మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Sep 08, 2020 , 16:42:50

జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి మృతి ప‌ట్ల గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సంతాపం

జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి మృతి ప‌ట్ల గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సంతాపం

హైద‌రాబాద్ : ప్రముఖ నటుడు జయ ప్రకాశ్ రెడ్డి మృతిప‌ట్ల గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ సంతాపం తెలిపారు. ఈ మేర‌కు గ‌వ‌ర్న‌ర్ ట్వీట్ చేశారు. జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి అకాల మరణం త‌న‌ను దిగ్ర్భాంతికి గురి చేసింద‌ని గ‌వ‌ర్న‌ర్ అన్నారు. ఆయన మృతి సినీ రంగానికి, కళా రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు. విశిష్టమైన నటన ప్రతిభతో, వైవిధ్యమైన పాత్రల్లో ఆయన గొప్పగా రాణించారు అని గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై కొనియాడారు. 

మంగళవారం తెల్లవారు జామున జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి గుండెపోటుతో గుంటూరులో మృతి చెందారు. బాత్‌రూమ్‌లోనే ఆయ‌న కుప్పకూలిపోయాడు. కరోనా మహమ్మారి నేపథ్యంలో సినిమా షూటింగ్‌లు లేకపోవడంతో ప్రస్తుతం ఆయన గుంటూరులో నివాసం ఉంటున్నారు. జేపీది సొంతూరు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం సిరివెల్ల. 1949, మే 8న ఆయన సిరువెల్ల గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే నాటకాలు అంటే ఆయనకు బాగా ఆసక్తి. దీంతో ఆయన స్వగ్రామం నుంచి గుంటూరుకు వచ్చారు. నల్గొండ జిల్లాలో గప్‌చుప్‌ అనే నాటకాన్ని ప్రదర్శిస్తుండగా.. ప్రముఖ దివంగత దర్శకుడు దాసరి నారాయణరావుకు జేపీ నటన నచ్చి సినీరంగానికి పరిచయం చేశారు. 1988లో విడుదలైన బ్రహ్మపుత్రు సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. 1997లో విడుదలైన ప్రేమించుకుందాం రా సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు లభించింది.


logo