మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 15, 2020 , 01:47:41

ప్రభుత్వంపై విశ్వాసం ఉంచాలి: హైకోర్టు

ప్రభుత్వంపై విశ్వాసం ఉంచాలి:  హైకోర్టు

  • సర్కారు అప్రమత్తంగా ఉంది వర్షం సహాయ చర్యలపై సుమోటో విచారణకు నిరాకరణ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అతిభారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉన్నదని, అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నదని, ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నదని హైకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. సహాయక చర్యల అంశాన్ని సుమోటోగా స్వీకరించి విచారణ జరుపాలని పలువురు న్యాయవాదులు చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, బీ విజయసేన్‌రెడ్డి నేతృత్వలోని ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం ప్రజలు ఎన్నుకున్న పౌర ప్రభుత్వంపై విశ్వాసం ఉంచాలని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ విధుల్లో తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏమున్నదని, అధికార యంత్రాంగాన్ని తాము నడుపలేమని, అది తమ బాధ్యత కాదని హైకోర్టు స్పష్టంచేసింది. హైదరాబాద్‌ సహా ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాలతో ఇబ్బందులు ఎదురవుతున్న మాట వాస్తవమేనని.. అయితే ప్రభుత్వం అలర్ట్‌గా ఉన్నదన్న విషయాన్ని కూడా గమనించాలని పేర్కొన్నది. భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలపై సమీక్షా సమావేశాలనూ నిర్వహించిందని, ఈ విషయాలు పత్రికలు, ఇతర ప్రసార సాధనాల ద్వారా తమకు తెలుస్తున్నాయని వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో వర్షాల పరిస్థితిపై ఏంజరుగుతున్నదో తమకు అవగాహన ఉన్నదని ధర్మాసనం స్పష్టంచేసింది. సహాయక చర్యలపై సుమోటో విచారణ జరుపాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. 


logo