శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 15, 2020 , 01:53:51

భూగర్భంలో జలభాండాగారం

భూగర్భంలో జలభాండాగారం
  • కాళేశ్వర జలాలతో గణనీయంగా పెరిగిన భూగర్భజలమట్టం
  • ప్రాజెక్టు పరిధిలోని ప్రాంతాల్లో విప్లవాత్మక మార్పు నమోదు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఒక ప్రాజెక్టు.. దశాబ్దాల తరబడి ఆకాశంవైపు చకోరపక్షిలా ఎదురుచూసిన రైతన్న కండ్లను తడిపింది. ఒక ప్రాజెక్టు.. దశాబ్దాల తరబడి తుమ్మలు మొలిచిన కాల్వలను సజీవ జలచర సంచయ జలాశయంగా మార్చివేసింది. ఒక ప్రాజెక్టు.. ఏండ్ల తరబడి పడావుపడ్డ భూములను మాగాణం చేసింది. ఒక ప్రాజెక్టు.. భూగర్భంలో వేల అడుగుల లోతుల్లో దాగి ఉన్న పాతాళ గంగమ్మను ఉబికుబికి పైకి వచ్చేలా చేసింది. అదే కాళేశ్వరం. ఆసియాలోనే అతిపెద్ద బహుళ ఎత్తిపోతల పథకం. కేవలం మూడేం డ్ల వ్యవధిలో పూర్తయిన  కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలు ఒక్కటొక్కటిగా తెలంగాణ సమాజానికి అందుతున్నాయి. 


చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఎస్సారెస్పీ పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరు అందింది. 150 రోజులకుపైగా కాకతీయ కాల్వలో గోదావరి జలాల ప్రవాహం కొనసాగుతూనే ఉన్నది. దశాబ్దాల మొండి కాల్వలకు జలకళ రాగా.. అసలు నీళ్లొస్తాయా అనుకొన్న చెరువులు మత్తడి దుంకుతున్నయి. తాజాగా భూఉపరితలాన గోదారమ్మ పరవళ్లే కాదు, భూగర్భంలోనూ.. కాళేశ్వరం జల భాండాగారాన్ని తయారుచేసింది. ఇది సాంకేతికంగా రుజువైన వాస్తవం. భూగర్భజల వనరులశాఖ నివేదికలే ఇందుకు అద్దంపడుతున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్‌, జగిత్యా ల, పెద్దపల్లి, సిరిసిల్ల, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల పరిధిలో భూగర్భజలమట్టం గణనీయంగా పెరిగినట్టు అధికారులు గుర్తించారు. 


కాళేశ్వరం జలాలు అందుబాటులోకి రాని సిద్దిపేటలో అధికభాగం పదినుంచి 20 మీట ర్ల లోతులో నీళ్లుండగా.. మిగతా ప్రాంతాల్లో 20 మీటర్ల లోతున నీళ్లు ఉన్నాయి. మెదక్‌, సంగారెడ్డిలోనూ అధికభాగం 20మీటర్లలో తున భూగర్భజలాలు ఉన్నాయి. కాళేశ్వరం నాలుగో దశ లింకులో భాగంగా ఇటీవల అన్నపూర్ణ జలాశయానికి నీటి విడుదలచేశారు. నెలాఖరువరకు కొండపోచమ్మలో గోదారమ్మ కొలువుదీరనున్నది. దీంతో సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డిలోనూ.. భూగర్భజలమట్టం పెరుగుతుంది. కాళేశ్వరజలాలు విస్తరించేకొద్దీ ఆయా ప్రాంతాల్లోనూ భూగర్భ జలాలు గణనీయం గా పెరుగుతాయని ఈ నివేదిక ద్వారా స్పష్టమవుతుంది. కాళేశ్వరం జలాల విస్తరణ గతేడాది అక్టోబర్‌ నుంచి మొదలైందని, ఈ సర్వే నవంబర్‌లో నిర్వహించామని భూగర్భ జలవనరులశాఖ డైరెక్టర్‌ మధునూరె తెలిపారు. 


విప్లవాత్మక మార్పు

2018, 2019 నవంబర్‌ మాసాల్లో నమోదైన భూగర్భజలాల స్థాయి కూడా ఇదే విషయా న్ని రుజువు చేస్తున్నది. 2018కంటే 2019లో కాళేశ్వరం పరిధిలోని ప్రాంతాలతోపాటు ఇత ర ప్రాంతాల్లోనూ వర్షపాతం ఎక్కువగా నమోదైంది. సాగుకు బోర్లు, బావుల ద్వారానే కా కుండా రోజువారీ అవసరాలకు కూడా ప్రజ లు భూగర్భజలాలను భారీఎత్తున వినియోగించుకొంటున్నారు. కాళేశ్వరం పరిధిలోని ప్రాంతాల్లో 2018 వర్షాకాలానికి ముందు మొత్తం విస్తీర్ణంలో 4శాతం ప్రాంతంలోనే పది మీటర్లలోపున భూగర్భజలాలు ఉన్నాయి. వర్షాకాలం తర్వాత నవంబరులో సర్వే చేయగా... అది 14 శాతానికి పెరిగింది. 2019లో వర్షాకాలానికి ముందు 3 శాతం ప్రాంతంలోనే పదిమీటర్ల లోపున జలాలు ఉండగా.. నవంబర్‌లో కాళేశ్వరం జలాల విడుదల తర్వాత అది ఏకంగా 51 శాతానికి పెరగడమనేది విప్లవాత్మక మార్పుగా అధికారులు అభివర్ణిస్తున్నారు. 


కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాలు ఎలా ఉన్నాయనేదానిపై భూగర్భ జలవనరుల శాఖ క్షేత్రస్థాయి సాంకేతిక సర్వే ఆధారంగా రూపొందించిన మ్యాప్‌ ఇది. 2009-10 వరకు నవంబర్‌ మాసంలో భూగర్భజలాల స్థాయి సరాసరిన ఇలా ఉన్నది. చిక్కటి నీలిరంగు ఉన్న ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఐదు మీటర్లలోపు అందుబాటులో ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మొత్తం ప్రాంతంలో రెండుశాతం అంటే 233 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే ఈ విధమైన పరిస్థితి ఉన్నది.  నీలిరంగం పలుచగా ఉన్న ప్రాంతాల్లో ఐదు నుంచి పది మీటర్ల లోతున గంగమ్మ ఉన్నట్టు తెలుస్తున్నది. దీని విస్తీర్ణం సుమారు 3,715 కిలోమీటర్లు (కాళేశ్వరం పరిధిలోని 25 శాతం). ఇక పసుపు రంగులో ఉన్న 7,467 కిలోమీటర్ల పరిధిలో పది నుంచి పదిహేను మీటర్ల లోతున భూగర్భ జలాలు ఉన్నాయి. ముదురు పసుపు రంగు ఉన్న 3,197 కిలోమీటర్ల పరిధిలో 15-20 మీటర్ల పరిధిలో భూగర్భజలాలు అందుబాటులో ఉన్నాయి. ఎరుపు రంగు ప్రాంతాల్లో 20 మీటర్ల కంటే లోతున జలాలు ఉన్నాయి. అంటే అది కరువుపీడిత ప్రాంతమన్నట్టు లెక్క. ఇది 396 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నది. 


ఈ చిత్రం.. కాళేశ్వరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గతేడాది ప్రారంభించిన తర్వా త చేపట్టిన క్షేత్రస్థాయి సాంకేతిక సర్వే ప్రకారం తీసింది. దీని ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో ఏకంగా 1,956 కిలోమీటర్ల మేర (13శాతం) ఐదు మీటర్ల లోపునే భూగర్భ జలాలు అందుబాటులోకి వచ్చాయి. 5,693 కిలోమీటర్ల పరిధిలో (38శాతం) ఐదు నుంచి పది మీటర్లలోపు నీళ్లున్నాయి. 25 శాతంతో 3,822 కిలోమీటర్ల పరిధిలో 15-20 మీటర్ల స్థాయిలో జలాలు ఉండగా.. 19-20 మీటర్ల స్థాయిలో 2,265 కిలోమీటర్ల పరిధిన (15 శాతం), 20 మీటర్ల కంటే లోతున 1,264 కిలోమీటర్ల పరిధిలో (8 శాతం) జలాలు ఉన్నాయి. 


logo