బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Sep 08, 2020 , 19:59:09

సభ ప్రతిష్టను దిగజార్చేలా కాంగ్రెస్‌ వ్యవహారం : బాల్క సుమన్‌

సభ ప్రతిష్టను దిగజార్చేలా కాంగ్రెస్‌ వ్యవహారం : బాల్క సుమన్‌

హైదరాబాద్‌ : శాసనసభ ప్రతిష్టను దిగజార్చేలా కాంగ్రెస్‌ సభ్యులు వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు చేస్తున్న ఆరోపణలపై ఆయన మీడియా ద్వారా మాట్లాడుతూ... అసెంబ్లీలో పార్టీల బలం బట్టి సమయం కేటాయిస్తారు తప్పా సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. టీఆర్‌ఎస్‌ తమ గొంతు నొక్కుతుందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 

ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తుందన్నారు. స్పీకర్‌ను సైతం అవమాన పరిచే విధంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మాట్లాడారన్నారు. ఏ అంశంపై అయినా శాసనసభలో చర్చకు సిద్ధమని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు కాంగ్రెస్‌ చిల్లర ప్రయత్నం చేస్తోందన్నారు. సీఎం కేసీఆర్‌పై పరుష పదజాలంతో మాట్లాడడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. మాట్లాడే సత్తా లేక కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారన్నారు. పీవీకి భారతరత్న రావడం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు ఇష్టం లేదన్నారు. పీవీ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.


logo