మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 30, 2020 , 01:50:51

దవాఖానల నిర్వహణ భేష్‌

దవాఖానల నిర్వహణ భేష్‌

  • ప్రభుత్వానికి కేంద్ర బృందం కితాబు
  • టిమ్స్‌, గాంధీ హాస్పిటళ్ల సందర్శన
  • మౌలిక సదుపాయాలకు రూ.475.74 కోట్లు
  • కేంద్రబృందానికి సీఎస్‌, వైద్యఅధికారుల వివరణ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా బాధితులకు చికిత్స అందించడంతోపాటు భద్రతా చర్యలు తీసుకోవడంలో దవాఖానల నిర్వహణ బాగున్నదని కేంద్రబృందం కితాబు ఇచ్చింది. వైరస్‌ వ్యాప్తి నివారణ, పాజిటివ్‌కేసులకు వైద్యం ఎలా అందిస్తున్నారనే విషయాన్ని పరిశీలించేందుకు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌అగర్వాల్‌ బృందం హైదరాబాద్‌ పర్యటనకు వచ్చింది. సోమవారం గచ్చిబౌలిలో తెలంగాణ ఇన్‌స్టిస్ట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌)ను సందర్శించి, ఐసీయూ యూనిట్లు, ఐసొలేషన్‌ వార్డులను పరిశీలించింది. దోమల్‌గూడలోని కంటైన్మెంట్‌ ఏరియా ధోబిగల్లీకి వెళ్లి పరిశీలించింది. గాంధీ దవాఖానను సందర్శించింది. 

సచివాలయంలో సీఎస్‌తో భేటీ

కేంద్ర బృందం సచివాలయంలోప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమైంది. ఈ సందర్భంగా వైద్యారోగ్యశాఖ వైరస్‌ వ్యాప్తి నివారణకు తీసుకున్న చర్యలపై పవర్‌పాయింట్‌ ప్రెజంటేషన్‌ ఇచ్చింది. రాష్ట్రంలో కరోనా చికిత్సకు 17,081 పడకలను సిద్ధంచేశామని, మెరుగైన వైద్యసేవలు అందించడానికి అదనపు సిబ్బందిని నియమించామని తెలిపింది. వైద్య మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి రూ. 475.74 కోట్లు మంజూరుచేసినట్టు వివరించింది. సమావేశంలో వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కమిషనర్‌ యోగితారాణా, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, కలెక్టర్లు శ్వేతా మహంతి, అమోయ్‌కుమార్‌, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.       

సాయానికి సిద్ధం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

సికింద్రాబాద్‌ ఎంపీగా, కేంద్రమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వానికి కోరనా విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు జీ కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


logo