గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 01, 2020 , 03:11:17

జీతాల బకాయిల చెల్లింపు ఈ నెల నుంచే

జీతాల బకాయిల చెల్లింపు ఈ నెల నుంచే

  • కరోనా, లాక్‌డౌన్‌తో మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో జీతాలు, పెన్షన్లలో కోత 
  • ఆర్థిక పరిస్థితులు మెరుగవడంతో బకాయిలు చెల్లించాలని నిర్ణయం
  • ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థికశాఖ

పెన్షనర్లకు...

అక్టోబర్‌, నవంబర్‌లో రెండు విడుతలుగా బకాయిల చెల్లింపు. 

ఉద్యోగులకు

ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్‌/ ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి అక్టోబర్‌, నవంబర్‌, డిసెంబర్‌, జనవరి నెలల్లో 4 విడుతలుగా చెల్లింపు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం తీపికబురు అందించింది. కరోనా, లాక్‌డౌన్‌ సమయంలో తగ్గించిన జీతాలు, పెన్షన్ల మొత్తాన్ని తిరిగి చెల్లించనున్నట్టు ప్రకటించింది. దసరా పండుగకు ముందు ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబాల్లో సంతోషాన్ని నింపింది. బకాయిల చెల్లింపులు ఈ నెల నుంచే ప్రారంభం కానున్నాయి. పెన్షనర్లకు రెండు విడుతల్లో, ఉద్యోగులకు నాలుగు విడుతల్లో చెల్లింపులు చేస్తారు. ఈ మేరకు ఆర్థికశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఉద్యోగులు, పింఛన్‌దారులకు మార్చి, ఏప్రిల్‌, మే నెలల బకాయిలు చెల్లించాల్సి ఉన్నది. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా గాడిన పడుతుండటం, ఆదాయం పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. కరోనా విజృంభణ, లాక్‌డౌన్‌తో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది.

ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్‌ చెల్లింపుల్లో కొంత మేర తాత్కాలికంగా నిలుపుదలచేస్తూ ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో నిర్ణయం తీసుకున్నది. సీఎం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75% నిలిపివేసింది. అఖిల భారత సర్వీసులైన ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ ఉద్యోగుల జీతాల్లో 60%, మిగతా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 50%, నాలుగో తరగతి, కాంట్రాక్ట్‌/ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాల్లో 10% చెల్లింపులు నిలిపివేశారు. రిటైర్డ్‌ ఉద్యోగులకు అందించే పెన్షన్లలో 50%, నాలుగో తరగతి ఉద్యోగుల పెన్షన్లలో 10% ఆపారు. మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో జీతాల్లో పైన పేర్కొన్న శాతాల్లో జీతాలు బకాయి ఉన్నది. జూన్‌లో ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమై, ఆదాయం మెరుగుపడటంతో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు తిరిగి పూర్తి జీతాలు, పెన్షన్లు చెల్లిస్తున్నారు. తాజాగా ఉద్యోగులు, పెన్షనర్లకు బకాయిలను ఈ నెల నుంచే చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెన్షనర్లకు రెండు విడుతల్లో అక్టోబర్‌, నవంబర్‌లో చెల్లింపులు జరుపనున్నారు. ప్రభుత్వ, కాంట్రాక్ట్‌ /ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు నాలుగు విడుతల్లో అక్టోబర్‌, నవంబర్‌, డిసెంబర్‌, వచ్చే ఏడాది జనవరి నెలల్లో వారి ఖాతాల్లో బకాయిలు జమకానున్నాయి.

వేతన బకాయిల చెల్లింపు హర్షణీయం: టీఎన్జీవో 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వేతన బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటంపై టీఎన్జీవో కేంద్ర సంఘం హర్షం వ్యక్తంచేసింది. ఉత్తర్వులు జారీచేసినందుకుగాను సీఎం కేసీఆర్‌కు సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్‌ కృతజ్ఞతలు తెలిపారు.



logo