గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Oct 12, 2020 , 17:54:11

ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు : మంత్రి గంగుల

ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు : మంత్రి గంగుల

కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం ఆది నుంచి రైతు పక్షపాతిగా వ్యవహరిస్తున్నది. ఈ సారి మరింత పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్లను చేపడుతున్నది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో కొనుగోళ్లు జరుపుతామని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోళ్లపై జరిగిన సన్నాహక సమావేశానికి మంత్రి గంగుల హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తేవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. తేమ 17 శాతం లోపు ఉండాలని అన్నారు. కరీంనగర్ జిల్లాలో 4.0 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో 352 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ప్రతి కేంద్రంలో మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు గన్నీ బ్యాగ్స్, టార్పాలిన్లు అవసరం అయినన్ని అందుబాటులో ఉంచుతున్నామని మంత్రి స్పష్టం చేశారు.

ప్రతి గ్రామానికి ఒక కేంద్రాన్ని, పెద్ద గ్రామాలకు రెండు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కొనుగోళ్లను పర్యవేక్షించేందుకు ప్రతి కేంద్రానికి ఒక అధికారిని, ప్రతి ఐదు కేంద్రాలకు ఒక నోడల్ అధికారిని నియమిస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోళ్లు జరిగినన్ని రోజులు అధికారులు, ప్రజా ప్రతినిధులు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని కోరారు. సమావేశంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, టీస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, జడ్పీ చైర్‌పర్సన్ కనుమల్ల విజయ, కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్ లాల్ తదితరులు పాల్గొన్నారు.


logo