గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Nov 01, 2020 , 02:00:13

జనవరికల్లా గ్రేటర్‌ ఎన్నికలు

జనవరికల్లా గ్రేటర్‌ ఎన్నికలు

  • రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: జనవరికల్లా గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలను పూర్తిచేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి వెల్లడించారు. ప్రభుత్వం నుంచి అన్ని విషయాల్లో స్పష్టత వచ్చిందని, వార్డులు, రిజర్వేషన్లలో మార్పు లేనందున నిర్ణీత గడువులోగా ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, పోలింగ్‌ నిర్వహణ తదితర ప్రక్రియలను నిర్ణీత గడువులోగా పూర్తిచేస్తామని చెప్పారు. వార్డులవారీగా ఓటర్ల జాబితా రూపకల్పనకు శనివారం షెడ్యూల్‌ విడుదలచేసినట్టు పార్థసారథి వెల్లడించారు. ఈ మేరకు ఎన్నికల సంఘం మార్గదర్శకాలను విడుదల చేసింది. జీహెచ్‌ఎంసీ పాలకవర్గం గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరి పదితో ముగియనున్నందున నిర్ణీత సమయంలో ఎన్నికలు నిర్వహించాలని పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ తదితరులు పార్థసారథిని కోరారు. గ్రేటర్‌ ఎన్నికల ఏర్పాట్లపై పార్థసారథి వారితో సమావేశమయ్యారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఎన్నిక నిర్వహణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.