e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home Top Slides నేలతల్లికి వృక్షార్చన

నేలతల్లికి వృక్షార్చన

 • మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజున అద్భుత ఘట్టం
 • ఒకేరోజు 3.30 కోట్ల మొక్కలు నాటి రికార్డు
 • అట్టహాసంగా గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ప్రోగ్రాం
 • వృక్షార్చనలో లక్షలమంది ప్రజలు, అభిమానులు
 • మొక్కతోనే మంత్రి కేటీఆర్‌కు శుభాకాంక్షలు
 • అందరికీ కృతజ్ఞతలు: ఎంపీ సంతోష్‌కుమార్‌

నేలతల్లి మురిసింది.. ప్రకృతి పరవశించింది.. చరిత్ర ఏనాడూ ఎరుగని ఘట్టం ఆవిష్కృతమైంది. ఒక్కరోజులోనే తెలంగాణవ్యాప్తంగా మూడు కోట్లకుపైగా మొక్కలు నాటి గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ రికార్డు సృష్టించింది. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కే తారకరామారావు జన్మదినం సందర్భంగా ఎంపీ సంతోష్‌కుమార్‌ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ముక్కోటి వృక్షార్చన ఉద్యమంలా సాగింది. టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, పలువురు ప్రముఖులు మొక్కలు నాటి మంత్రి కేటీఆర్‌కు అపురూపంగా శుభాకాంక్షలు తెలిపారు.

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ జన్మదినోత్సవం సందర్భంగా శనివారం నిర్వహించిన ముక్కోటి వృక్షార్చనలో పాల్గొన్నవారందరికీ ధన్యవాదాలు. అందరి భాగస్వామ్యంతో ఒక్కరోజే 3.30 కోట్ల మొక్కలు నాటడం విశేషం. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి అతి తక్కువ సమయంలో అద్భుత స్పందన వచ్చింది.

- Advertisement -

ఎంపీ సంతోష్‌కుమార్‌

హైదరాబాద్‌, జూలై 24 (నమస్తే తెలంగాణ ): పుడమికి పచ్చని రంగు పులిమారా అన్నట్టు.. పర్యావరణానికి ప్రాణంపోసినట్టు.. ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం సంబురంలా సాగింది. ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌శాఖల మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా శనివారం చేపట్టిన ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో ఒక్కరోజే 3.30 కోట్ల మొక్కలు నాటారు. తెలంగాణతోపాటు ఇతర రాష్ర్టాలు, విదేశాల్లో కూడా ముక్కోటి వృక్షార్చన విజయవంతంగా సాగిందని రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ముక్కోటి వృక్షార్చనలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ కార్పొరేషన్‌ చైర్మన్లు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, సినిమా, వ్యాపార, పారిశ్రామిక రంగాలవారు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్నారైలు లక్షల మంది పాల్గొన్నారని చెప్పారు.

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి అతి తక్కువ సమయంలో అద్భుత స్పందన వచ్చిందన్నారు. ఎంపీ సంతోష్‌కుమార్‌ శనివారం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో విస్తృతంగా పర్యటించి ముక్కోటి వృక్షార్చనలో పాల్గొన్నారు. జిల్లాలోని చింతకుంట డబుల్‌ బెడ్‌రూం కాలనీ, పెద్దపల్లి జిల్లాలోని సింగరేణి ఆర్జీ-2, ఆర్జీ-3 ఏరియాల పరిధిలోని అబ్దుల్‌ కలాం క్రీడా మైదానం, ఇల్లందు గెస్ట్‌హౌస్‌, పోలీస్‌ గెస్ట్‌హౌస్‌, అడ్రియాల పోచమ్మ గుడి, సుల్తానాబాద్‌ పట్టణంలోని శాస్త్రీనగర్‌ ఆలయంలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయా చోట్ల మంత్రులు గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, ఎంపీ వెంకటేశ్‌ నేత, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్‌, దాసరి మనోహర్‌రెడ్డి, సుంకె రవిశంకర్‌, జడ్పీ చైర్మన్‌ పుట్ట మధుకర్‌, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మొక్కలు నాటారు. చొప్పదండి మండలం వెదురుగట్ట ఫారెస్ట్‌ ఏరియాలో కేసీఆర్‌ వనాన్ని ప్రారంభించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో శనివారం టీఆర్‌ఎస్‌ శ్రేణులు లక్షల మొక్కలు నాటి మంత్రి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

పండుగలా ఉత్సవం

 • మంత్రి కేటీఆర్‌ జన్మదిన వేడుకలు తెలంగాణ భవన్‌లో ఘనంగా జరిగాయి. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి తలసాని సాయికిరణ్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో రూపొందించిన ‘లీడర్‌’ పాట సీడీని మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవవ్‌ ఆవిషరించారు.
 • కేటీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తన సొంత నిధులతో రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న 1.25 లక్షల మంది విద్యార్థులకు డిక్షనరీల పంపిణీ చేశారు.
 • ఉస్మానియా యూనివర్సిటీలో ముక్కోటి వృక్షార్చన సందర్భంగా ఓయూ పాలక మండలి సభ్యుడు పెర్క శ్యామ్‌ ‘గిఫ్ట్‌ ఏ కెరీర్‌’ పేరిట ముగ్గరు ఓయూ విద్యార్థులకు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు కల్పించారు. మరో నలుగురు గ్రాడ్యుయేట్లకు 5 మంత్ర కెరీర్‌ పాయింట్‌ పోటీ పరీక్షల కోచింగ్‌ సెంటర్‌లో ఉచిత ప్రవేశం కల్పించారు.
 • టీఎన్‌జీఓస్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఛాతీ దవాఖానకు 10 చక్రాల కుర్చీలను విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో దవాఖాన సూపరింటెండెంట్‌ మహబూబ్‌ ఖాన్‌, టీఎన్జీవోస్‌ నేతలు మామిళ్ల రాజేందర్‌, రాయకంటి ప్రతాప్‌, ముజీబ్‌ తదితరులు పాల్గొన్నారు.
 • మంత్రి కేటీఆర్‌ ఆయురారోగ్యాలతో ఉండాలని శనివారం రాష్ట్రవ్యాప్తంగా 12,625 దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించినట్టు రాష్ట్ర అర్చక సమాఖ్య కార్యనిర్వాహక అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు.
 • ముక్కోటి వృక్షార్చనలో భాగంగా శనివారం ఒక్కరోజులో అటవీశాఖ 37.54 లక్షల మొక్కలు నాటి రికార్డు సృష్టించింది.
 • సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో 5 లక్షలకుపైగా మొకలు నాటారు. రామగుండం-1, రామగుండం-2, రామగుండం-3 ప్రాంతాల్లో ఎంపీ సంతోష్‌కుమార్‌ పర్యటించి మొక్కలు నాటారు.
 • కేటీఆర్‌ బర్త్‌డే వేడుకలను వివిధ దేశాల్లో టీఆర్‌ఎస్‌ ఎన్నారై నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆస్ట్రేలియాలో కాసర్ల నాగేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సిడ్నీ, మెల్‌బోర్న్‌, కాన్‌బర్రా, బ్రిస్బేన్‌, ఆడిలైడ్‌ నగరాల్లో కేక్‌ కట్‌ చేశారు. కువైట్‌లో టీఆర్‌ఎస్‌ కువైట్‌ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల ఆధ్వర్యంలో కేక్‌ కట్‌చేసి మొక్కలు నాటారు. టీఆర్‌ఎస్‌ బహ్రెయిన్‌ ఎన్నారైశాఖ ఆధ్వర్యంలో అధ్యక్షుడు రాధారపు సతీశ్‌కుమార్‌, ఉపాధ్యక్షుడు వెంకటేశ్‌ బొలిశెట్టి, ప్రధాన కార్యదర్శి పుప్పాల బద్రి మొక్కలు నాటారు.
 • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలో మంత్రి కేటీఆర్‌ బర్త్‌డేను వినూత్నంగా నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ నేతలు సుంకవల్లి వీరభద్రరావు, అశ్వారావుపేట సొసైటీ చైర్మన్‌ నూతక్కి నాగేశ్వరావు నేతృత్వంలో పువ్వాడ యువసేన ఆధ్వర్యంలో ఊట్లపల్లి రోడ్డులోని పెట్రోల్‌ బంక్‌లో వాహనదారులకు రూపాయికే లీటరు పెట్రోల్‌ పోయించారు.
 • గిఫ్ట్‌ ఏ స్మైల్‌లో భాగంగా ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌ మంచిర్యాల జిల్లా కోటపల్లికి చెందిన వృద్ధ దంపతులు రాగం పోసక్క-మల్లయ్యకు రూ.2 లక్షలతో ఇల్లు నిర్మించి ఇచ్చారు. శనివారం వారితో గృహ ప్రవేశం చేయించి ఇంటి తాళాలను అప్పగించారు. రామగుండం కార్పొరేషన్‌ ఒకటో డివిజన్‌ పరిధిలోని విలేజ్‌ రామగుండంలో కొండ పోశయ్య అనే నిరుపేదకు స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ఇల్లు నిర్మించి ఇచ్చారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఓ పేద కుటుంబానికి రూ.2.50 లక్షల ఆర్థికసాయం అందించారు. అడ్డాకుల మండలంలోని తిమ్మాయపల్లి సర్పంచ్‌ ఆంజనేయులు ఇంటి నిర్మాణానికి రూ.2.50లక్షల చెక్కును అందజేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana