ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 05, 2020 , 00:48:01

అన్నంపెట్టే స్థాయికి తెలంగాణ

అన్నంపెట్టే స్థాయికి తెలంగాణ

  • కాళేశ్వరం తరహాలోనే త్వరలో పాలమూరు ఎత్తిపోతల పూర్తి
  • మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌

మద్దూరు: సీఎం కేసీఆర్‌ చేపట్టిన పథకాలతో దేశానికే అన్నం పెట్టే స్థాయి కి తెలంగాణ ఎదిగిందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎక్సైజ్‌ శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని లింగాల్‌చెడ్‌, నందిగామ, దుప్పటిగట్టు, మన్నాపూర్‌, మద్దూరు, నిడ్జింత తదితర గ్రామాల్లో రూ.20 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ప్రతి కేబినెట్‌ సమావేశంలో ఎజెండా ఏదైనా రైతుల సంక్షేమంపైనే సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా చర్చిస్తారని తెలిపారు. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో ధాన్యం పండించినట్లు ఇటీవల ఎఫ్‌సీఐ ప్రకటించడం రాష్ట్ర ప్రగతికి నిదర్శనమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలోనే పాలమూరు-రంగారెడ్డి పథకం పూర్తి చేసి ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో ప్రతి ఎకరాకు సాగునీటిని అందిస్తామని చెప్పారు. ఉద్యమ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబును తరిమిన ఘనత కొడంగల్‌ వాసులదని గుర్తుచేశారు. కోర్టు అనుమతితో పదోతరగతి పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి వైరస్‌ బారిన పడకుండా స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో నారాయణపేట జెడ్పీ చైర్‌పర్సన్‌ వనజ, కలెక్టర్‌ హరిచందన పాల్గొన్నారు.


logo