శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Oct 01, 2020 , 03:11:14

లక్ష దాటిన కొలువుల భర్తీ

లక్ష దాటిన కొలువుల భర్తీ

  • టీఎస్‌పీఎస్సీ ద్వారానే 29,128 ఉద్యోగాలు
  • మిగతా బోర్డుల ద్వారా మిగతావి పూర్తి
  • వారంలోగా గ్రూప్‌-4 ఫలితాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానంతరం లక్షకుపైగా కొలువులకు ఆర్థికశాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఒక్క టీఎస్‌పీఎస్సీ ద్వారానే 29,128 ఉద్యోగాలను భర్తీచేయగా.. పోలీసు బోర్డు, పంచాయతీరాజ్‌, విద్యుత్‌ సంస్థలు, సింగరేణి, టీఆర్టీ నియామకాలు, గురుకులాలు.. ఇలా మొత్తం కలిపి లక్ష దాకా పోస్టులను భర్తీ చేశారు. వీటికి అదనంగా 22,500 మంది విద్యుత్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ జరిగింది. వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న నియామక పరీక్షల ఫలితాలు విడుదలైతే భర్తీ చేసిన పోస్టుల సంఖ్య మరింత పెరగనున్నది. 1621 గ్రూప్‌-4 పోస్టుల భర్తీ పెండింగ్‌లో ఉండగా, వారంలో ఫలితాలు ఇచ్చేందుకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తున్నది. వెయిటేజీపై కోర్టు స్పష్టత ఇవ్వడంతో పారామెడికల్‌ పోస్టుల ఫలితాలకు గ్రీన్‌సిగ్నల్‌ వచ్చింది. దీంతో దాదాపు 5 వేలకు పైగా పోస్టుల ఫలితాలను నవంబర్‌ నెలాఖరులోగా విడుదల చేయాలని టీఎస్‌పీఎస్సీ వర్గాలు యోచిస్తున్నాయి. ఇప్పటివరకు 39,962 పోస్టుల భర్తీకి ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీకి అనుమతి ఇవ్వగా, 36,665 పోస్టులను నోటిఫై చేస్తూ 107 నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఇప్పటివరకు విజయవంతంగా 29,128 పోస్టులను భర్తీ చేసింది.  

త్వరలో గ్రూప్‌1, 3 నోటిఫికేషన్లు

గ్రూప్‌1, గ్రూప్‌ 3 నోటిఫికేషన్ల విడుదలకు మార్గం సుగమమవుతున్నది. దాదాపు 142 గ్రూప్‌-1 పోస్టులకు ఆర్థికశాఖ ఇప్పటికే అనుమతిచ్చింది. గతంలోనే నోటిఫికేషన్లు ఇవ్వాలనుకున్నప్పటికీ అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు, ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌లో స్పష్టత లేకపోవటం తదితర కారణాలతో ఆలస్యమైంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో రెండు మల్టీజోన్లు వచ్చాయి. జోన్ల వారీగా ఉద్యోగాల విభజన జరగాల్సిన అవసరం ఏర్పడింది. ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం మళ్లీ సవరించిన రోస్టర్‌ ఇవ్వాల్సి ఉన్నది. ఈ విషయాన్ని కొలిక్కి తీసుకొచ్చ్చేందుకు సీఎస్‌ ఆధ్వర్యంలో ఒకటిరెండు సార్లు వివిధశాఖల అధికారులతో సమావేశాలు జరిగాయి. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. ఈ నోటిఫికేషన్‌ కూడా దాదాపు ఆరువందల పోస్టులతో వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.