మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 03, 2020 , 02:41:32

చిన్నోళ్లూ.. కండ్లు జాగ్రత్త!

చిన్నోళ్లూ.. కండ్లు జాగ్రత్త!

 • పెరుగుతున్న కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌
 • లాక్‌డౌన్‌తో మొదలైన ‘డిజిటల్‌' వ్యసనం
 • ఆన్‌లైన్‌ తరగతులతో మరింత తీవ్రం
 • రోజుకు 8 గంటలకుపైగా స్క్రీన్‌వైపే చూపు
 • జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: పిల్లలు ఒకప్పుడు స్కూల్‌లో మహా అయితే ఓ గంటసేపు కంప్యూటర్‌ స్క్రీన్‌ను చూసేవారు. ఇం టికి వచ్చిన తర్వాత అరగంటో.. గంటో ఫోన్‌తో గడిపేవారు. కాసేపు టీవీ తో కాలక్షేపం. మొత్తంగా రోజులో రెండు గంటల కు మించి డిజిటల్‌ స్క్రీన్‌ను చూసేవారు కాదు. కానీ.. లాక్‌డౌన్‌తో పరిస్థితి మొత్తం మారిపోయింది. 3నెలలుగా ఇంటికే పరిమి తం కావడంతో అత్యధిక శాతం మంది పిల్ల లు ఫోన్‌, టీవీకి బానిసలైపోయారు. బయటికి వెళ్లి ఆడుకునే పరిస్థితి లేకపోవడంతో స్మార్ట్‌ఫోన్‌, కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌, టీవీ వంటి డిజిటల్‌ పరికరాలపై ఎక్కువ సమయాన్ని గడుపడం ప్రారంభించారు.

 8-10 గంటల వరకు..

ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభమైన తర్వాత పిల్లలు డిజిటల్‌ పరికరాలను వినియోగించడం మరింత తీవ్రమైంది. మొదట్లో ఒకటి రెండు క్లాసులు మాత్రమే ఉండటంతో రెండు మూడు గంటలు ఫోన్‌/ట్యాబ్‌/ల్యాప్‌టాప్‌/కంప్యూటర్‌ చూసేవాళ్లు. పాఠశాల లు ఇప్పట్లో తెరిచే అవకాశం లేకపోవడంతో క్లాసుల సంఖ్య పెరిగింది. స్కూల్‌ టైమింగ్‌ తో సమానంగా దాదాపు 8-10గంటలపాటు తరగతులు, హోంవర్క్‌ నడుస్తున్నది. డిజిటల్‌ స్క్రీన్‌ను చూడటం నాలుగు గంట లు దాటినప్పటి నుంచే పిల్లల్లో కంటి సమస్యలు ప్రారంభమయ్యాయి. కంప్యూటర్‌ స్క్రీన్‌ లేదా డిజిటల్‌ పరికరాల స్క్రీన్‌నుంచి వెలువడే బ్లూలైట్‌ కంటిపొరను దెబ్బతీయగలదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్క్రీన్లను తదేకంగా చూడటం వల్ల వచ్చే సమస్యలను సైన్స్‌ పరిభాషలో ‘కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌ లేదా డిజిటల్‌ ఐ స్ట్రెయిన్‌' అని పిలుస్తారని కొండాపూర్‌ అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌ ఆప్తమాలజిస్టు అల్పా అ తుల్‌ ఫూరబియా తెలిపారు. దీనిని నిర్లక్ష్యం చేస్తే పిల్లల్లో శారీరక, మానసిక వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నదని హెచ్చరిస్తున్నారు. 

డిజిటల్‌ స్క్రీన్‌తో తలెత్తే సమస్యలు

 • కండ్లు పొడిబారడం, మంటలు, నొప్పి రావడం 
 • ఎర్రబడటం, కండ్ల నుంచి నీళ్లు కారడం
 • అలసిపోయి కండ్లు మూతపడిపోవడం
 • కండ్ల కింద నల్లటిచారలు రావటం, చూపు మందగించడం 
 • తలనొప్పి, మెడ వెనుకభాగంలో తీవ్రమైన నొప్పి, భుజాల నొప్పులు 

ఈ జాగ్రత్తలు మేలు

 • పదే పదే కనురెప్పలు ఆడించాలి. 
 • స్క్రీన్‌ను తదేకంగా చూడకుండా అప్పుడప్పుడూ ఒకటి రెండు క్షణాలపాటు పక్కకు తిరిగి చూడాలి. 
 • ప్రతి 20 నమిషాలకు ఒకసారి బ్రేక్‌ తీసుకోవాలి. ఆ సమయంలో దూరంగా ఉన్న వస్తువులను చూడాలి. కాసేపు కండ్లకు విశ్రాంతి ఇవ్వాలి. 
 • కండ్ల్లపై ఒత్తిడిని తగ్గించడానికి స్క్రీన్‌ లైటింగ్‌, గదిలో కాంతి సరైన స్థాయిలో ఉండేలా చూసుకోవాలి. 
 • సరైన కుర్చీని ఎంపిక చేసుకొని, నిటారుగా కూర్చోవాలి.
 • స్క్రీన్‌పై అక్షరాల సైజ్‌ను పెంచుకోవడం, గ్లేర్‌ను తగ్గించే స్క్రీన్‌ గార్డులు, కవర్లు వాడటం. 
 • ఆహారం పరంగా.. విటమిన్‌ ఏ, విటమిన్‌ సీతో కూడిన ఆహార పదార్థాలు, బొప్పాయి, క్యారెట్‌, బ్రాకోలి, తోటకూర, గుడ్లు వంటివి తీసుకోవాలి.


logo