సోమవారం 18 జనవరి 2021
Telangana - Oct 20, 2020 , 01:30:12

పావుగంటలో పట్టా

పావుగంటలో పట్టా

యజమాని చేతికి నాలుగు రకాల పత్రాలు

పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్న ధరణి పోర్టల్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ధరణి పోర్టల్‌ ప్రారంభమయ్యాక వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ప్రక్రియ అత్యంత వేగంగా పూర్తయ్యి కేవలం పావుగంటలోనే పట్టా చేతికి రానున్నది. దీంతో కొనుగోలుదారు, అమ్మకందారుకు ఎదురుచూపులు తప్పనున్నాయి. ధరణితో ఇంట్లో కూర్చొనే స్లాట్‌బుక్‌ చేసుకునే అవకాశం కలుగుతుంది. వివరాల నమోదు నుంచి ఫీజు చెల్లించే వరకు అంతా మొబైల్‌/కంప్యూటర్‌ ద్వారానే చేసుకునేలా పోర్టల్‌ను తీర్చిదిద్దుతున్నారు. స్లాట్‌ తేదీ ప్రకారం అమ్మకందారు, కొనుగోలుదారు, సాక్షులు నిర్దేశిత సమయానికి తాసిల్దార్‌ కార్యాలయానికి వెళ్తారు. అక్కడ తాసిల్దార్‌, ధరణి ఆపరేటర్‌ వారి వివరాలను సేకరించడం, పత్రాలను అప్‌లోడ్‌ చేయడం, బయోమెట్రిక్‌ (వేలిముద్రలు) తీసుకోవడం, పట్టా మార్పిడి, రికార్డుల్లో భూమి బదలాయింపు ఇలా ప్రక్రియ మొత్తం పావుగంటలో పూర్తికానున్నది. స్లాట్‌ బుకింగ్‌ సమయంలో వివరాలన్నీ సమగ్రంగా నమోదు చేస్తే ఆలస్యం లేకుండా రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ పూర్తవుతుందని అధికారులు చెప్తున్నారు. లావాదేవీ అనంతరం ఈ-పాస్‌బుక్‌, 1బీ, పహాణీ, మ్యుటేషన్‌ ఆర్డర్‌ను అమ్మకందారు, కొనుగోలుదారుకు అందజేస్తారు. ఈ-పాస్‌బుక్‌లో నాలుగు పేజీలు ఉంటాయి. మొదటి పేజీలో యజమాని ఫొటో పూర్తి వివరాలు, వేలిముద్ర, తాసిల్దార్‌ సంతకం ఉంటాయి. విక్రయం/పంపకం ప్రక్రియ పూర్తికాగానే అమ్మకందారు, కొనుగోలుదారు వద్ద ఉన్న పట్టాదార్‌ పాస్‌బుక్‌లో తాజా లావాదేవీల వివరాలను నమోదుచేస్తారు. కొనుగోలుదారు లేదా కొత్త హక్కుదారుడికి పాస్‌బుక్‌ లేకపోతే కొత్తది ముద్రించి ఇస్తారు. అయితే కొత్తపాస్‌బుక్‌ రావడానికి కొంత సమయం పడుతుంది.

రైతుల కష్టాలు తీరుతాయి

ధరణి పోర్టల్‌ ప్రారంభమైతే భూముల క్రయవిక్రయాలు, మ్యుటేషన్‌ వేగంగా జరుగుతాయి. దీంతో రైతులు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం తప్పుతుంది. సీఎం కేసీఆర్‌ లక్ష్యమైన భూ వివాదాల్లేని తెలంగాణ సాకారం అవుతుంది.

- వంగ రవీందర్‌రెడ్డి, ట్రెసా అధ్యక్షుడు

అక్రమాలకు చెక్‌ పడుతుంది

తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి అన్యాయంగా భూములను గుంజుకోవడం వంటి అక్రమాలకు ధరణితో చెక్‌ పడుతుంది. డబుల్‌ రిజిస్ట్రేషన్లు ఆగిపోతాయి. 

- తొట్ల సైదులు, తాసిల్దార్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, రంగారెడ్డి జిల్లా