బుధవారం 03 జూన్ 2020
Telangana - Feb 28, 2020 , 03:24:08

ఆడబిడ్డలు మురిసేలా..

ఆడబిడ్డలు మురిసేలా..

పట్టును తలపించేలా.. బంగారు, వెండి రంగుల్లో మెరుస్తూ.. ఆడబిడ్డ మురిసేలా బతుకమ్మ చీరెలు సిద్ధమవుతున్నాయి. ఈసారి నూరువర్ణాలు.. 225 డిజైన్లతో కోటి చీరెల తయారీకి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్‌ ఇచ్చింది. మున్సిపల్‌, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్‌ చొరవతో రూ.317 కోట్ల విలువైన కోటి చీరెల ఆర్డర్లు మరోసారి సిరిసిల్లకు దక్కాయి. గతంలో శ్రమకు తగ్గ ఫలితం నేపథ్యంలో.. మరోసారి బతుకమ్మ చీరెల తయారీకి సిరిసిల్ల కార్మికక్షేత్రం సన్నద్ధమైంది. పట్టుచీరెలను తలపించేలా 6.30 మీటర్ల పొడవైన చీరెలు 90 లక్షలు, తొమ్మిది మీటర్ల పొడవైన పదిలక్షల చీరెలను వచ్చే సెప్టెంబర్‌ నెలలోగా సిద్ధంచేసేందుకు చేనేత జౌళిశాఖ చర్యలు చేపట్టింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటే బతుకమ్మ పండుగ సందర్భంగా 18 ఏండ్లు నిండిన ప్రతి పేదింటి మహిళలకు నాలుగేండ్లుగా ప్రభుత్వం చీరెలను కానుకగా అందిస్తున్నది. నాణ్యతలో రాజీపడకుండా, అందరినీ ఆకట్టుకొనేలా రంగురంగుల చీరెల తయారీకి రూపకల్పన చేసింది. గుజరాత్‌ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన నూలుతో 18 వేల మరమగ్గాలపై తయారీకి సిద్ధమైంది. దీంతో 10 వేల మంది నేతన్నలకు చేతినిండా పని, శ్రమకు తగిన వేతనం లభించనున్నది.

  • మస్తు రంగుల్లో కోటి బతుకమ్మ చీరెలు
  • 225 డిజైన్లలో పట్టును తలపించేలా..
  • అంచులకు బంగారు, వెండి రంగుల మెరుపులు
  • 6.30 మీటర్ల చీరెలు 90 లక్షలు.. 9 మీటర్లవి 10 లక్షలు
  • రూ.317 కోట్ల విలువైన చీరెల తయారీలో సిరిసిల్ల
  • మంత్రి కేటీఆర్‌ చొరువతో మరోసారి భారీ ఆర్డర్లు

రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: బతుకమ్మ చీరెల తయారీని ఈసారి ప్రభుత్వం రెండునెలల ముందే ప్రారంభించింది. నాలుగేండ్లుగా చీరెలను అత్యంత నాణ్యతతో అందిస్తున్న ప్రభుత్వం ఏటా సరికొత్త డిజైన్లను రూపొందిస్తూ వస్తున్నది. గతంలో పండుగకు ఐదునెలల ముందు ఆర్డర్లు ఇవ్వడంతో లక్ష్యాన్ని పూర్తిగా చేరుకోలేకపోయింది. అందుకే ఈ ఏడాది ఏడునెలల ముందుగా ఆర్డర్లు ఇవ్వడంతో చీరెల తయారీలో నాణ్యతతోపాటు నిపుణత, సరికొత్త డిజైన్లు ఉండేలా చర్యలు తీసుకొంటున్నది. ఆడబిడ్డలకు కానుకగా అందించే చీరెల తయారీతో ఇటు నేత కార్మికులకు కూడా చేతి నిండా పని, శ్రమకు తగ్గ వేతనం దక్కేలా చూస్తున్నది. నిష్ణాతులతో ఆకర్షణీయమైన డిజైన్లు, అందమైన రంగుల్లో తయారుచేయిస్తున్నది. ఏటా మార్పులు చేర్పులుచేస్తూ పట్టు చీరెలను తలపించేలా నాణ్యమైన నూలును వినియోగిస్తున్నది. ఈసారి గుజరాత్‌ నుంచి నూలును తెప్పించింది. చెక్స్‌, లైనింగ్‌, ప్లెయిన్‌ చీరెలు రూపుదిద్దుకోనున్నాయి. ఈ కోటి చీరల్లో 6.30 మీటర్ల పొడవైనవి 90 లక్షలు, 9 మీటర్ల పొడవైనవి 10 లక్షలు తయారుకానున్నాయి.


మంత్రి కేటీఆర్‌ చొరవతో సిరిసిల్లకే ఆర్డర్లు

టెక్స్‌టైల్స్‌ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్ననేపథ్యంలో సిరిసిల్ల వస్త్రపరిశ్రమను ఆదుకొనేందుకు మున్సిపల్‌, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరువ తీసుకొన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా ప్రభుత్వం నుంచి వస్త్ర తయారీ ఆర్డర్లు ఇప్పిస్తున్నారు. రంజాన్‌, క్రిస్మస్‌, బతుకమ్మ చీరెల తయారీతో ఇక్కడి నేతన్నలకు చేతినిండా పని, శ్రమకు తగ్గ వేతనం లభిస్తున్నది. దీంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభం నుంచి గట్టెక్కి అభివృద్ధివైపు పరుగులు పెడుతున్నది. ఈసారి బతుకమ్మ చీరల తయారీకి రూ.317 కోట్ల ఆర్డర్లు ఇవ్వడంతో సిరిసిల్లలోని 18 వేల మరమగ్గాలు, 10 వేల మంది కార్మికులకు ఉపాధి లభించనున్నది. చీరెల నాణ్యతను పరిశీలించేందుకు చేనేత జౌళిశాఖ 50 మంది అధికారులను నియమించింది. క్వాలిటీలో రాజీపడకుండా నాణ్యమైన చీరెల తయారీకి పకడ్బందీ చర్యలు తీసుకొంటున్నది.


30 లక్షల మీటర్ల ఉత్పత్తి

సిరిసిల్ల పార్కు అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకొంటున్నది. మంత్రి కేటీఆర్‌ ప్రత్యేకంగా నిధులు మంజూరుచేస్తున్నారు. పార్కులోని యూనిట్లు సంక్షోభంలో కూరుకుపోతే రుణాలు మాఫీ చేయించడంతోపాటు విద్యుత్‌ సబ్సిడీ రూ.7కోట్లకుపైగా ఇప్పించి ఆదుకొన్నారు. తెలంగాణతోపాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన కార్మి కులకు పనికల్పిస్తున్నారు. పట్టణంలోని మరమగ్గాలతోపాటు పార్కులోని 62 యూనిట్లకు 30 లక్షల మీటర్ల బతుకమ్మ చీరెల తయారీ ఆర్డర్లు ఇచ్చారు. రేపియర్‌ మరమగ్గాలపై చెక్స్‌, లైనింగ్‌, వివిధరకాల డిజైన్లను తయారుచేసేందుకు ప్రణాళికలు రూపొందించారు.


సెప్టెంబర్‌లోగా పూర్తిచేయాలి

బతుకమ్మ చీరెలు మంచి డిజైన్లతో తయారుచేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. గతంకంటే ఈసారి అందమైన డిజైన్లు, ఆకర్షణీయమైన రంగుల్లో తయారుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు టెక్స్‌టైల్స్‌ పార్కులోని 62 యూనిట్లను ఎంపికచేశాం. 30 లక్షల మీటర్లు సెప్టెంబర్‌ నెలలోగా పూర్తిచేస్తాం.

- తస్లీమా, చేనేత, జౌళిశాఖ డిప్యూటీ  డైరెక్టర్‌, సిరిసిల్ల టెక్స్‌టైల్స్‌ పార్కు అడ్మినిస్ట్రేటర్‌


మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు

వస్త్రపరిశ్రమను ఆదుకొనేందుకు మంత్రి కే తారకరామారావు ప్రత్యేక చొరవ చూపుతున్నారు. రంజాన్‌, క్రిస్మస్‌, బతుకమ్మ చీరెల ఆర్డర్లు సిరిసిల్లకే ఇవ్వడంతో అందరం సంతోషంగా ఉన్నాం. కార్మిక, యజమాన్య కుటుంబాల పక్షాన కేటీఆర్‌కు కృతజ్ఞతలు. ఈసారి బతుకమ్మ చీరెల ఆర్డర్లు కూడా పెంచారు. పార్కులో దాదాపు 1,500 మంది ఉపాధి పొందుతున్నారు. మంచి డిజైన్లు, చెక్స్‌, లైనింగ్‌తోపాటు వివిధరకాల డిజైన్లు రాపియర్‌ లూంలపై తయారీకి సిద్ధంచేస్తున్నాం. 

- అన్నల్‌దాస్‌ అనిల్‌, టెక్స్‌టైల్స్‌ పార్కు , వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు 


logo