శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 03, 2020 , 03:39:58

ఫలించిన జల ఆశయం

ఫలించిన జల ఆశయం
  • స‘జీవ జల’ వారధిగా మారిన ఎస్సారెస్పీ వరదకాలువ
  • 122 కిలోమీటర్ల మేర రిజర్వాయర్‌గా కాలువ
  • ఎస్సారెస్పీ పునర్జీవ పథకంతో కొత్త చరిత్ర
  • నెరవేరుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ కల
  • పాతికేండ్ల తర్వాత నిండుతున్న చెరువులు
  • 32 స్లూయిస్‌ గేట్లతో 49 చెరువులకు నీళ్లు
  • కాలువలో టీఎంసీ నీటినిల్వ.. పెరిగిన భూగర్భజలాలు
  • 16 చోట్ల ఎత్తిపోతల నిర్మాణానికి ప్రణాళిక
  • లక్ష ఎకరాల ఆయకట్టు స్థిరీకరణే లక్ష్యం

కే ప్రకాశ్‌రావు, కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి/హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కనీసం ఊహించనైనా లేదు..ఇసుకమేట వేసిన వరదకాల్వలో నీళ్లొస్తాయని. ఏడాది పొడవునా కాల్వ నిండుకుండలా ఉంటుందని ఆలోచనైనా చేయలేదు. ఎగువ ప్రాజెక్టులతో వట్టిపోయిన శ్రీరాంసాగర్‌లో జలకళ ఉట్టిపడుతుందన్న ఆశ ఎప్పుడో పోయింది. కానీ.. ఇప్పుడు అదే వరదకాల్వ తెలంగాణ పాలిట వరప్రదాయినిగా మారింది. శ్రీరాజరాజేశ్వర జలాశయాన్ని నింపటం కోసం ఉద్దేశించిన ఈ కాలువ ఇప్పుడు 122 కిలోమీటర్ల పొడవునా నీటినిల్వలతో అతిపెద్ద జలాశయంగా రూపుదిద్దుకొన్నది. తెలంగాణలో గోదావరి పునరుత్థానం కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు రూపకల్పనచేసిన పునర్జీవ పథకం అనుకొన్నదానికంటే మూడింతల బహుళ ప్రయోజనాలను చేకూరుస్తున్నది. కాలువ పొడవునా 33 వేల మోటర్ల ద్వారా రైతులు పొలాలకు నీళ్లు తీసుకొంటున్నారు. కాళేశ్వరం జలాల ఎత్తిపోతతో వరదకాల్వ జీవనదిలా మారింది. నాలుగు దశాబ్దాల తర్వాత నాలుగు జిల్లాల్లో చెరువులను నింపి వేల ఎకరాల్లో రెండుపంటలకు సాగునీరు అందించడానికి అవకాశం కల్పించింది. కాలువ వెంట 16 చోట్ల లిఫ్టులు పెట్టడం ద్వారా.. వరదకాల్వ కుడివైపున చెరువులను కూడా నింపి లక్ష ఎకరాలకు సాగునీరు అందించే బృహత్ప్రయత్నం జరుగుతున్నది. 


చెరువులకు మహర్దశ

ఇటీవల సీఎం కేసీఆర్‌ ఆదేశంతో అధికారులు మూడు రోజుల పాటు మోటర్లను నడిపి 1.5 టీఎంసీ నీటిని వరదకాల్వకు తరలిం చారు. చెరువులకు ఇప్పటివరకు 0.5 టీంఎంసీ నీటిని విడుదల చేశారు. దీంతో కాలువను ఆనుకొని ఉన్న కరీంనగర్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్‌ జిల్లాల్లో చెరువులకు మహర్దశపట్టింది. ప్రస్తుతం నిజామాబాద్‌ జిల్లాలోని బాల్కొండ, మోర్తాడ్‌, కమ్మర్‌పల్లి మండలాలు, జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మెట్‌పల్లి, కథలాపూర్‌, మేడిపల్లి, మల్యాల, పెగడపల్లి, కరీంనగర్‌ జిల్లాలోని రామడుగు, గంగాధర, కొత్తపల్లి మండలాల్లోని చెరువులను నింపుతున్నారు. వరద కాలువ పొడవునా 49 చెరువులు ఉండగా, మూడు మి నహా 46 చెరువులను తూముల ద్వారా వందశాతం నింపారు. ఈ చెరువుల కింద సుమారు ఆరువేల ఎకరాలు సాగవుతున్నాయి. 


భారీగా పెరిగిన భూగర్భ జలాలు

వరద కాలువలో ఒక టీఎంసీ జలాలు నిల్వ ఉండటంతో అది జలాశయంగా మారింది. ఇటీవల 1.5 టీఎంసీ నీటితో వరద కాలువను నింపగా, చెరువులకు 0.5 టీంఎంసీ నీటిని విడుదల చేశారు. వరదకాలువ పొడవునా వేల మోటర్లతో రైతులు నీళ్లు తీసుకుంటున్నారు. నీళ్లు తగ్గగానే మళ్లీ నింపేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వరదకాలువకు రెండు వైపులా సుమారు పది నుంచి పదిహే ను కిలోమీటర్ల వరకు భూగర్భజలాలు పెరిగాయి. రాజన్నసిరిసిల్ల జిల్లాలో మధ్యమానేరు నిండడంతోపాటు పునర్జీవ పథకం ప్రభావం తో భూగర్భజలాలు భారీగా పెరిగాయి. గత ఏడాది ఫిబ్రవరిలో 16.68 మీటర్ల భూగర్భ జలాలు ఉండగా ప్రస్తుతం 9.48 మీటర్ల లోతున ఉన్నాయి. అంటే 7.2 మీటర్ల మేర పైకి వచ్చాయి. 


లక్ష ఎకరాల ఆయకట్టుకు జీవం

వరద కాలువ ఎడమ వైపు పల్లంగా, కుడివైపు ఎత్తుగా ఉన్నది. ఎడమవైపు తూముల ద్వారా చెరువులకు నీళ్లిస్తున్నారు. కుడివైపు చెరువులను నింపేందుకు గ్రావిటీ ద్వారా అవకాశం లేదు. దీంతో వరదకాలువ పొడవునా ఎత్తిపోతల పథకాలు నిర్మించి రైతులకు సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు. లిప్టుల ఏర్పాటుకు 16 ప్రాంతాలు అనువుగా ఉన్నాయని అధికారులు ప్రాథమికంగా నివేదిక పంపారు. ప్రస్తుతం ఎడమవైపు ఉన్న 49 చెరువులతోపాటు కుడివైపు ఎత్తిపోతల ద్వారా గొలుసుకట్టు చెరువులను నిం పుతూ సుమారు లక్ష ఎకరాలకు నీళ్లివ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది.


 వరదకాలువలో రిజర్వాయర్లు

ఎస్సారెస్పీ నుంచి 0-122 కిలోమీటర్లు ఉన్న వరదకాలువను ఎస్సారెస్పీ పునర్జీవ పథకం కింద నిండుకుండలా మార్చడానికి మూడు రిజర్వాయర్లుగా విభజించారు. ఇందులో 0-34 కిలోమీటర్‌ వరకు ఒకటి, రెండోది 34-73 కిలోమీటర్‌ వరకు, మూడోది 73-122 వరకు ఏర్పాటుచేశారు. మిడ్‌మానేరు వరకు నాలుగుప్రాంతాల్లో హెడ్‌ రెగ్యులేటర్స్‌తో వదరకాలువ 122 కిలోమీటర్ల పొడవు కాళేశ్వరం జలాలతో 1.5 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. 


తూముల వ్యాసం పెంపు

వరదకాలువపై 32 స్లూయిస్‌ గేట్లు ఉన్నాయి. ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ద్వారా మెజార్టీ తూముల వ్యాసం పెంచారు. ఉమ్మడిరాష్ట్రంలో  వ్యాసం పెంచాలని విజ్ఞప్తిచేసినా పట్టించుకోలేదు. వరదకాలువ నుంచి చెరువులు త్వరగా నిండేందుకు తూముల వ్యాసాన్ని 450 ఎం.ఎం. నుంచి 800 ఎం.ఎం.కు పెంచారు. దీని వల్ల గతంలో ఫీటు ఎత్తుతో వెళ్లే జలాలు, ప్రస్తుతం మూడు ఫీట్ల ఎత్తుతో చెరువులకు తరలుతున్నాయి. చాలాచోట్ల ఆరు మీటర్ల ఎత్తులో తూములు ఉండేవి. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో చెరువుల ఎత్తును పరిగణనలోకి తీసుకొని  రెండు మీటర్లు తగ్గించి నాలుగుమీటర్ల ఎత్తులో పెట్టారు. దీంతో చెరువులు త్వరగా నిండేందుకు అవకాశం ఏర్పడింది. 


మూడురకాలుగా వినియోగం 

ఎస్సారెస్పీ పునర్జీవ పథకం మూడు రకాలుగా ఉపయోగపడనుంది.ఎస్సారెస్పీ నిండితే అక్కడి నుంచి శ్రీరాజరాజేశ్వర జలాశయం, దిగువమానేరు జలాశయానికి నీటిని తీసుకోవచ్చు. మరోరైపు ఎస్సారెస్పీ గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడు కాళేశ్వరం పథకం ద్వారా నీటిని ఎదురెక్కించి పూర్తిస్థాయిలో నింపవచ్చు. అవసరాన్ని బట్టి 122 కిలోమీటర్ల పొడవునా 1.5 టీఎంసీల నీటిని నింపి తద్వారా పరివాహక ప్రాంతంలోని చెరువులకు నీరు ఇవ్వవచ్చు. 


రైతులపై సీఎం కేసీఆర్‌ సానుభూతి

వరద కాలువను నింపి చెరువులకు నీళ్లిస్తుంటే, కాలువ పొడవునా దాదాపు 33 వేల మోటర్లతో రైతులు నీటిని పొలాలకు మళ్లించుకుంటున్నారు. అక్రమంగా మోటర్లు ఏర్పాటు చేయడంతో నీళ్లు పైకి ఎక్కేందుకు కష్టమవుతున్నదని సాగునీటిశాఖ అభ్యంతరం వ్యక్తంచేసింది. ఉచితవిద్యుత్‌ అందిస్తున్నందున మోటర్ల ఏర్పాటు అక్రమం కాదని, పొలాలు ఎండిపోయే అవకాశం ఉన్నందున రైతులు నీళ్లు తీసుకోవడాన్ని అడ్డుకోవద్దని అధికారులకు సీఎం కేసీఆర్‌ సూచించినట్టు తెలిసింది.


మారిన పల్లెల రూపురేఖలు

కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తి కొన్నేండ్లుగా కరువుతో కొట్టుమిట్టాడింది. కొంతకాలంగా గ్రామం దశ తిరిగింది. వరద కాలువ ఈ గ్రామంపక్క నుంచే వెళ్తున్నది. ఎస్సారెస్పీ పునర్జీవ పథకం కింద రిజర్వాయర్‌లా మారటంతో గ్రామానికి చెందిన వేలమంది రైతులు మోటర్లతో పొలాలకు నీళ్లు పెట్టుకొంటున్నారు.గర్శకుర్తి పరిధిలో 3317 ఎకరాల సాగుభూమి ఉండగా, 2017-18లో యాసంగిలో  429 ఎకరాల్లో సాగైంది. 2018-19 రబీలో 612 ఎకరాలు సాగుకాగా.. ప్రస్తుత యాసంగిలో ఏకంగా 1280 ఎకరాల్లో సాగుచేసారు. వానకాలంలో 2,426 ఎకరాల్లో సాగు చేశారు.  


ఇదీ శ్రీరాంసాగర్‌ దుస్థితి

1963 జూలై 26న ఆనాటి ప్రధాని నెహ్రూ పోచంపాడుప్రాజెక్టు (శ్రీరాంసాగర్‌)కు శంకుస్థాపన చేశారు. 1970 జూలై 24న అప్పటి సీఎం బ్రహ్మానందరెడ్డి ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు. శ్రీరాంసాగర్‌ స్టేజీ-1 కింద పూర్వ నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల పరిధిలో 9,68,640 ఎకరాలకు, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు స్టేజీ- 2 కింద  3,97,949 ఎకరాలకు నీళ్లివ్వాలని నిర్ణయించారు. ఉమ్మడిరాష్ట్రంలో ప్రాజెక్టు కాలువల నిర్మాణంపై వివక్ష, ఎగువన మహారాష్ట్రలో గోదావరిపై పలు ఎత్తిపోతల ప్రాజెక్టులను నిర్మించారు. దీంతో వరప్రదాయినిగా భావించిన ప్రాజెక్టు ఉనికే ప్రశ్నార్థకంగా మారింది.  


పునర్జీవమే శ్రీరామరక్ష

కోటి ఎకరాలకు సాగునీరందించడమే లక్ష్యంగా సాగుతున్న సీఎం కేసీఆర్‌ ప్రాజెక్టుల రీడిజైనింగ్‌లో భాగంగా ఎస్సారెస్పీ పునర్జీవ పథకానికి శ్రీకారం చుట్టారు. కాళేశ్వరం లింక్‌-2లో శ్రీరాజరాజేశ్వర (మధ్యమానేరు) జలాశయానికి ఎత్తిపోయడం పునర్జీవపథకంలో ఓ భాగం. గాయత్రి పంపుహౌజ్‌ నుంచి బహుబలి మోటర్ల ద్వారా ఎత్తిపోసే నీరు వరదకాలువ 99.02 కిలోమీటర్‌ వద్ద కలుస్తుంది. వరదకాలువ 102 కిలోమీటర్‌ వద్ద హెడ్‌రెగ్యులేటర్‌కు గేట్లు బిగించారు. గేట్లు తెరిస్తే దిగువన మధ్యమానేరుకు నీళ్లు వెళ్తాయి. మూస్తే ఎగువన ఎస్సారెస్పీకి ఎదురెక్కుతాయి. రూ.1,751 కోట్లతో చేపట్టిన పునర్జీవ పథకానికి 2017 ఆగస్టు 10న ముప్కాల్‌ వద్ద సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. నీటిని ఎత్తిపోసేందుకు రాంపూర్‌, రాజేశ్వర్‌రావుపేట పంపుహౌజ్‌పై ప్రత్యేక దృష్టిపెట్టి రెండేండ్లలో పూర్తిచేశారు. ముప్కాల్‌ పంపుహౌజ్‌కు సంబంధం లేకుండా రాంపూర్‌, రాజేశ్వర్‌రావుపేట పంపుహౌజ్‌ ద్వారా సుమారు 54 టీఎంసీల నీటిని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి ఎత్తిపోయడానికి ఆస్కారం ఉన్నది. ముప్కాల్‌ పంపుహౌజ్‌ కూడాపూర్తయితే రోజుకు టీఎంసీ నీటిని ఎస్సారెస్పీకి ఎతి ్తపోయవచ్చు. రోజుకు టీఎంసీని తరలించేందుకు డిజైన్‌ చేసిన ఈ పథకం అతితక్కువ ఖర్చుతో 48 ఎకరాల భూసేకరణతోనే పూర్తయ్యింది.  


వరద కాలువకు నీళ్లు వచ్చేది ఇలా.. 

శ్రీరాజరాజేశ్వర జలాశయం వరకు ఉన్న ఎస్సారెస్పీ వరదకాలువ మొత్తం పొడవు 122 కిలోమీటర్లు. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్‌-2లో భాగంగా శ్రీరాజరాజేశ్వర జలాశయానికి నీటిని ఎత్తిపోసే క్రమంలో 99.02 కిలోమీటర్‌ వద్ద వరద కాలువ కలుస్తుంది. వరద కాలువ 102 కిలోమీటర్‌ వద్ద హెడ్‌రెగ్యులేటర్‌ గేట్లు బిగించారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్‌ వద్ద (వరదకాలువ 73వ కిలోటర్‌) తొలి పంపుహౌస్‌, ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వర్‌రావుపేట (34 కిలోమీటర్‌) వద్ద రెండో పంపుహౌజ్‌, నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌ మండలం (0.10 కిలోమీటర్‌) వద్ద మూడో పంపుహౌజ్‌ ఏర్పాటుచేశారు. మూడు పంపుహౌజ్‌ల పరిధిలో రోజుకు ఒక టీఎంసీ చొప్పున నీటిని ఎత్తిపోసేందుకు ప్రతి పంపుహౌజ్‌లో ఏనిమిది మోటర్లు ఏర్పాటుచేశారు. ఒక్కో మోటరు సామర్థ్యం 6.5 మెగావాట్లు. ఒక్కో మోటరు రోజుకు 1,450 క్యూసెక్కుల చొప్పున ఎనిమిది మోటర్లు రోజుకు టీఎంసీ నీటిని ఎత్తిపోస్తాయి. ప్రస్తుతం రాంపూర్‌, రాజేశ్వర్‌రావుపేట పంపుహౌజ్‌ వద్ద మోటర్లు విజయవంతంగా నడుస్తున్నాయి. దీంతో 102 కిలోమీటర్‌ నుంచి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు వరదకాలువ హెడ్‌ రెగ్యులేటరీ గేట్ల వరకు కాళేశ్వరం జలాలు వెళ్లాయి. ప్రాజెక్టులో 50 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నంతవరకు వరద కాలువ నుంచి నీళ్లు హెడ్‌ రెగ్యులేటరీ గేట్లద్వారా లోపలికి వెళ్తాయి. 50 టీఎంసీలు మించి ప్రాజెక్టులో నీళ్లుంటే ముప్కాల్‌ పంప్‌హౌస్‌ నుంచి ఎత్తిపోయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 51.86 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి.


చెరువు నీళ్లు చూస్తే ఆకలి ఐతలేదు 

మా ఊరి ఉదకమ్మ చెరువులో నీళ్లను చూస్తే కడుపునిండినట్టు అనిపిస్తున్నది. ఏండ్ల తర్వాత చెరువులో నీళ్లను చూస్తుంటే ఆకలి ఐతలేదు.  వరదకాలువల్లో నీళ్లు వదులడంతో చెరువునిండి మత్తడి దుంకుతున్నది.     

-పొన్నం లక్ష్మి, తక్కళ్లపెల్లి (కథలాపూర్‌)


జన్మలో మత్తడి దుంకుతుందనుకోలే 

పదిహేనుండ్లుగా నీళ్లు లేక ఉన్న కొచ్చెరువు కాళేశ్వరం నీళ్లతో మత్తడి దుంకుతున్నది. జన్మలో మత్తడి దుంకుతుందనుకోలే. 550 ఫీట్ల వరకు బోర్లు వేసినా లాభం ఉండకపోయేది. 15 ఏండ్లుగా నాలుగు ఎకరాల పంట పండించడమే గగనమయ్యేది. కాళేశ్వరం నీళ్లు రావడం సంతోషంగా ఉన్నది. 

- గోదాల నర్సయ్య, రైతు, నాగుల మల్యాల  


మొత్తం పొలం సాగుచేశాం

వరదకాలువలో నీళ్లు మస్తుగా వస్తుండటంతో మొత్తం పొలం వేసిన. మాకు 3 ఎకరాల 10 గుంటల భూమి ఉంది. కొన్నేండ్ల కింద 20 గుంటల పొలంచేసి మిగిలింది బీడు పెట్టెటోళ్లం. చెరువులకు నీళ్లు రావడంతో బోర్లకు నీళ్లు మస్తుగ వచ్చినయి. ఉన్న మొత్తం పొలం సాగు చేసిన. కేసీఆర్‌ సారు ఉండబట్టే ఇంత పొలం సాగుచేసిన.

- వేల్పుల పోచవ్వ, గర్శకుర్తి (గంగాధర మండలం)


భూగర్భజలాలు పెరిగితే మంచిది 

భూ అంతరంలోకి వెళ్తున్నకొద్దీ లవణాల గాఢత అంత ఎక్కువ. బోరు నీటితో సాగుచేస్తే ఎరువులు పనిచేయవు. భూగర్భ జలాలు పెరిగితే లవణాల గాఢత తగ్గుతుంది. ఫలితంగా అధిక దిగుబడి, నాణ్యమైన పంట చేతికొస్తుంది. 

- ఆచార్య ఉమారెడ్డి, పొలాస పరిశోధన స్థానం (జగిత్యాల) 


logo