద్యోగ సంఘాలు తమ మద్దతు ప్రకటించాయి. పలు సంఘాలు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కలిసి మద్దతు ఇస్తున్నట్టు తెలిపాయి. తెలంగాణ అర్చక సమాఖ్య, తెలంగాణ అర్చక ఉద్యోగ కార్యాచరణ సమితి అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ.. మంత్రి కేటీఆర్‌ను కలిసి టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మలు సైతం మద్దతు తెలిపారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పసునూరి బ్రహ్మానందచారి, ప్రధాన కార్యదర్శి లాలుకోట వెంకటాచారి కేటీఆర్‌ను కలిసి మద్దతు ప్రకటించారు. 

ఈ సందర్భంగా వీరికి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. కుమ్మర సంఘం సైతం టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీడీఎల్‌ ఎంప్లాయీస్‌ టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. గేట్‌ మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయించినట్టు బీడీఎల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్షుడు దానవీర కర్ణాచారి తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి షాక్‌ ఇస్తామని టీఆర్‌వీకేఎస్‌ స్పష్టంచేసింది. ‘జీహెచ్‌ఎంసీ ఓటర్లు బీజేపీకి తగిన బుద్ధిచెప్పాలి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు హైదరాబాద్‌ నుంచి స్పష్టమైన నిరసన తెలుపాలంటే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో  టీఆర్‌ఎస్‌కు మద్దతివ్వాలి’ అని టీఆర్‌వీకేఎస్‌ హెచ్‌-58 సంఘం వ్యవస్థాపకుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  కోడూరి  ప్రకాశ్‌ పిలుపునిచ్చారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగ సంఘం నాయకులు సైతం టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపారు.

కుమ్మర్లకు ఎమ్మెల్సీ హామీపై హర్షం 

మూడు కులాలకు ఎమ్మెల్సీ పోస్టులు ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రస్తావించినవాటిలో కుమ్మర్ల పేరు ఉండటంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం పలుచోట్ల కుమ్మర సంఘం ప్రతినిధులు సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. కుమ్మర సంఘం రాష్ట్ర ప్రతినిధుల ఆధ్వర్యంలో హైదరాబాద్‌ గాయత్రి సర్కిల్‌లో, జిల్లాల సంఘాల ప్రతినిధులు ఎల్బీనగర్‌, తూఫ్రాన్‌, భువనగిరిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. భవిష్యత్‌లో భర్తీ చేయనున్న ఎమ్మెల్సీ స్థానాల్లో కుమ్మర్లనూ ఎంపిక చేస్తామని ప్రకటించడంపై సంతోషం వ్యక్తంచేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తమ మద్దతు టీఆర్‌ఎస్‌కేనని తెలంగాణ కుమ్మరి సంఘం రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ఈ మేరకు కర్మన్‌ఘాట్‌ గాయత్రిపురం క్రాస్‌రోడ్‌లో నిర్వహించిన సమావేశంలో తీర్మానించింది. ఆయా కార్యక్రమాల్లో కుమ్మర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నడికుడ జయంత్‌రావు, అసోసియేట్‌ అధ్యక్షుడు మల్కాజ్‌గిరి దయానంద్‌, ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రాజమల్లయ్య, కార్యదర్శి లక్ష్మీనారాయణ, సంఘం ప్రతినిధులు ఎగిరిశెట్టి వీరయ్య, యాదయ్య, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.