సోమవారం 13 జూలై 2020
Telangana - Feb 11, 2020 , 07:35:22

త్వరలో అన్నపూర్ణ క్యాంటీన్లు..హాయిగా కూర్చొని తినొచ్చు

త్వరలో అన్నపూర్ణ క్యాంటీన్లు..హాయిగా కూర్చొని తినొచ్చు

పేద వారి కడుపు నింపేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పథకానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.

 ఎల్బీనగర్:  గ్రేటర్‌ హైదరాబాద్‌లో రూ. 5 భోజనం కోసం ఇప్పటివరకు అందుబాటులో ఉన్న డబ్బాల స్థానంలో కొన్ని సెంటర్లతో అన్ని హంగులతో డైనింగ్‌ టేబుళ్లపై కూర్చుని భోజనం చేసేందుకు అన్నపూర్ణ క్యాంటీన్లను ప్రారంభించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు సన్నహాలు చేస్తున్నారు.  తొలి అధునాతన అన్నపూర్ణ క్యాంటిన్‌ను ఎల్బీనగర్‌ సర్కిల్‌ పరిధిలోని ఎల్బీనగర్‌ చౌరస్తాలో సిద్ధం చేస్తున్నారు. ఈ అన్నపూర్ణ క్యాంటీన్‌ను మరో 20 రోజుల్లో తుది మెరుగులు దిద్ది ప్రారంభోత్సవానికి సిద్ధ్దం చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.  

సకల సదుపాయాలతో ..

ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో రూ. 5కే భోజనం సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఈ భోజనం చేసేందుకు పేదలే ఆధారం.  పేద వారి కడుపు నింపేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పథకానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీలోని కొన్ని సెంటర్లతో అన్నపూర్ణ క్యాంటీన్లను అధునాతన హంగులతో భోజనాన్ని కూర్చుని తినేందుకు వీలుగా సిద్ధం చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీలోనే తొలి అన్నపూర్ణ క్యాంటీన్‌ ఎల్బీనగర్‌లో రూపుదిద్దుకుంటుంది.   ఈ సెంటర్‌ వద్ద నిత్యం సుమారు 300 మందికి పైగా రూ. 5 భోజనం చేస్తున్నారు. ఈ ప్రాంతంలోనే ఈ అన్నపూర్ణ క్యాంటీన్‌ను రూ. 8.70 లక్షల వ్యయంతో 40 ఫీట్ల పొడుగు, 14 ఫీట్ల వెడల్పుతో నిర్మిస్తున్నారు. 

ఈ క్యాంటీన్‌లో చేతులు కడుగుకునేందుకు వాష్‌బేసిన్లు, 35  మంది ఒకేసారి కూర్చుని భోజనం చేసేందుకు డైనింగ్‌ సదుపాయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. క్యాంటీన్‌లో విద్యుత్‌ సౌకర్యంతో పాటుగా ఫ్యాన్ల సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు. భోజనం చేసేందుకు స్టీల్‌ ప్లేట్లు, నీరు త్రాగేందుకు స్టీల్‌ గ్లాసులను కూడా అందుబాటులో పెడుతున్నారు. మొత్తంగా ఈ క్యాంటీన్‌లో రూ. 5 భోజనం కోసం వచ్చే వారికి సకల సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ అన్నపూర్ణ క్యాంటీన్‌ను మరో 20 రోజుల్లో నిర్మాణం పూర్తి చేసుకుంటుందని ఎల్బీనగర్‌ సర్కిల్‌ ఉప కమిషనర్‌ విజయకృష్ణ తెలిపారు.


logo