బుధవారం 03 జూన్ 2020
Telangana - May 01, 2020 , 02:08:14

ఇది కదా.. తెలంగాణ

ఇది కదా.. తెలంగాణ

 • మన ప్రాంతం.. మన పాలన.. మన ధాన్యం  
 • అరిగోస పోయింది.. వరిపంట పండింది
 • సాగునీటి లభ్యతతో రాష్ట్ర రైతాంగంలో మార్పు 
 • ఏ జిల్లాలో చూసినా వడ్ల రాశులే ప్రత్యక్షం
 • కోటి టన్నులు దాటనున్న ధాన్యం దిగుబడి
 • సాగర్‌కు కాళేశ్వరంతోడుతో ఉమ్మడి నల్లగొండ రికార్డు
 • యాసంగిలో 136 శాతం పెరిగిన వరి సాగు
 • ఇతర పంటల్లోనూ 67 శాతం పెరుగుదల

అడిగేటోడుంటే.. శంకుస్థాపన రాయి పడ్తది.. మా వాటా సంగతేందని నిలదీస్తే.. అదిగో ప్రాజెక్టు అన్న మాట వినిపిస్తది.. ఉమ్మడి రాష్ట్రంలో అన్నీ ఉత్తుత్తి ముచ్చట్లే.. పోతే బొంబాయి.. దిగితే బొగ్గుబాయి.. తవ్వితే బోరుబాయి అరిగోస మిగిలిందే తప్ప వరిసాగు జరుగనే లేదు.మన అధికారం మన చేతికొస్తే.. మన ప్రాంతం మన పాలనలో ఉంటే.. తెలంగాణ ఏం చేయగలదో చేసి చూపించింది. చీకట్లను చిదిమేసి.. గంగమ్మకు ఎదురేగి.. చెరువులను నింపేసి.. చేనులను ఊగించింది. ఎవుసమంటేనే ఉసూరుమన్న బతుకులు..  మట్టితల్లిని వదిలిరానంటున్నాయి. ఒడ్ల రాసులతో గాబులు పొంగెత్తుతున్నాయి. ఇది కదా తెలంగాణ..!  ఇదే కదా..

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: చినుకుపడితే కానీ తడవని చేలల్లో వేసవిలోనూ నీటిఊట ఉబుకుతున్నది. ఆరుతడి పంటలకు అలవాటైన మెట్టభూములు మాగాణమయ్యాయి. ఎక్కడోకానీ కన్పించని వరిచేలు ఇప్పుడు నలుదిక్కులా ధాన్యపు గొలుసుకట్టుతో బంగారువర్ణాన్ని తలపిస్తున్నాయి. రాష్ట్ర రైతాంగం ఆ పంటా.. ఈ పంటా అనకుండా వరి పంట అం టున్నది. సాగునీటి వసతులు విస్తరించటంతో యాసంగిలో 40 లక్షల ఎకరాల్లో సాగుతో కోటి రతనాల వీణ.. కోటి టన్నుల ధాన్యరాశిగా మా రింది. యాసంగిలో రైతులు పోటీపడి మరీ వరి ని సాగుచేసి వ్యవసాయాన్ని పండుగ చేశారు. 

ధాన్యపు భాండాగారం

తెలంగాణ దేశానికి ధాన్యపు భాండాగారాన్ని అందించింది. ఆ జిల్లా.. ఈ జిల్లా అనిలేకుండా పాత తొమ్మిది గ్రామీణ జిల్లాలు లక్షల టన్నుల వడ్లను పండిస్తున్నాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నట్టు ఇది నిజంగా మార్కెట్‌ యార్డుల్లో రైతుల మధ్య పండుగ జరుపుకోవాల్సిన సమయం. ప్రాజెక్టుల ద్వారా వేల చెరువులను నింపిన ఫలితంగా తెలంగాణ భూగర్భమే జల భాండాగారంగా మారింది. కాళేశ్వరంతో పునర్జీవం పొందిన శ్రీరాంసాగర్‌ ఆయకట్టుతో పాత నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో వరిసాగు భారీఎత్తున పెరిగింది. గత వానకాలంలో కృష్ణమ్మ కరుణించడంతో నాగార్జునసాగర్‌ ఆయకట్టుకూ ఢోకా లేకుండాపోయింది. ఆన్‌గోయింగ్‌ ప్రాజెక్టుల పూర్తి పాత పాలమూరు దిశనే మార్చేసింది. మధ్యతరహా ప్రాజెక్టులతో ఆదిలాబాద్‌లో సైతం గణనీయంగా వరిసాగు చేశారు. తొమ్మిది జిల్లాల పరిధిలో గత యాసంగితో పోలిస్తే సరాసరి 136 శాతం విస్తీర్ణంలో వరి అధికంగా సాగయింది. రంగారెడ్డి జిల్లాలోనూ 162 శాతం వరి సాగవడం రాష్ట్రంలో పెరిగిన సాగునీటి వసతికి అద్దం పడుతున్నది. సాగర్‌ ఎడమకాల్వతోపాటు తొలిసారిగా కాకతీయకాల్వ ద్వారా కాళేశ్వరం జలాలు రావడంతో రాష్ట్రంలోనే గరిష్ఠంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 9.48 లక్షల ఎకరాల్లో వరిపంట  సాగవడం విశేషం. కొత్త జిల్లాలవారీగా చూసినా రాష్ట్రంలో నల్లగొండ, సూర్యాపేట మొదటి రెండుస్థానాల్లో ఉన్నాయి.

మొత్తం సాగులో 67 శాతం అధికం

గత యాసంగితో పోలిస్తే రాష్ట్రంలో ఉమ్మడి తొమ్మిది జిల్లాల్లో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. 2018-19 యాసంగిలో అన్ని పంటలు కలిపి 28,23,668 ఎకరాల్లో సాగుచేశారు. 2019-20 యాసంగిలో ఆ విస్తీర్ణం 52,61,556 ఎకరాలకు పెరిగింది. గతేడాదితో పోల్చితే ఇది 67 శాతం అదనం కావడం విశే షం. కొత్త జిల్లాలవారీగా చూస్తే.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా 142 శాతం అధికంతో సాగు విస్తీర్ణం పెరుగుదలలో మొదటిస్థానంలో ఉంది. ఆ తర్వాత ఖమ్మం (133 శాతం), మంచిర్యాల (128 శాతం) ఉండగా.. వందశాతానికి మించి ఎనిమిది జిల్లాలు ఉన్నాయి. పదమూడు జిల్లాల పరిధిలో గతానికంటే 50శాతం అధికం, మిగిలిన కొన్నిజిల్లాల్లో 7-30 శాతం అధికంగా పెరిగింది. కానీ, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, జోగుళాంబ గద్వాల, ములుగు జిల్లాల పరిధిలోనే గత యాసంగి కంటే తక్కువ విస్తీర్ణంలో సాగు జరిగింది. కానీ, వరి సాగు విస్తీర్ణం మాత్రం ఏ జిల్లాలోనూ తగ్గలేదు.

ఇతర పంటల సాగులో తగ్గుదల

ఈ యాసంగిలో తెలంగాణ రైతాంగం వరిసాగువైపు అధికంగా మొగ్గుచూపింది. గత యాసంగి కంటే ఏకంగా 136 శాతం విస్తీర్ణం పెరుగడంతో ఇతర పంటల సాగులో గణనీయమైన తగ్గుదల కనిపిస్తున్నది.  మొక్కజొన్న (57 శాతం), శనగ (36 శాతం) మాత్రమే సాధారణం కంటే ఎక్కువ సాగయ్యాయి. ఉలువలు, పెసర, మినుములు వంటి పప్పుధాన్యాల సాగు గణనీయంగా తగ్గిపోయింది. వేరుశనగ కూడా సాధారణం కంటే 30 శాతం తక్కువ సాగవగా.. పొద్దుతిరుగుడు 51 శాతం తగ్గింది. నువ్వులు సాగు సాధారణం కంటే స్వల్పంగా పెరిగింది. పొగాకు సాధారణం కంటే 60 శాతం తక్కువ విస్తీర్ణంలో సాగుకాగా.. మిర్చి, ఉల్లిని ఒక్కఎకరంలోనూ వేయలేదు. వరి మినహా ఇతర పంటలను గతేడాది యాసంగిలో 4.68 లక్షల ఎకరాల్లో సాగుచేయగా.. ఈసారి 5.60 లక్షలకు పెరిగినప్పటికీ సాగు విస్తీర్ణంలో పెరుగుదలశాతం చాలా తక్కువగా ఉన్నది. వరి విస్తీర్ణం పెరుగుదల 136 శాతం ఉంటే ఈ పంటల సాగులో 20 శాతమే పెరుగుదల నమోదైంది.

వానకాలంలో గణనీయంగా పత్తి

రాష్ట్రంలో 2019-20 వానకాలంలో 1,09,08,946 ఎకరాల్లో సాగు విస్తీర్ణం నమోదైంది. సాగునీటి ప్రాజెక్టులు అంతగా అందుబాటులోకి రాకపోవడం, వర్షాల రాక ఆలస్యంతో వరి 31,11,274 ఎకరాల్లోనే సాగయింది. మిగిలిన 77,97,672 ఎకరాల్లో 45,94,969 ఎకరాల్లో (59 శాతం) రైతులు పత్తిని సాగుచేశారు.

 • 2001 ఏప్రిల్‌తెలంగాణ రాష్ట్రసమితి ఆవిర్భావం ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం 
 • 2003  మేస్త్రిని హెలికాప్టర్‌లో పట్టుకెళ్లిదేవాదుల ప్రాజెక్టుకు అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన
 • 2003 జూలై రాజోలి బండ ఆధునీకరణకోసం ఉద్యమనేత కేసీఆర్‌ పాదయాత్ర
 • 2005 హడావుడిగా రాజోలిబండ ఆధునీకరణకు నాటి సీఎం వైఎస్సార్‌ ఆమోదం
 • 2007 ఏప్రిల్‌ టీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావు ఫ్లోరైడ్‌ పోరుయాత్ర ప్రారంభం
 • 2007 జూలై నక్కలగండి ఎత్తిపోతలకు అప్పటి సీఎం మంజూరుlogo