బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Sep 08, 2020 , 13:40:13

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెరిగిన భూగర్భ జలమట్టాలు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెరిగిన భూగర్భ జలమట్టాలు

నల్లగొండ : రాష్ట్రంలో గత రెండు నెలలుగా కురిసిన వర్షాలతో కృష్ణా, గోదావరి బేసిన్‌లోని చెరువులు, కుంటలు, నీటి వనరులన్నీ పూర్తిస్థాయి జలకళను సంతరించుకున్నాయి. ఈ క్రమంలో భాగంగానే భూగర్భ జలమట్టాలు సైతం పైకి చేరుకున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నాన్‌ ఆయకట్టు ప్రాంతాల్లో సైతం భూగర్భ జలాలు విపరీతంగా పెరిగాయి. జిల్లా ప్రణాళిక అధికారి వెల్లడించిన నివేదికల ప్రకారం.. నల్లగొండ జిల్లాలో ఈసారి 445.6 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణంగానైతే జూన్‌ నుంచి సెప్టెంబర్‌ 9వ తేదీ వరకు 392 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు అవుతుంటుంది. జిల్లాలోని 31 మండలాల్లో రెండు మండలాల్లో రికార్డుస్థాయి వర్షపాతం నమోదుకాగా 22 మండలాల్లో మోతాదుకు మించి వర్షాలు పడ్డాయి. కాగా ఏడు మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఆగస్టులో భూగర్భ జలమట్టం 8.16 మీటర్లకు మెరుగుపడింది. ఇదే జూన్‌లో 10.72 మీటర్లుగా ఉంది. 

సూర్యాపేట జిల్లాలో 588.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదే కాలానికి జిల్లాలో సాధారణ వర్షపాతం 530.6 మిల్లీమీటర్లుగా నమోదు అవుతుంటుంది. 23 మండలాల్లో 9 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. జులైలో 5.02 మీటర్లుగా ఉన్న భూగర్భ జల మట్టాలు ప్రస్తుతం 3.09 మీటర్లకు చేరుకున్నాయి. ఎస్‌ఆర్‌ఎస్‌పీ స్టేజీ-2 కెనాల్‌ ద్వారా గోదావరి జలాలతో జిల్లాలోని 348 చెరువులను పూర్తిస్థాయిలో నింపారు.

 యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ వర్షాకాలంలో 562.5 మిల్లీమీటర్ల వర్షంపాతం నమోదు అయింది. ఇదే కాలానికి సాధారణ వర్షపాతం 441.2 మిల్లీమీటర్లుగా ఉంటుంది. జులైలో 11.21 మీటర్లుగా ఉన్న భూగర్భ జలమట్టాలు ఆగస్టులో 8.55 మీటర్లకు మెరుగుపడ్డాయి. వ్యవసాయశాఖ అంచనాలను మించి నీటివనరుల సంమృద్ది కారణంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో రైతులు ఈ ఏడాది సాగు చేస్తున్నారు.


logo