e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home Top Slides కోలుకొన్నాక బూజు బెడద!

కోలుకొన్నాక బూజు బెడద!

కోలుకొన్నాక బూజు బెడద!
 • దాడి చేస్తున్న బ్లాక్‌ ఫంగస్‌
 • కరోనా సోకిన నెలకు ఎఫెక్ట్‌
 • మెదడు, పైదవడపై తీవ్ర ప్రభావం
 • దీర్ఘకాలిక వ్యాధులుంటే ప్రమాదం

అసలే ఈ కరోనా వల్ల ఒంట్లో సత్తువ లేకుండా పోతున్నది.. ఊపిరితిత్తి పిప్పి అవుతున్నది.. గుండెకు దడ పుడుతున్నది.. మెదడు మొద్దుబారిపోతున్నది.. కిడ్నీలు చెడిపోతున్నాయి.. కాలేయం దెబ్బతింటున్నది.. కండరాలు బలహీనపడుతున్నాయి.. ఇప్పుడు శరీరానికి బూజు కూడా పడుతున్నది. ఇప్పటికే వైరస్‌ నుంచి కోలుకొన్నవారిలో దీర్ఘకాలిక ఇబ్బందులు వస్తుండగా, కొత్తగా బ్లాక్‌ ఫంగస్‌ దాడి మొదలుపెట్టింది. శరీరంలో పలు వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపి ప్రాణాలను హరిస్తున్నది.
హైదరాబాద్‌, మే 9 (నమస్తే తెలంగాణ): కరోనా నుంచి కోలుకొన్నాక 30 రోజులకు విజృంభిస్తున్న బ్లాక్‌ ఫంగస్‌ (మ్యూకోర్‌మైకోసిస్‌) వల్ల ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కొవిడ్‌ బారినపడ్డ బాధితుల్లో 1శాతం ఈ ఫంగస్‌ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్యనిపుణులు చెప్తున్నారు. కన్ను, పై దవడ తొలగించే పరిస్థితులు వస్తున్నాయని, సెకండ్‌ వేవ్‌లో దీని తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు వెల్లడిస్తున్నారు. మ్యూకోర్‌మైకోసిస్‌ అనేది ఒక అరుదైన ఫంగస్‌. సాధారణంగా మట్టిలో, మొక్కల్లో, ఎరువుల్లో కుళ్లిపోతున్న పండ్లు, కూరగాయల్లో ఉండే మ్యూకర్‌ (బూజు లాంటిది) వల్ల ఇది వస్తుంది. ఇంటా, బయట ఇలా అన్ని చోట్లా ఈ ఫంగస్‌ ఉంటుంది. ఇది సైనస్‌, మెదడు, ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. రోగనిరోధకశక్తిని నశింపజేసి హెచ్‌ఐవీ, క్యాన్సర్‌, మధుమేహం, ఆస్తమా, అవయవమార్పిడి చేసుకున్న వారిలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కరోనా వల్ల రోగనిరోధకశక్తి తగ్గిపోవటం దీనికి ఆసరాగా మారుతున్నది. గాలి ద్వారా ముక్కలోకి ప్రవేశించి.. కన్ను, పైదవడ, ఎముక, మెదడుకు వ్యాపిస్తుంది. ఇది బలమైన ఫంగస్‌ కాబట్టి వేగంగా విస్తరిస్తుంది. ఫంగస్‌ ఇన్ఫెక్షన్‌ పెరిగి రక్తనాళాలను బ్లాక్‌ చేస్తుంది. దీంతో రక్తప్రసరణ ఆ భాగానికి తగ్గి, అవయవం చచ్చుబడిపోతుంది.

చికిత్స అందించినా..

బ్లాక్‌ ఫంగస్‌పై పనిచేసే మందులు ప్రస్తుతం రెండు, మూడే ఉన్నాయని వైద్యారోగ్య నిపుణులు తెలిపారు. అవికూడా వైద్యుల పర్యవేక్షణలో ఇవ్వాల్సి ఉంటుందట. ఫంగస్‌ సోకినవాళ్లకు మెరుగైన చికిత్స అందించినా 20 శాతం మంది ప్రాణాలు కోల్పోతున్నారట. ప్రారంభ దశలో గుర్తిస్తే 15 నుంచి 20 రోజులు మందులు ఇచ్చి రోగిని కాపాడవచ్చని, ఆలస్యమైతే 40 రోజుల వరకు మందులు ఇవ్వాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో ఫంగస్‌ బారిన పడ్డారని, పదుల సంఖ్యలో మృతిచెందారని వెల్లడించారు.

బ్లాక్‌ ఫంగస్‌ని గుర్తించటం ఎలా?

కొవిడ్‌ సోకిన డయాబెటిస్‌, ఆస్తమా పేషెంట్లు జాగ్రత్తగా ఉండాలి. 40 ఏండ్లు పైబడి, దీర్ఘకాలిక వ్యాధులున్నవారే దీనికి టార్గెట్‌. మొదటి లక్షణం ముక్కులో ఇరిటేషన్‌ ఉంటుంది. ఆ సమయంలోనే ముక్కు ఎండోస్కోపిక్‌ పరీక్ష చేస్తే చర్మం పాడైందా? లేదా? అన్నది తెలుస్తుంది. నల్లని భాగం కనిపిస్తే అది బ్లాక్‌ ఫంగస్‌ అని గుర్తించాలి. పూర్తి స్థాయిలో ఫంగస్‌ నిర్ణీత చర్మభాగాన్ని తినేశాక నల్లగా మారుతుంది. అందుకే దీన్ని బ్లాక్‌ ఫంగస్‌ అంటున్నారు. ఇదే సమయంలో నల్లని జిగురు పదార్థాలు ముక్కు నుంచి బయటికి వస్తాయి. తర్వాతి స్టేజీలో కన్ను, పన్ను, దవడ ఎముకపై ప్రభావం చూపుతుంది. తలనొప్పి కలుగుతుంది. గుజరాత్‌లో దీని ప్రభావం ఎక్కువగా ఉండటంతో అక్కడి ప్రభుత్వం దవాఖానల్లో ప్రత్యేక మెడికల్‌ వార్డును ఏర్పాటు చేస్తున్నది.

బ్లాక్‌ ఫంగస్‌ వ్యాప్తికి కారణాలు

 1. కొవిడ్‌ చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్‌ని
  ఇష్టారీతిగా వాడటం
 2. రక్తంలో చక్కర శాతాన్ని అదుపులో
  ఉంచుకోవడంలో విఫలం
 3. బలహీన రోగనిరోధక వ్యవస్థ ఉండి,శ్వాస సమస్యలకు తోడు కరోనా జత కట్టటం.ముందుగా గుర్తించటమే పరిష్కారం కరోనా నుంచి కోలుకొన్నా డయాబెటిస్‌, ఆస్తమా ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలి. తెలంగాణ, ఏపీలో దాదాపు 400 మంది దాకా బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడినట్టు మా అంచనా. ఈ కేసులు పెరిగే అవకాశం లేకపోలేదు. కనీసం 1శాతం బ్లాక్‌ ఫంగస్‌ ప్రభావం ఉంటుందని అంచనావేశాం. ముందస్తుగా గుర్తించి చికిత్స మొదలు పెడితే సత్ఫలితాలు ఉంటాయి.
 • డాక్టర్‌ కేఆర్‌ మేఘనాథ్‌, ఎంఎస్‌, ఈఎన్‌టీ, డైరెక్టర్‌, మా ఈఎన్‌టీ హాస్పిటల్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కోలుకొన్నాక బూజు బెడద!

ట్రెండింగ్‌

Advertisement